ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఉద్యమమే!
- 77 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
కర్నూలు, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఐదుకోట్ల ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును బంగాళాఖాతానికి తరుముతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలు నగర సమీపంలోని వీజేఆర్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన యువభేరీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ అప్పట్లో అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిమీద ఒకరు పోటీపడి ప్రత్యేకహోదా ఐదు సంవత్సరాలని ఒకరు, కాదు 10 నుండి 15 సంవత్సరాలని ఇవ్వాలని ప్రకటించిన వారు నేడు ముఖం చాటేస్తున్నారని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రత్యేకహోదాను ఇస్తూ రాష్ట్ర విభజన చేశారన్నారు. ప్రస్తుతం నరేంద్రమోదీ ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారన్నారు. పునర్విభజన చట్టంలో లిఖితపూర్వకంగా రాసుకున్న నివేదికనను పక్కనపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని విస్మరించడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలందరు ఏకతాటిపై ఉద్యమించి సాధించుకునేవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందన్నారు. వైసిపి ఎంపిలు ప్రత్యేకహోదాపై ఒత్తిడి తెస్తారన్నారు.
వినకపోతే ఎంపిలు రాజీనామా చేస్తారన్నారు. తిరిగి ఉప ఎన్నికల్లో అదే ప్రత్యేకహోదా నినాదంతో గెలుపొందుతామన్నారు. అప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పుకలిగేలా చేస్తామన్నారు. ప్రత్యేకహోదా ద్వారా అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర వంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్నారు. మన రాష్ట్రానికి వచ్చేసరికి ప్రత్యేకహోదా అవసరం లేదని అంటున్నారని విమర్శించారు. అనంతరం ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోదీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడిన వీడియో టేపులను తెరపై చూపించారు. మరోవైపు, వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మారుస్తామని జగన్ ప్రకటించారు.
అందరు కలిసి పోరాడితేనే ప్రత్యేక హోదా ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్నారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణను ప్రజలు తమ ఉద్యమంతో సాధించుకున్నారని, అలాగే సమిష్టి పోరాటంతో ప్రత్యేక హోదాను కూడా సాధించుకు తీరుదామని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందని జగన్ అన్నారు. హోదా కోసం పోరాటం కొనసాగిద్దామని, రాబోయే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ను వైఎస్ఆర్ సీపీ ఎంపీలు స్తంభింపచేస్తారన్నారు. బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రత్యేక హోదాపై పోరాడతామని, అప్పటికీ కేంద్రం స్పందించకపోతే బడ్జెట్ సమావేశాల తర్వాత ఎంపీలు రాజీనామాలు చేస్తారన్నారు. ఆ తర్వాత హోదా నినాదంతోనే ఉప ఎన్నికలకు వెళతామన్నారు.
మళ్లీ గెలిచి ప్రత్యేక హోదా నినాదాన్ని పార్లమెంట్లో వినిపిస్తామని తెలిపారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ‘బాబు వస్తే జాబ్’ వస్తుందని ఎన్నికల సందర్భంగా ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి విద్యార్థులకు చేసిందేమీ లేదని బీటెక్ విద్యార్థిని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఆమె మంగళవారమిక్కడ మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి అయ్యాక పెట్టుబడులు తెస్తామంటూ చంద్రబాబు ఫారిన్ టూర్ వెళ్లి వచ్చారు కదా.
విదేశీ పర్యటనల తర్వాత రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? కరువు ప్రాంతమైన రాయలసీమకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయని’’ అని ఆమె అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానం ఇస్తూ చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం చంద్రబాబు కేంద్రంతో పోరాటం చేసేవారన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఆయన పెట్టుబడుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. చంద్రబాబు ఈ మధ్య కాలంలో విశాఖలో విదేశాలతో ఎంవోయూలు అని, నాలుగు లక్షల 67 కోట్ల పెట్టుబడులు, పది లక్షల మందికి ఉద్యోగాలు అంటూ డబ్బాలు కొట్టారన్నారు.
అయితే ఆయన కొత్తగా ఒక్క ఉద్యోగాన్ని కూడా తీసుకు రాలేదన్నారు. ఉద్యోగాలు రావాలంటే రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇచ్చేలా నిలదీయాలన్నారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. పెట్టుబడులు రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొన్నదన్నారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలు రావడం అటుంచి ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని, విశాఖ నుంచి హెచ్ఎస్బీసీ ఇప్పటికే వెళ్లిపోయిందన్నారు. మన్నవరం ప్రాజెక్టు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చిందని, స్పిన్నింగ్ మిల్లులు, గ్రానైట్ పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గడమే అందుకు నిదర్శనమన్నారు. మరో బీటెక్ విద్యార్థిని జోత్స్య మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు తప్పు చేసి దాని నుంచి తప్పించుకొనేందుకు హోదాను తాకట్టు పెట్టారని, ఆయన తప్పు చేస్తే శిక్ష మాకా? అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడుకు ఏ విషయాన్ని అయినా మేనేజ్ చేసుకోవటం బాగా తెలుసు అని, ఆయన తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. విద్యార్థులనే కాకుండా రాష్ట్ర ప్రజలందర్ని మోసం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్రాలు కపట నాటకాలు ఆడుతున్నాయని జగన్ విమర్శించారు.
