ప్రతిభ ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు
కడప, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): ప్రతి విద్యార్థి ప్రణాళికలతో విద్య అభ్యసించి అనుకున్న రంగంలో రాణించాలని డీటీసీ ఎం.బసిరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం కడప నగర శివారులోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థులకు స్వాగతోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన డీటీసీ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు. ప్రస్తుతం ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉందని.. ఇటివల కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా బీటెక్ విద్యార్థులు ఎక్కువ మంది దరఖాస్తులు చేశారంటే అర్థం చేసుకోవలన్నారు. జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించి సొంతూరికి సమాజానికి ఉపయోగపడే పనులు చేపట్టాలని ఉద్బోందించారు. కళాశాల వైస్ ఛైర్మన్ చొప్పా యల్లారెడ్డి మాట్లాడుతూ కళాశాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ స్వామి వివేకానంద, అబ్దుల్‌కలామ్ లాంటి గొప్పవ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎ.సుధాకర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శశికుమార్‌రెడ్డి, ఏవో రామసుబ్బారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
వివాదాస్పదంగా కౌన్సెలింగ్ ప్రక్రియ
కడప, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): కడప నగరంలోని ఫాతిమా వైద్య కళాశాలలో మెడికల్ కౌన్సెలింగ్‌కు పిలిచి కనీస సమయం ఇవ్వకుండా ముగించారంటూ వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫాతిమా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేరేందుకు కౌన్సెలింగ్ నిర్వహించగా ర్యాంకులు, మెరిట్ ఆధారంగా ప్రక్రియ సాగుతుంది. అయితే అందుకు విరుద్ధంగా ఎంపిక చేస్తున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోయారు. కళాశాలలో కౌన్సెలింగ్ ఉంటుందని 30వతేదీనే తమకు సమాచారం ఇచ్చి అదే రోజు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నార¹ని కర్నూలుకు చెందిన వైద్య విద్యార్థి తండ్రి గౌస్ తెలిపారు. కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినా 10 గంటలోపు రాలేదని తమను అనుమతించలేదని చెప్పారు. 40 వేల ర్యాంకున్న వారికి సీటిచ్చి అంతకంటే తక్కువ ర్యాంకు ఉన్న వారిని పట్టించుకోలేదని కర్నూలుకు చెందిన మరో విద్యార్థి అల్తమష్ వాపోయారు. వర్షంలో తడుస్తూనే బయటున్నామని చెప్పారు. ఎంతకూ తమను పిలవలేదని తెలిపారు. ఈ విషయంపై యాజమాన్యం వివరణ కోరాలని యత్నించగా లోపలికి అనుమతించలేదు.
బడి నిర్వహిస్తే లాంగ్‌బెల్ కొట్టండి: డీఈవో
కడప, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): దసరా సందర్భంగా ప్రభుత్వం శుక్రవారం నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ సమాచారాన్ని ఆయా పాఠశాలల యాజమాన్యాలకు అందజేశారు. అయినా శుక్రవారం పలు ప్రైవేట్ పాఠశాలలు తరగతులను కొనసాగించాయి. నగరంలోని యర్రముక్కపల్లె సమీపంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. సెలవులు ప్రకటించినా తరగతులు నిర్వహించుకోవడం ఏంటని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులందరినీ విద్యాశాఖ అధికారులు లాంగ్ బెల్ కొట్టించి ఇంటికి పంపించి వేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అన్ని పాఠశాలలూ తప్పనిసరిగా విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను తరగతులకు పంపించకుండా సహకరించాలన్నారు. తమ సిబ్బంది బృందాలుగా ఏర్పడి అన్ని పాఠశాలలను సందర్శిస్తున్నారనీ ఎక్కడైనా తరగతులు నిర్వహిస్తుంటే లాంగ్ బెల్ కొట్టించి అందరినీ ఇళ్లకు పంపించి వేస్తారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విద్యార్థులకు తప్పనిసరిగా దసరా సెలవులు ఇవ్వాలని లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


