‘ప్రత్యేక’ ముసుగు!
ప్రత్యేక హోదా వస్తే దాని ఫలితంంగా వచ్చే నిధులు, రాయితీల ద్వారానే రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందన్నంతలా విపక్షాలు రచ్చరచ్చచేస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల దగ్గర నుంచి నిన్న మొన్నటి బంద్, పవన్ కల్యాణ్ ఆత్మగౌరవ సభ వరకూ
రాష్ట్రం అంతా ప్రత్యేక హోదా మీదే చర్చ నడుస్తున్నది. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేం దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం అని ప్యాకేజీ కింద కొంత ప్రకటించింది. విపక్షాలు తమకు ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదానే కావాలి అని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. చివరికి రాష్ట్రంలోని అధికార పక్షం కూడా ‘ఇచ్చింది తీసుకుందాం. హక్కు గా రావాల్సిన దాని కోసం పోరాడుతాం’ అంటున్నది. ఈ సందర్భంలో అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి?
ఎవరికీ ఇస్తారు? దాని వల్ల లాభం ఏమిటి? ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీ ఎలా ఉంది? తదితర అంశాలను కాస్త వివరంగా, నిశితంగా పరిశీలిస్తే…
విపక్షాలు, జనసేన చేస్తున్న ప్రచారం అంత దారుణంగా ఏమీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగినట్లు కనిపించడం లేదు. హోదా ఇచ్చినంత మాత్రాన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనుకోవడం పొరపాటే. హోదాతో సంబంధం లేకుండానే పారిశ్రామిక రాయితీలు వచ్చే వీలుంది. ఇక పన్ను రాయితీ పెద్ద అంశమే కాదు. ప్రత్యేక హోదా కావాలనే వారిలో చాలామందికి హోదా మీద అసలు పూర్తి అవగాహనే లేదన్నది నిజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం విభజన సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలు ఏమిటి? అన్నది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసినప్పుడు నాలుగు ప్రధాన హామీలు ఇచ్చారు . అవి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 90… ఇది పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్తున్నది. రెండో సెక్షన్ సెక్షన్ 94. ఇది పారిశ్రామీకరణకు పన్ను రాయితీకి సంబంధించింది. ఇక 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తాము’ అనే ప్రకటన.
ఇక మిగిలిన నాలుగో అంశం… రాష్ట్ర రెవెన్యు లోటును అంచనా వేసే బాధ్యత 14వ ఆర్ధిక సంఘానికి అప్పగించడం. దాని నివేదిక ప్రకరం ఏపీకి నిధులు సమకూర్చడం. ఇంకా అనేక సెక్షన్లు, ఉప సెక్షన్లూ ఉన్నప్పటికీ అవన్నీ ఇప్పుడు అనవసరమనే చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న చర్చ హోదా కోసమే కాబట్టి ఈ నాలుగు ప్రధానాంశాలను గురించి విశ్లేషిస్తే సరిపోతుంది.
అసలు ఈ ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ఇది అర్ధంచేసుకోవాలంటే ముందు కేంద్ర ప్రభుత్వ ఆదాయం, అందులో నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వాటాలు పంచే విధానం గురించి కొంత తెల్సుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తనకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని రాష్ట్రాలకు పంచుతుంది. వాటిని రెండు విధాలుగా పరిగణించి పంపిణీ చేస్తుంటుంది. మొదటిది ప్రణాళికా నిధులు (ప్లాన్ ఫండ్స్ ) అయితే, రెండోది ప్రణాళికేతర నిధులు (నాన్ ప్లాన్ ఫండ్స్). నాన్ ప్లాన్ ఫండ్స్ నుంచి సంక్షేమ పధకాలు, జీత భత్యాలు మొదలయిన వాటికి ఖర్చు చేస్తారు.
