ప్రజల గుండెల్లో చెరగని ‘గీత’
భగవద్గీతను తెలిసిన వారెవరూ ఒక మత గ్రంథంగా భావించరు. జీవితపు చీకటి వెలుగుల్లో ఎలా నడుచుకోవాలో ‘గీత’ చెబుతుంది. అందుకే హిందూ మతాన్ని నిరసించే భౌతిక వాదులు కూడా (వేరే మతాన్ని నిరసించడానికి వీరికి సెక్యులరిజం అడ్డొస్తుంది) గీతను మినహాయిస్తారు. కేవలం మనిషి జీవించే కాలానికి సంబంధించిన మార్గదర్శి కాదు భగవద్గీత. జీవాత్మ. పరమాత్మల విచికిత్సను, ప్రేరేపిస్తూ ఆధ్యాత్మిక సముద్రాన్ని దాటడానికి భక్తినావను ఎలా ఎదురుగాలిలో కూడా సుళువుగా నడపాలో ‘గీత’ చెబుతుంది. అంతేనా? మరణం, మరణానంతర జీవితం ఎలానూ ఉండనే ఉంటాయి.
కనుక వాటి గురించి ఆలోచించడం మాని, కర్తవ్య దీక్షకు తక్షణం పూనమని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇందులో హితవు చెబుతాడు. అందుకే అమర్త్యసేన్ నుంచి ఐన్స్టీన్దాకా, మహాత్మాగాంధీ నుంచి లోకమాన్య తిలక్, రచయిత ఆల్టాస్ హెక్స్లీదాకా ఎందరో మహానుభావులు భగవద్గీతకు ముకుళిత హస్తాలతో నమోవాక్కులు పలికారు. కురుక్షేత్ర యుద్ధ ఘట్టంలో శత్రు శిబిరంలోని బంధువర్గం, గురువర్గాన్ని చూసి అస్త్రసన్యాసం చేయబోయిన అర్జునుని వారిస్తూ ‘చంపెడిది ఎవరు? చచ్చెడిది ఎవరు? అంతా నేనే’ అని చెప్పి కర్తవ్యదీక్ష బుద్ధునిగాచేసే శ్రీకృష్ణుని ఉద్బోధలో చంపమని ప్రోత్సాహించే హింసా బీభత్సాలను చూస్తారు కొందరు.
కానీ కృష్ణవాక్కు అదికాదు. యుద్ధ నివారణకు శ్రీకృష్ణుడు దౌత్యం ఫలించక పరిస్థితి ‘అనివార్యం యుద్ధం’గా మారినప్పుడు ఇక చేయగలిగింది కర్తవ్య ఆచరణే తప్ప నీళ్లు నమలడం కాదని శ్రీకృష్ణుడు చెప్పాడు. అటువంటి ‘భగవద్గీత’పై హింసను ప్రేరేపిస్తున్నట్లు ముద్ర వేయడానికి సాహసించి, నిషేధం విధించాలంటూ రష్యా లోని ఆర్థడాక్స్ చర్చి పనుపుపై కోర్టుని కోరడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఒక మత గ్రంథంపై ఇటువంటి తెంపరితనం ప్రదర్శించడం ఘటన ఇదొక్కటే. పైగా కర్మ (పని) విశిష్టతను, కర్తవ్యదీక్షను ప్రబోధించే ‘గీత’పై హింసరచన, ధ్వంసనచణ ముద్రవేయడం కూడా ఇదే ప్రథమం.
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ (ఇస్కాన్) వ్యవస్థాపకుడు ఎ.సి. భక్తివేదాంత భగవద్గీత అనువాద గ్రంథాన్ని నిషేధించాలని రష్యాలోని ఆర్థడాక్స్ చర్చి కోర్టుకెక్కినా, అందుకు వారు చూపుతున్న ‘హింసాకాండ ప్రేరేపణ’ అపవాదు మాత్రం భగవద్గీతపైనే కాదా? గీతకు సంబంధించిన ఒకానొక అనువాద గ్రంథంపై నిషేదాన్ని కోరితే ఇంత గగ్గోలా అని ప్రశ్నించే వారూ మన దేశంలోనే ఉన్నారు. వారు అన్యమత రాజ్యాలను స్వాధీనం చేసుకొమ్మని, అందలి ప్రతిఒక్కరిని సంహరించమనీ దేవుని వాక్కుగా దూత చేత చెప్పించిన ఒకానొక మతగ్రంథం (పాత పాఠం)ను వెనకేసుకు రాగలరా? కూర్చోడానికి, లేవడానికి, భార్యతో సంసారం చేసుకోడానికి కూడా ‘యుద్ధం’ అంటూ రౌద్రరూపం దాల్చే మరొక మతం వారికి ‘అయ్యా మీమత గ్రంథంలో అలా లేదు’ అని స్పష్టం చేయరెందుకు?