‘‘ఇవాళ యువభేరి కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ ఆదరణ, ఆప్యాయతలకు చేతులు జోడించి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రత్యేక హోదాకు సంబంధించి యువభేరి కార్యక్రమంలో ఒకటయ్యాం. హోదా వల్ల అవసరాలు ఏంటీ? ఎందుకు కావాలి? ఏ రకంగా ఇది సంజీవని అనేది మనకు తెలిసిన విషయలే. హోదా అనేది సంజీవని అని, హోదా ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు పాలకులు పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ తర్వాతే రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇవాళ ఏ పిల్లాడు అయినా చదువు అయిన తర్వాత నేరుగా హైదరాబాద్ వెళతాడు. కారణం ఏంటంటే ఇవాళ దాదాపు 98 శాతం సాప్ట్వేర్ ఉద్యోగాలు అక్కడే ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్, తదితర సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి.
అయితే రాష్ట్ర విభజనతో హైదరాబాద్ నగరం లేకుండా పోతుందని, దాని స్థానంలో ప్రత్యేక హోదా ఇస్తామని, ఆ హోదా వల్ల ఏపీ కూడా బాగుపడుతుంది, ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని అధికార, ప్రతిపక్ష పాలకులు అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు హామీ ఇచ్చారు. ఒకరేమో పదేళ్లే అంటే మరొకరేమో పరిశ్రమలు పెట్టడానికి మూడేళ్లు పడుతుంది కాబట్టి పదేళ్లు కాదు ఏకంగా 15 ఏళ్లు కావాలన్నారు’’ అని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘ఇవాళ అదే నాయకులు ప్లేట్ మార్చారు. హోదాకు ఉద్యోగాలకు సంబంధం లేదని చెబుతున్నారు’’ అని ఆయన అన్నారు. మాట తప్పిన నేతలను గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత ముఖ్యమన్నారు. ఎన్నాళ్లు బతికామనేది కాదని, ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు.
మోసం చేసినా కాలర్ పట్టుకుని అడిగే పరిస్థితి లేకపోవడం బాధకరమని జగన్ అన్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు. ‘‘రైతుల ఓట్ల కోసం రుణమాపీ చేస్తామన్నారు. మహిళల ఓట్ల కోసం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. జాబు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పిల్లలను వదిలిపెట్టలేదు. బాబు ముఖ్యమంత్రి అయ్యారు. అందరినీ గాలికొదిలేశారు. హోదా వస్తే కేంద్రం నుంచి 90 శాతం నిధులు గ్రాంట్‌గా వస్తాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు ఇస్తారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 16 సార్లు విదేశాలకు వెళ్లారు. పారిశ్రామిక రాయితీలు ఇస్తే బాబు విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదు.
హోదా వస్తే ఎక్సైజ్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. హోదా కోసం అవసరం అయితే ఎంపీలతో కూడా రాజీనామాలు చేయిస్తాం. ప్రత్యేక హోదా వచ్చేవరకూ నిరంతర పోరు చేస్తాం’’ అని జగన్ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో సీఎం చంద్రబాబు లాలూచీ పడ్డారని న్యాయవాది శంకరయ్య ఆరోపించారు. చంద్రబాబు నాటకం ఆడి ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నారని అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని చంద్రబాబు చెప్పడం శోచనీయమని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టినప్పుడు పార్లమెంట్ సాక్షిగా హోదా ఇస్తామన్నారని హామీయిచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా తెస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదా అని అధికార పార్టీలను ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అన్నివిధాలుగా మేలు జరుగుతుందన్నారు. కేంద్ర నుంచి వచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా, 10 శాతం లోనుగా ఇస్తారని వివరించారు. పారిశ్రామిక, రవాణా సదుపాయాల్లో రాయితీలు ఇస్తారని తెలిపారు. ప్రత్యేక హోదా కారణంగానే హిమచల్ ప్రదేశ్‌లో 10 వేల పరిశ్రమలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా ఇవాల్సిందేనని కేవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపి రేణుక, విద్యార్థి నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి జరిపారు. కాగా, ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గుత్తి రోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన యువభేరీలో జగన్ పాల్గొన్నారు.