వీటిని ఎలా ఉపయోగించాలి? అనేది చెప్పడానికి ప్రతి ఐదేళ్లకు ఒక ఆర్ధిక సంఘం ఏర్పాటు చేస్తారు. ఆర్ధిక సంఘం అప్పటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిధులను కేటయిస్తుంటుంది. ఒక్కో ఆర్ధిక సంఘానిది ఒక్కో రీతి అయినప్పటికీ ప్లాన్ ఫండ్స్‌ని మాత్రం దేనికి ఎలా ఖర్చు పెట్టాలి? అని చెప్పడానికి ప్లానింగ్ కమీషన్ ఉంటుంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ ప్లానింగ్ కమీషన్ పంచవర్ష ప్రణాళిక ని సిద్దం చేస్తుంటుంది. ప్లాన్ ఫండ్స్ నుంచి అభివృద్ధి పధకాలకు ఖర్చు చేస్తుంటారు. ఉదాహరణకు రోడ్లు, నీటిపారుదల పథకాలు నిర్మాణం చేపట్టడంతో పాటు ఆరోగ్య తదితర రంగాలకు ప్రణాళికా నిధులు మంజూరుచేస్తుంటుంది కేంద్రం.
ప్రత్యేక హోదా రాష్ట్రం అనేది ఎప్పుడు మొదలైంది? అసలు దాని ప్రకారం లబ్దిదారైన రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు ఏమిటన్నది పరిశీలిస్తే…
1968లో ప్లానింగ్ కమీషన్ మొదటి సారిగా ఈశాన్య రాష్ట్రాలు అయిన నాగాలాండ్, అస్సాంతో పాటు జమ్మూ కశ్మీర్‌కు ప్లాన్ ఫండ్స్‌లో భాగంగా కొంత ప్రత్యేక గ్రాంట్‌ని ఆయా రాష్ట్రాల ప్రత్యేక అవసరాల (కొండ ప్రాంతాలు, ఇతర దేశాల స్సరిహద్దులు అవడం, పారిశ్రామీకీకరణకు అవకాశాలు తక్కువ కావడం వల్ల) మొదటి సారిగా ఇచ్చింది ఐదవ ప్లానింగ్ కమీషన్ 1974 సంవత్సరంలో. ఇంకో ఏడు రాష్ట్రాలకు కూడా ఈ ప్రత్యేక గ్రాంట్‌ని ఇచ్చింది. వీటిని ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలుగా పిలవడం పరిపాటి.
ఈ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక నిధులు ప్లాన్ ఖర్చులోనే ఇస్తారుజ కానీ, నాన్ ప్లాన్ ఖర్చుకి కాదు. ఇది చాలా ముఖ్యమయిన అంశం. ఈ నేపథ్యంలో గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గాడ్గిల-ముఖర్జీ ఫార్ముల మేరకు ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్ని భిన్నమైనదిగా భావించవచ్చు. గాడ్గిల్ ఫార్ముల ప్రకారం మొత్తం కేంద్ర ఆదాయంలో ముందుగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కావాల్సిన నిధులు ఇచ్చిన తర్వాత మిగిలిన దానిని ఇతర రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది.
ఈ ఫార్ములపై అనేక తర్జనభర్జనలు జరిగాక రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, 1991లో అప్పటి ప్లానింగ్ కమీషన్ డిప్యుటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ నాయకత్వంలో కేంద్రం ఒక కమిటీ వేసింది. దాని ప్రకారం ముందు ప్రత్యేక హోదా కలిగిన పది రాష్ట్రాలకు కేంద్ర వాటాగా రాష్ట్రాలకుఇచ్చే నిధుల్లో ౩౦ శాతం కేటాయించడం, మిగతాది ఇతర రాష్ట్రాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభత్వ పధకాల్లో 90 శాతం గ్రాంట్‌గా 10 శాతం అప్పుగా పరిగణించబడుతాయి. ఇతర రాష్ట్రాలకు అది ౩౦-70 శాతంగా ఉంటుంది.
