ప్రతిపక్షాలు ప్రజల పక్షం లేవు: కర్నె
- 100 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ప్రతిపక్ష నేతలు అధికార పార్టీని విమర్శించడమే ఎంజెడాగా పెట్టుకుని ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మండిపడింది. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మంగళవారం హైదరాబాద్‌లో విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలది ప్రజల పక్షం కాదని, తెలంగాణకు నష్టం కలిగించే పక్షమని ఆరోపించారు. అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రతిపక్షాలు ధర్నాలు, ఆందోళన చేస్తాయని, కానీ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేస్తున్న అభివృద్ధితో తమకు రాజకీయంగా సమాధి తప్పదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని, అందుకే ప్రభుత్వం ఏ పని చేపట్టినా అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అలాంటి సీఎంను అనవసరంగా విమర్శిస్తే ప్రజలు వూరుకోరని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గద్వాల, జనగాం జిల్లాలు ఏర్పాటుచేయాలని అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17 నిర్వహణపై భాజపా తమను విమర్శించడం తగదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడితే జైళ్లొ పెట్టి పనులు పూర్తిచేస్తామన్నారు.
మరోవైపు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అభివృద్ధి అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ నేతలు అనడం దారుణమని వ్యాఖ్యానించారు. కోర్టుకు వెళ్లి కొత్త జిల్లాలను అడ్డుకుంటే ఆయా నేతలను గ్రామాల్లోకి రానివ్వొద్దని ప్రజలను సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కేసీఆర్‌కు మంచిపేరు వస్తోందన్న అక్కసుతోనే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. జిల్లాల ఏర్పాటుపై సిద్దిపేట, జగిత్యాల చౌరస్తాలో చర్చలకు సిద్ధమా? అని సవాల్ చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చాలా శాస్త్రీయంగా జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు.
పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు
కొత్త జిల్లాలపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): కొత్తగా ఏర్పాటుచేస్తున్న జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని, దీనికి అనుగుణంగా అధికారుల సర్దుబాటు, కొత్త ఉద్యోగుల నియామకం జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూర్పుపై ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి.లో మంగళవారం సమీక్ష జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. మంత్రులు జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు హాజరయిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా సమాంతరంగా ప్రారంభం కావాలన్నారు. ముందుగా కొత్త మండలాలను నిర్ధారించాలని, తర్వాత రెవిన్యూ డివిజన్లను కూర్పు చేయాలని సీఎం సూచించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో మొదటిరోజు నుంచే రెవిన్యూ, పోలీస్ శాఖలు పని ప్రారంభించాలని ఆదేశించారు. మిగతా శాఖల కార్యాలయాలు, అధికారుల నియామకం కూడా ఆ తర్వాత చేపట్టాలని వివరించారు. మూడు అంచెలలో పరిపాలనా విభాగాల ఏర్పాటు, అధికారుల నియామకం తదితర ప్రక్రియలను కలెక్టర్లు పర్యవేక్షించాలని చెప్పారు. మండలాల్లో రెవిన్యూ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఇప్పటికే విడుదల చేసిన డ్రాప్టు నోటిఫికేషన్‌పై ప్రజల నుంచి వచ్చిన స్పందన, అధికారులు చేసిన కసరత్తుల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి పునర్ వ్యవస్థీకరణకు తుది రూపం ఇవ్వాలని సిఎం చెప్పారు. ఓ కుటంబం ఇల్లు మారినప్పుడు ఉండేలాంటి సమస్యలే, కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తలెత్తుతాయన్నారు. ప్రారంభదశలో ఎదురయ్యే సహజ సమస్యలను గుర్తించి, పరిష్కరించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 మండలాల కోసం కొత్తగా డిమాండ్లు రాగా, వాటిలో ఇప్పటికే 45 మండలాలను నోటిఫై చేసినట్లు సీఎం చెప్పారు. మరో 30 మండలాల కోసం డిమాండ్లు వచ్చాయని, వాటి సాధ్యా సాధ్యాలపై వెంటనే నిర్ణయం జరగాలని చెప్పారు. కొత్తగా ప్రతిపాదించే మండల జనాభా 35 వేలకు పైగా ఉండాలనే నిబంధన పెట్టుకున్నామన్నారు. అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, చెంచులు నివసించే ప్రాంతాలకు సంబంధించి జనాభా విషయంలో సడలింపు ఇవ్వాలని సూచించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త మండలాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. పరిపాలనా విభాగాల ఏర్పాటుకు సంబంధించి సీనియర్ అధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించారు. ఉద్యోగుల పెంపు, తగ్గింపు, సర్దుబాటు, ఆయా శాఖల పనిభారం ఆధారంగా నిర్ణయించాలన్నారు. అధికార యంత్రాంగం సమర్ధంగా పనిచేయడం, ప్రజలకు పాలన చేరువ చేయడం, శాంతి భద్రతల పర్యవేక్షణ తదితర విషయాల్లో మరింత బాగా సేవలందించడానికి అనుగుణమైన వాతావరణం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతీ కుటుంబంపై అవగాహన కలిగి వుండడం, పేదలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, క్షేత్ర స్థాయిలో స్వయంగా పనులు పర్యవేక్షించడం చిన్న పరిపాలనా విభాగాల ఏర్పాటు లక్ష్యమన్నారు. జిల్లా యూనిట్లు చిన్నగా వుంటే ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ సులువు అవుతుందన్నారు. ఆయా ప్రాంతాల స్వభావం, సామిజిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ శాఖల విభాగాలను ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. ఆదిలాబాద్ లో అంటురోగాలు ఎక్కువ కాబట్టి అక్కడ వైద్య, ఆరోగ్య శాఖను పటిష్టం చేయాలని, ఏజెన్సీ ఏరియా ఎక్కువ వున్న చోట సంక్షేమ అధికారుల నియామకం ఎక్కువ చేయాలని సిఎం వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు ఎక్కువ అవసరం అని సిఎం అన్నారు. దీనిని బట్టి కొత్త ఉద్యోగులను నియమించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
యాచక చిన్నారులను పట్టుకున్న అధికారులు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమీపంలో గాంధీ వేషం వేసుకున్న బాలుడితో పాటు బీహార్‌కు చెందిన రోహిత్‌కుమార్ అనే యువకుడిని ఛైల్డ్వెల్ఫేర్ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి మహ్మద్ ఇంతియాజ్ రహీం, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ మెంబర్ అచ్యుత్‌రావు బాలల సంరక్షణ చర్యల్లో భాగంగా వీరిని అధికారులకు అప్పగించారు. ఇంకా మరికొందరిని పట్టుకొనే అవకాశం ఉంది. కాగా, ఇన్నర్‌వీల్ క్లబ్ సికింద్రాబాద్, రోటరీ క్లబ్ హైదరాబాద్ మిడ్‌టౌన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పంజాగుట్ట ప్రభుత్వ (పడవ) పాఠశాల విద్యార్థులకు బూట్లు, సాక్సులు, రాత పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం నాగార్జున హిల్స్‌లోని పంజాగుట్ట ప్రాథమిక పాఠశాల (పడవ) విద్యార్థులకు బూట్లు, రాత పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలన్నారు. పాఠశాలకు అవసరమైన ప్రహరీ నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్నర్‌వీల్ క్లబ్ సికింద్రాబాద్ ఛైర్మన్ స్వర్ణలత, జిల్లా ఛైర్మన్ సౌందర్య, రోటరీ క్లబ్ ప్రతినిధి సీమాకుమారి తదితరులు పాల్గొన్నారు.


