ప్రజలకు అందుబాటులో పరిపాలన
- 85 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు అన్నీ ప్రారంభం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాల కలెక్టర్లతో ఆయన ఈ విషయమై మంగళవారం ఇక్కడ సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని తెలిపారు. అధికారుల సర్దుబాట్లు, కొత్త ఉద్యోగుల నియామకాలు జరగాలని సూచించారు. దసరా నాడు కొత్త జిల్లాలు ప్రారంభమైన తర్వాత మొదటి రోజు నుంచే రెవెన్యూ, పోలీసు శాఖలు ప్రారంభం కావాలని, మిగిలిన శాఖల కార్యాలయాలు, అధికారుల నియామకం ఆ తర్వాత చేపట్టాలని కేసీఆర్ చెప్పారు.
జిల్లా కలెక్టర్లు ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయన సూచించారు. ప్రజలకు పాలన చేరువ చేయడానికే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. జిల్లా యూనిట్లు చిన్నగా ఉంటే సంక్షేమ పథకాల పర్యవేక్షణ సులువు అవుతోందన్నారు. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా విభాగాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలో సంక్షేమ అధికారుల నియామకం ఎక్కువగా చేపట్టాలని, ఆదిలాబాద్‌లో వైద్య ఆరోగ్యశాఖను పటిష్టం చేయాలన్నారు. కొత్త జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలన విభాగాలు ఉండాలని సీఎం చెప్పారు. దీనికనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు, కొత్త నియామకాలు చేపట్టాలని అన్నారు.
దసరా నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 కొత్త మండలాలను నోటిఫై చేశామని, మరో 30 మండలాల డిమాండ్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల పెంపు, తగ్గింపు, సర్దుబాటును ఆయా శాఖల పనిభారం ఆధారంగా నిర్ణయించాలని ఆయన చెప్పారు. పరిపాలన విభాగాల ఏర్పాటుపై తమ ప్రతిపాదనలను సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు, సీనియర్ అధికారులు వివరించారు. మరోవైపు, తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇవాళ మరో దఫా జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లతో భేటీ అయ్యారు.
కొత్త జిల్లాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది విభజనపై చర్చ జరగనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు, ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్లతో సమావేశమయ్యారు. మరోవైపు ఉన్న వ్యవధిలోగా ఉద్యోగులు, వస్తువులు, వాహనాలను జిల్లాల మధ్య విభజించాల్సి ఉంది. ఈ రకమైన అన్ని విధివిధానాలపై సీఎం సమావేశంలో చర్చ జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం పెట్టుకున్న గడువు దసరా దగ్గరపడుతుందటం, ఇప్పటికే ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు, సూచనలు నమోదవుతుండటంతో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఆన్లైన్లో దాదాపు 31వేలకు చేరిన ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందనతో పాటు, రాజకీయంగా వస్తున్న విమర్శలకు సమాధానం ఎలా చెప్తారన్నది కూడా తేలాల్సి ఉంది.
సమగ్ర వ్యవసాయ విధానం కోసం మౌనదీక్ష
అసెంబ్లీలో రైతు సమస్యపై చర్చించాలి: కోదండరామ్
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో తక్షణమే ప్రభుత్వం వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించాలని ప్రభుత్వానికి మెమోరాండం ఇస్తామని చెప్పారు. భూ సేకరణలోనూ, నష్టపరిహారం అందించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రైతు సమస్యలపై వచ్చేనెల 2న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేస్తామని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ త్వరలో అన్ని జిల్లాల నుంచి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. రైతు సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, వ్యవసాయశాఖ కూడా రైతులకు సహకరించడం లేదన్నారు. రైతులకు మేలు చేస్తామంటున్న ప్రభుత్వం బ్యాంకు రుణాలు ఇప్పించడంలో విఫలమైందన్నారు. ఇదే సాకుగా బ్యాంకులు కూడా రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. గత ఏడాది పంటనష్టం ఇన్‌పుడ్ సబ్సిడీని చెల్లించలేదన్నారు. మూడోదశ రుణమాఫీ నిధులను కూడా చెల్లించలేదన్నారు. అసలు రైతుపట్ల చిత్తశుద్ధి కనపడడంల లేదన్నారు. రైతు సమస్యలపై స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే త్వరలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు.
ఏపీ శాసనసభ 15 రోజులైనా జరగాలి: వైకాపా
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కనీసం 15 రోజులపాటైనా నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీ వైకాపా డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం తు.తుమంత్రంగా నిర్వహించాలని చూస్తుందని ఆరోపించారు. రాష్ట్ర మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆ పదవిలో కొనసాగడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవును నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సదావర్తి భూముల్లో జరిగిన అవినీతిపై, అలాగే కృష్ణా పుష్కరాల్లో జరిగిన అవినీతిపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. ఈ పాపంలో కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టిడిపి కూడా వహించాలని అన్నారు. కరవు కోరల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని కాపాడడంలో కూడా ప్రభుత్వంవిఫలమైందని అన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలి కేవలం ముఖ్యమంత్రి ప్రచారాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. రాజధాని భూముల్లో కూడా భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపై సమగ్ర చర్చించేందుకు కనీసం 15 రోజులపాటైనా అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు సమాధానం చెప్పలని స్థితిలో ప్రభుత్వం ఉన్నదని, అందుకే శాసనసభ సమావేశాలను తుతు మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 9 జిల్లాల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కె. కన్నబాబు చెప్పారు. ఎన్నికలకు ఇప్పటినుంచే పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని, పార్టీ కేడర్ అంతా టీమ్ వర్క్‌గా పనిచేయాలని వైఎస్ జగన్ చెప్పారని కన్నబాబు తెలిపారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇంచార్జ్‌లను నియమించినట్టు చెప్పారు. ఈ నెల 11న వైఎస్ఆర్సీపీ మున్సిపల్ ఎన్నికల కార్యక్రమాలను ప్రారంభిస్తుందని కన్నబాబు తెలిపారు. సేవా ధృక్పథం, మంచిపేరు, విధేయత కలిగినవారికే అభ్యర్థులుగా ప్రాధాన్యమివ్వాలని వైఎస్ జగన్ చెప్పారని వెల్లడించారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం యధావిథిగా కొనసాగుతుందని, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్టు కన్నబాబు తెలిపారు.