ఎన్డీసీ ఆమోదం తర్వాత అప్పటి నుంచి అదే అమలవుతూ వస్తోంది. 2002లో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసినప్పుడు అ అరాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిమితుల వల్ల ఆ రాష్ట్రానికి కూడా హోదా ఇచ్చారు. దాంతో మొత్తం పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చినట్లయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రమే ప్రత్యేక హోదా కలిగిన చివరి రాష్ట్రం కూడా. ప్రత్యేక హోదా కలిగి ఉండాలంటే కొన్ని ప్రమాణాలు ఉండాలి. రాష్ట్రం పొరుగు దేశంతో సరిహద్దు కలిగి ఉండడం, దాదాపు ముప్పాతిక భాగం కొండలు గుట్టలతో నిండి ఉండడం, ప్రజల జీవన ప్రమాణాలు తక్కువ ఉండి ఉండాలి.
వీటితో పాటు పారిస్రమీకీకరణ, మౌలిక సదుపాయాలు తక్కువ స్థాయిలో ఉండటం… ఇలా కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి. అలా ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తుంటుంది కేంద్రం. విభజన అప్పుడు అన్ని ప్రమాణాలు లేకపోయినా కొన్ని ఉండటం వల్ల అప్పటి రాజకీయ కారణాల వల్ల ‘ఆంధ్రప్రదేశ్‌కూ ప్రత్యేక హోదా (స్పెషల్ స్టేటస్) ఇస్తాము’ అని అప్పటి కేంద్ర (యూపీఏ) ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏమిటి అంటే… ఈ ప్రత్యేక హోదా కలిగి ఉండటం వల్ల మామూలుగా వచ్చే వాటా కంటే ఎక్కువ నిధులు వస్తాయి.
అది కూడా ప్లాన్ ఖర్చుకి మాత్రమే. ఇక పన్ను రాయితీలు వంటివి ప్రత్యేక హోదాలో భాగమా? అంటే కానే కాదు అన్నది నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి. ప్రత్యేక హోదా వేరు, పన్ను రాయితీలు వేరు. ఉత్త ప్రత్యేక హోదా ఉండటం వల్ల ప్లాన్ ఖర్చులో నిధులు ఎక్కువ వస్తాయి కానీ, పన్ను రాయితీలు మాత్రం రావు. పన్ను రాయితీలు లేనిదే ఎవరూ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారు. మరి ఈ పన్ను రాయితీ కథ ఏమిటి? ఈ పన్ను రాయితీ అనేది 2002వ సంవత్సరం నుంచి మొదలయింది.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే? ప్రత్యేక హోదా అనేది 1968 నుంచి ఉన్నది కానీ, పన్ను రాయితీలు అనేవి మాత్రం 2002 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. పన్ను రాయితీలు ఎందుకు ఇచ్చారు? ముఖ్యంగా ఈశ్యాన్య రాష్ట్రాలు కొండలతో నిండి ఉండటం, పరిశ్రమలు లేకపోవడం, పనులు లేక ప్రజలు తీవ్రవాదంవైపు ఆకర్షితులవడం తదితర కారణాలను విశ్లేషణ చేసినమీదట ప్రజల జీవన స్థితిగతులు పెంచడానికి ఆయా ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏమి చేస్తే అక్కడకు పరిశ్రమలు వస్తాయి?
అని ఆలోచన చేసినమీదట పరిశ్రమలు రావాలి అంటే పన్ను రాయితీ ఇవ్వాలి అని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అలా అమలులోకి వచ్చిందే ఈ పన్ను రాయితీ కాన్సెప్ట్. ఈ పన్ను రాయితీని మొదట ఐదేళ్లకి ఈశాన్య రాష్ట్రాలకు కల్పించారు. 2005లో ఉత్తరఖండ్‌కు, హిమాచల్ ప్రదేశ్‌కు కూడా ఈ పన్ను రాయితీ కల్పించారు. 2002లో మొదలయిన పన్ను రాయితీ 2007లో ముగియాల్సి ఉండగా మరో 5ఏళ్లు, ఆ తర్వాత ఇంకో 2 ఏళ్లు పొడిగించారు. ఈ నేపథ్యంలో 8 రాష్ట్రాలకు 2014లో పన్ను రాయితీని తొలగించారు. మిగిలిన ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలకు 2017తో గడువు పూర్తవుతుంది. అప్పటితో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకవేళ కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో గడువు పెంచితే తప్ప ఇక, పన్ను రాయితీలు ఏ రాష్ట్రానికీ ఉండవు. ఈ 11 ప్రత్యేక హోదా రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగానే పరిగణించబడుతాయి.
