ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి అనుకూలం: యనమల
- 104 Views
- wadminw
- September 14, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, సెప్టెంబర్ 14 (న్యూస్‌టైమ్): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి అవసరమని, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్థికి దోహదపడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం నాడు అన్నవరం గ్రామంలో పలు అభివృద్థి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి యనమల మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో పాటు అదనపు నిధుల కోసం రాష్ట్రం ప్రయత్నిస్తుందని, కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని అన్నారు. రాష్ట్రాభివృద్థికి ఆర్థికపరమైన సహాయం కావాలని, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధులు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్థి కార్యక్రమాలకు నిధులు కావాలని, 1,35,000 కోట్లతో రూపొందించిన రాష్ట్ర బడ్జెట్లో 60 శాతం, జీత భత్యాలు, ఎస్టాబ్లిష్మెంట్ చార్జీలకు సరిపోతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్థికెక్కిన అన్నవర గ్రామాన్ని అభివృద్థి చేయడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి యనమల తెలిపారు. కాకినాడ ఏంపీ తోట నరశింహం, జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, ప్రత్తిపాడు శాసన సభ్యులు వరుపుల సుబ్బారావుతో కలసి అన్నవరంలో రూ.65లక్షల వ్యయంతో చేపట్టిన నూతన పంచాయితీ భవనం షాపింగ్ కాంప్లెక్స్ , అంగన్వాడీ భవనాలకు శంఖుస్థాపన, సీసీ రోడ్లు ప్రారంభం వంటి పనులు చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ అన్నవరంతో తనకు ఎంతో అనుభందం ఉందని, ఈ-సేవ కేంద్రాలు, విద్య,వైద్య మౌళిక సదుపాయాలు కల్పనకు కృషిచేస్తామన్నారు. గ్రామాభివృద్థిలో అన్నవరం దేవస్థానం తన వాటాను పెంచాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ యం.పి తోట నరశింహం గ్రామంలో సెంట్రల్ లైటింగ్ కోసం యం.పి నిధుల నుండి మంజూరు చేస్తామన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ జిల్లాకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 67కోట్లు త్వరలో గ్రామ పంచాయితీలకు విడుదల కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని మార్కెట్‌యార్డ్ ఛైర్మన్ యనమల కృష్ణుడు, అన్నవరం దేవస్థానం ఇ.ఓ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