స్త్రీల అణచివేతను న్యాయంగా నిరసించే మేధావులు కూడా అన్యమతస్థులవారు తమ మత గ్రంథాలు చెబుతున్నదే చేస్తున్నామంటూ బుకాయిస్తుంటే ఆ ఘటనలను ఖండించరెందుకు? చిత్రం ఏమిటంటే సదరు మేధావులకు ‘భగవద్గీత’ నిషేధం అర్జీ చిన్న కోర్టు కేసులాగే ఆనుతోంది. తీర్పుకోసం వేచి చూద్దాం అని ఏదో గోడ తగువు లాగా దీన్ని పరిగణిస్తున్నారు. రష్యాలోని సైబీరియాలో టామ్క్స్ నగరంలోని ఆర్థడాక్స్ చర్చి ఇటువంటి అసమంజస కోర్టు లావావేదీలకు దిగడానికి కారణం ఇస్కాన్‌తో ఎప్పటినుంచో దానికున్న వైరమే. భక్తి వేదాంత ప్రభుపాద ‘భగవద్గీత యాజిటీజ్’ పేరుతో ప్రస్తుత వార్తలోని అనువాద గ్రంథాన్ని వ్యాఖ్యానసహితంగా రాశారు. భక్తి వేదాంత బుక్‌ట్రస్ట్ 20 ఏళ్ల క్రితం ఈ గ్రంథాన్ని ప్రచురించింది.
గత జూన్‌లో దాఖలైన కేసులో ప్రాసిక్యూటర్ ఇస్కాన్‌తో పడని విక్టర్ ఫ్యోదొటోవ్ కావడం ఇక్కడ కీలకం. ఇతడు లూమ్స్ స్థానిక కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ కేసు వేయడానికి ముందు ఆ పుస్తకంలోని వ్యాఖ్యానాలపై టామ్స్క్ స్టేట్ యూనివర్శిటీ నిపుణుల లోతైన పరిశీలన సాగింది. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుపాద అనువాద గ్రంథ నిషేధాన్ని కోరుతున్నాననీ అతడు చెబుతున్నాడు. అయితే ఆ నిపుణులంటున్న వారు తమది అధికారిక నిర్ధారణ కాదని చెబుతున్నారు. తమది కేవలం వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. కోర్టు కెక్కడాన్ని వారు ఎంతమాత్రం సమర్థించడం లేదు.
భగవద్గీతలో విచ్ఛిన్నకర ధోరణులు ఉన్నాయన్న కేసు వేసిన వారి వాదనకు కూడా వారి వత్తాసు లేదు. కోర్టు పిలిపించిన ఇద్దరు సలహాదార్లు కూడా యూనివర్సిటీ నిపుణుల అభిప్రాయాన్ని త్రోసిపుచ్చారు. ఐతే ప్రభు పాద గీత అనువాద వ్యాఖ్యానంలో కృష్ణ చైతన్య ఉద్యమానికి చెందనివారిపై నిందాపూర్వక భాష వాడారని సలహాదార్లు కోర్టుకు చెప్పారు. ఐతే ఆ వ్యాఖ్యలు జాతిపరమైన, మతపరమైన ద్వైదీభావాలను రెచ్చగొట్టేవిగా లేవని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. బైబిల్లో కూడ ‘డోంట్ త్రో పెరల్స్ బిఫోర్ స్వైన్’ వంటి భేద భావ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా అన్నారు.
ఈ విషయం అలా ఉంచితే రష్యా ఆర్థోడాక్స్ చర్చికీ, ఇస్కాన్కీ మధ్య వైరం చాలాకాలంగా నడుస్తోందని తెలుస్తోంది. మాస్కోలో ఇస్కాన్ భవన నిర్మాణాన్ని చర్చి అడ్డుకొన్నట్టు చెబుతున్నారు. మనదేశంలో మత మార్పిడులు సాగించే మిషనరీలపై ఉన్న వ్యతిరేకత అక్కడి చర్చికి ఇస్కాన్ పై ఉంది. ఇస్కాన్ అంతర్జాతీయంగా కృష్ణ చైతన్య స్పృహను వ్యాప్తి చేస్తోందని చర్చి కన్నెర్ర. మనదేశంలోని మఠాధిపతులవలె కాకుండా ఇస్కాన్ అంతర్జాతీయ సమాజంలోకి చొచ్చుకుపోతూ, తాము నమ్మినదానిని ప్రచారం చేస్తోందనడంలో సందేహం లేదు. కాని మత సహనం పరిఢవిల్లే చోట అసలు ఇది సమస్య కాదు.