అయితే, ప్రత్యేక హోదా అనే పదం లేకపోవడం వల్ల వాటిని సరిహద్దు రాష్ట్రాలు (బోర్డర్ స్టేట్స్ ) లేదా కొండ ప్రాంతాలు (హిల్ స్టేట్స్)గా పరిగణించబడతాయి. ఇక ఏ రాష్ట్రానికీ పన్ను రాయితీలు ఉండవు కాబట్టి 2014లో కేంద్రంలో భాజాపా అధికారంలోకి వచ్చాక కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. అప్పటి వరకు ఉన్న నేషనల్ ప్లానింగ్ కమీషన్ (ఎన్.డి.సి.)ని రద్దు చేసింది. ఎన్డీసీ స్థానంలో నీతి ఆయోగ్‌ని ప్రవేశపెట్టింది ఎన్డీయే ప్రభుత్వం. ఇక, అప్పటి నుంచి ప్లాన్ ఫండ్స్ లాంటివి అసలు లేనేలేవు.
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ౩౦ శాతం నిధులూ లేవు. అసలు ఆ మాటకు వస్తే ప్రత్యేక హోదా అనేదే తొలగించేశారు. 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా అవసరం లేదని, రాష్ట్రాల పరిస్థితులు వేరు, ప్రతి రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర అవసరాలను బట్టి నిధులు ఇవ్వాల్సిఉంటుందని కేంద్రానికి సిఫార్సు చేసింది. కేంద్ర, రాష్ట్ర ఆదాయ పంపిణీని విధానాన్ని కూడా సమూలంగా మార్చేసింది. గతంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధులు ౩2 శాతంగా ఉంటే వాటిని 42 శాతానికి పెంచింది. దానితో పాటు ఆర్దికలోటుతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు కేటాయించింది.
ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక గ్రాంట్ గతంలో ప్రత్యేక హోదా అనుభవించిన 11 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలనుకుడా చేర్చింది. పశ్చిమ బెంగాల్, కేరళకు ఈ ప్రత్యేక గ్రాంట్ఙని కేవలం ఒక్క సంవత్సరానికే మాత్రమే పరిమితంచేసి,
మిగత 12రాష్ట్రాలు (11 గతంలోని ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, కొత్తగా గుర్తించిన ఆంధ్రప్రదేశ్)కి 5ఏళ్లు ఇచ్చింది. ఈ ప్రత్యేక గ్రాంట్ వల్ల ఏపీకి 5ఏళ్లలో దాదాపు 22,500 కోట్ల రూపాయలు రానున్నాయి. అందరి మాదిరిగానే రెవెన్యు లోటు ఉండటంవల్ల మనకు ఆ నిధులు అందుతున్నాయి. మొదట చెప్పుకున్న ప్రకారం ప్లాన్, నాన్ ప్లాన్ ఫండ్స్ ఏమయ్యాయి? వాటిని ఎలా పంపిణీ చేస్తారు?
అన్న అనుమానం రావచ్చు. వాటి కోసమే మధ్యప్రదేశ్ ముఖ్యమత్రి నేత్రుత్వంలో ఒక కమిటీని ఏర్పాటుచేసింది కేంద్రం. దాన్నే చౌహాన్ కమిటీ అంటారు. ఈ కమిటీ నివేదిక ప్రకారం ఈ ఫండన్స్ను రెండు రకాలుగా పంపిణీ చేయనున్నారు. వీటిలో ఒకటి. సెంట్రల్లీ అస్సిష్టేడ్ స్టేట్ ప్లాన్ (సీఏఎస్‌పీ), రెండోది ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ (ఈఏపీ). వీటిలో సీఏఎస్‌పీ సింహ భాగం ఆక్రమిస్తుంది. అన్ని రాష్ట్రాలకు 60 శాతం సీఏఎస్‌పీ నిధులు వస్తాయి. కాగా, ఆ 11 రాష్ట్రాలకు మాత్రం 90 శాతం వస్తుంటాయి. ఇక, ఈఏపీ అంటే ఏమిటి?
కొన్ని సార్లు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి కానీ ఇతర విదేశీ సంస్థల నుంచి కానీ నిధులు తెచ్చి కేంద్ర పధకాలను రాష్ట్రాల్లో అమలుచేస్తుంటుంది. అలాంటి నిధుల్లో కేంద్రం 60 శాతం నేరుగా ఖర్చు భర్తిస్తే రాష్ట్రాలు 40 శాతం భరిస్తాయి. ప్రత్యేక రాష్ట్రాలకు అవి కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం భరిస్తాయి. అదే రాష్ట్రాలే సొంతంగా ఈఏపీలు తెచ్చుకుంటే మొత్తం అప్పు రాష్ట్రమే భరించుకోవాలి. కేంద్రం హామీదారుగా మాత్రమె వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే, గత ప్రధాని ఇచ్చిన హామీ ఏమయింది?
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అనేది ఉంది.
ఇప్పటి మోడీ ప్రభుత్వంలో అ హోదా అనే కాన్సెప్ట్నే తీసేసారు. గతంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలనూ ఇప్పుడు హిల్ స్టేట్స్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో 30 శాతం ప్లాన్ ఫండ్స్‌ని పంపిణీ చేసేవారు. అయితే, ఇప్పుడు మాత్రం రాష్ట్రాలకి చౌహాన్ ఫార్ముల ప్రకారం 90 శాతం గ్రాంట్‌గా సీఏఎస్‌పీ, ఈఏపీ కేటగిరీల్లో లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ హామీ సంగతి ఏమిటి? అంటే దానికి… ‘అసలు ప్రత్యేక హోదా అనేదే లేనప్పుడు మేము మీకు హోదా ఎలా ఇస్తాం’ అని కేంద్రం అంటున్నది.
అలాంటప్పుడు సీఏఎస్పీలో 30 శాతం అదనంగా ఇవ్వమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం ‘మీకు అలా ఇవ్వడం కుదరదు. అలా మీకుఇస్తే అన్ని రాష్ట్రాలు అడుగుతాయి. అంతే కాక బడ్జెట్లో కూడా ప్రొవిజన్ లేదు. అలా ఇస్తే ప్రత్యేక హోదా తీసి వేయడం నిష్ప్రయోజనం అవుతుంది’ అన్నది కేంద్రం అభిప్రాయం. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంతో, డిమాండుతో అనేక సార్లు హస్తిన చుట్టూ తిరిగారు. అనేక వందల గంటలు సమాలోచనలు జరిపారు.