ఎందుకంటే కృష్ణ చైతన్య తత్వం హిందూమతానికి పూర్తిగా ప్రాతినిధ్యం వహించేది కాదు. అది హిందూ ఉప శాఖ మాత్రమే. భజనల సంస్కృతిని వ్యాప్తి చేయడమే దానిపని తప్ప మతమార్పిడులు కాదు. అందుకే టామ్స్క్ కోర్టు ఈ కేసులో తీర్పు నిరవధికంగా వాయిదా వేసింది. రష్యాలో ఇస్కాన్‌కు లక్ష మందికి పైగా అనుయాయులుండడం ఆర్థోడాక్స్ చర్చికి కంగారు పుట్టించడమే ఈ కేసు వేయించడానికి దారితీసిందని చెప్పవచ్చు. ఇస్కాన్ రెండు నెలల క్రితమే ఈ కేసును సోనియాతో సహా మన కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తెచ్చింది. ‘గీత’పై వేటు పడకుండా చూడమని కోరింది.
ఇటీవల పార్లమెంటు సభ్యులు చాలామంది పార్టీ వైఖరులకు అతీతంగా ఈ కేసును ఖండించారు. ఈ కేసు ఫలితంపై ఎవరికీ సందేహం లేదు. నిషేధం విజ్ఞప్తి తిరస్కారానికి గురికావచ్చు. ఐతే మతగ్రంథంపై ఈ రకం దాడికి కోర్టు తీర్పరి కావడం ఇందులోని కొత్త పరిణామం. హిందూమతం ‘డాక్ట్రిన్డ్ (పవిత్ర గ్రంథం ఆధారిత) ‘ఫిలాసఫీ’ కాకపోవడంతో దైవప్రార్థనకు విధిగా భగవద్గీత ఆధారం కాదు. భగవద్గీతలో నాయకుడు (ఉత్తరోత్తరా దేముడు) శ్రీకృష్ణుడు. ఇతడు రాసలీలల కృష్ణునికి భిన్నంగా గొప్ప దౌత్యనీతిజ్ఞుడు. ఇక కురుక్షేత్రంలో ఇతడొక అనుశాసనికుడు. కర్తవ్య దీక్షా ప్రబోధకుడు. శాంతంగా ప్రవచించే ఉగ్రరూపుడు. ఇతని మాటల్లో సర్వజనహితం, అందుకు కావలసిన శిష్టరక్షణ, దుష్టశిక్షణ తప్ప మరింకే వాదాన్నీ బోధించడు.
అందుకే భగవద్గీత ఒక ఆరాధ్య గ్రంథమయింది తప్ప ఆరాధనా గ్రంథం కాలేదు. సార్వజనీనకత గీతా బోధనలో మనం చూస్తాం. కృష్ణుడు తెలుసుకోమని చెబుతాడు తప్ప తాను చెప్పినదే విధిగా ఆచరించమని ఎక్కడా చెప్పడు. తన గురించి ఆలోచించేవారి యోగక్షేమాలు తానే చూస్తానంటాడు… అన్యమనస్కత వద్దంటాడు. హింసను నిర్ద్వందంగా ఖండిస్తాడు. పండితా: సమదర్శిన: అనడంలో సర్వమానవ సమానత్వన్ని ప్రవచించాడు. ఎక్కడ ముట్టుకొన్నా భగవద్గీతలో హింసా ప్రేరేపణ మనల్ని తాకదు. అందుకే కేవలం ఓ మతగ్రంథంగా కాకుండా సర్వజన హిత గ్రంథంగా భగవద్గీత నిలిచింది.
దురదృష్టవశాత్తూ మనదేశంలో భగవద్గీత ఎవరైనా చనిపోతే ఇంట్లో, పెద్ద నాయకుడు చనిపోతే సందు సందునా వినబడుతోంది. ‘కర్మ’ ప్రస్తావన పదే పదే ‘గీత’లో ఉండడం కారణం కావచ్చు. ఇక్కడ కృష్ణుడు చెప్పిన ‘కర్మ’ ఎవరైనా చనిపోతే చేసే దశ దిన కర్మ వంటిది కాదు. ఆయన అంటున్న ‘కర్మ’ అంటే పని. ఇంకా విస్తృతార్థంలో ధర్మాచరణ. ఇదంతా చెప్పడం ఎందుకంటే హిందూ సమాజంలో దాని స్థానం ఏమిటో చర్చించడానికే. క్రైస్తవులకు ‘బైబిల్’లా, ముస్లింలకు ‘ఖురాన్’లా కాదని చెప్పడానికే. అందుకే చెరగని ‘గీత’ భగవద్గీతకు జై!