అనేక ఫార్ములాలు తయారుచేయించి ఆర్ధకమంత్రితో చర్చించారు. ఇలా రెండేళ్లు గడిచిపోయింది. చివరకు ఒకమార్గం కనుగొన్నారు. ‘సీఏఎస్పీలో ఎక్కువ ఇవ్వమంటే కదా మీకు ఇబ్బంది? ఇతర రాష్ట్రాలు అడ్డం పడుతాయని అంటున్నారు కాబట్టి ఏపీకి సీఏఎస్పీలో ఇచ్చే 30 శాతం నిధులను ఈఏపీలో కేటాయించండి’ అని చంద్రబాబు తన కొత్త వినతిని కేంద్రం ముందుంచారు. సీఏఎస్‌పీ అనేది అన్ని రాష్ట్రాలకు ఒకే విధం గా ఉంటుంది. అదే ఈఏపీ అయితే ఏ రాష్ట్రం అవసరనికి అనుగుణంగా ఆ రాష్ట్రానికి ఉంటుంది. దాన్ని ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెప్పలేవు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనకు ఇక కాదు, కుదరదు అని చెప్పలేని స్థితి కేంద్రనిది. అంత అపరమేథావి కాబట్టే చంద్రబాబుకు ఇంత పెద్ద ఆలోచన వచ్చింది. చివరకు ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంది కేంద్రం. ఈ విధానం వల్ల ఏపీకి లాభం ఏమిటి? నష్టం ఏమిటి? ఇది అర్ధం చేసుకోవాలంటే? కొంచం ఆర్ధిక శాస్త్రం బేసిక్స్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సాధారణంగా ఈఏపీ కింద తీసుకునే రుణం 5-7 సంవత్సరాలు తరువాత చెల్లింపులు మొదలవుతాయి. ఆ చెల్లింపుల కాలపరిమితి కూడా 10-15 సంవత్సరాలు ఉంటుంది.
ఆ తీసుకునే రుణం ఆ సంవత్సర ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి ఉంటుంది. ఇది సాధారణంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.5 శాతంగా ఉంటుంది. చంద్రబాబు కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ ముందు పెట్టిన ప్రతిపాదనలోకి వస్తే సీఏఎస్సీలో ౩౦ శాతం అధికంగా నిధులు ఇవ్వడం కుదరదు అన్నారు కాబట్టి ఈ 30శాతం నిధులను కేంద్ర ప్రభుత్వ ఈఏపీ కింద ఇవ్వమని కోరడం, దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ఒక ఉదాహరణ తీసుకుంటే బాగా అర్ధం అవుతుంది. ఏపీ ప్రతి సంవత్సరం ఒక 10,000 కోట్లు సీఏఎస్‌పీ కింద ఖర్చు పెడుతుంది అనుకుందాం.
మామూలుగా అయితే ఇందులో 6000 కోట్లు కేంద్రం భరిస్తే రాష్ట్రం 4000 కోట్లు భరిస్తుంది. అదే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అయితే కేంద్రం 9000 కోట్లు (90%), రాష్ట్రం 1000 కోట్లు (10%) భరిస్తాయి. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం నష్టపోతున్నది ౩౦౦౦ కోట్లు. చంద్రబాబు-జైట్లీ ఫార్ముల ప్రకారం ఏపీకి సఏఎస్పీలో నష్టపోతున్న మొత్తాన్ని (౩౦౦౦ కోట్లు)ని కేంద్రం ఈఏపీగా సర్దుబాటు చేస్తుంది కావున, డబ్బు పరంగా చూస్తే లెక్క సరిపోయింది. వాస్తవంగా పడుతున్న భారం 1000 కోట్లే. అంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి ఎంత భారం పడుతుందో, ఏపీకీ అంతే పడుతుంది. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు వచ్చే బెనిఫిట్‌ని ఈ విధంగా మనకు వర్తింపజేయడం విశేషం.
ఇంకో విషయం గమనించాల్సింది ఏమిటి అంటే? ఈఏపీ కింద ౩౦౦౦ కోట్లు కేంద్రం తీసేసుకోవడం వల్ల ఎఫ్ఆర్బీఎం మీద భారం ఆ మేరకు తగ్గుతుంది కూడా. అంటే ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటకుండా అదనంగా ఇంకో ౩౦౦౦ కోట్ల ప్రతి సంవత్సరం తెచ్చుకోవచ్చన్నమాట. ఈ విధానం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ఐదేళ్లలో 22,500 కోట్ల నిధులు అందుబాటులో ఉండటమే కాక ఇంకో 22,500 కోట్లు స్వల్పకాలం (5-7సంవత్సరాల్లో) లభ్యం అవుతాయి. ఈ మొత్తం కలిపి సుమారుగా 45,000 వేల కోట్లు. లెక్కల్లో చూస్తే ఇదేమి చిన్న మొత్తం కాదు.
ఇంత పెద్ద మొత్తాన్ని ప్రతి సంవత్సరం ఖర్చు చేయాలి అంటే మనం ప్రతి సంవత్సరం ౩౦౦౦-5000 కోట్ల ఈఏపీలు తెచ్చుకోవాలి. 2014లో ఏపీ కేవలం 600 కోట్లు, 2015లో 900 కోట్లు మాత్రమే ఈఏపీల ద్వారా ఖర్చు పెట్టిన నేపథ్యంలో మరి ఇంత పెద్ద మొత్తాలు ఖర్చు చేయాలి అంటే ఎంత పకడ్బందీగా నడవాల్సి ఉంటుందో? ఆర్ధిక మేథావి చంద్రబాబు లాంటి నేత వల్లే ఇది సాధ్యం. ఇప్పటికే రాష్ట్రం 42,000 కోట్ల ఈఏపీల కోసం డీపీఆర్‌లు సిద్దం చేసింది. కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తే ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయోజనాన్ని చంద్రబాబునాయుడు సాశించారా? లేదా? అర్ధమవుతుంది. ప్రత్యేక హోదా అనే పదం లేదు కానీ, దాని వల్ల వచ్చే అన్ని ప్రయోజనాలనూ సాధించుకున్నారు.
ఇదే వేరే రాష్ట్రమైతే మాత్రం కచ్చితంగా రాబట్టుకునే పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. సరే, ఇక పన్ను రాయితీల విషయానికి వస్తే, 2002లో మొదలయిన పన్ను రాయితీ చాలామటుకు 2014లో తొలగింపునకు గురైంది. మిగత రెండు రాష్ట్రాలకి వచ్చే ఏడాదితో ముగుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఇక ఏ రాష్ట్రానికీ ఈ తరహా రాయితీలను ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందిన నేపధ్యంలో ఇక దేశం మొత్తం మీద ఎక్కడ పన్ను రాయితీలు ఉండే అవకాశమే లేదు.
చాలా మంది అనుకుంటున్నది ఏమంటే పన్ను రాయితీ కూడా ప్రత్యేక హోదాలో భాగమే అని. కానీ, అది నిజం కాదు. పన్ను రాయితీ వేరు. ప్రత్యేక హోదా వేరు. ప్రత్యేక హోదాలో పన్ను రాయితీ లేదు. మరి అలాంటప్పుడు మనం భారీ ఉద్యమాలు చేసి హోదా సాధించుకున్నా ఏం లాభం? రాజకీయ ప్రయోజనాల కోసం ఆశపడే మిడిమిడి జ్ఞానం మేథావులారా! ఇక, ఇప్పుడు చెప్పండి. ప్రత్యేక హోదానే కావాలి అని. అసలు అమలులోనే లేని హోదా కోసం ఉద్యమాలు చేసి కేంద్రం వద్ద చెడ్డ అవడం వల్ల నష్టపోయేది ఎవరు? మనం కాదా? పార్టీలు, నాయకులూ తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏమయిన మాట్లాడుతుంటారు.
ప్రత్యేక ప్యాకేజీ అంటే అదేదో తప్పుడుది అని కాదు. అర్ధంచేసుకుని కేంద్రంతో స్నేహభావంతో వెళ్లడం వల్ల ఏదైనా సాధించుకోవచ్చన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ మాత్రమే ఏపీ ప్యాకేజీ అన్నది స్పష్టమవుతోంది. ప్రత్యేక హోదాకి, ప్రత్యేక ప్యాకేజీకీ మధ్య తేడా ఏముందో తెలియడం లేదు కానీ, విపక్షాలు మాత్రం దారుణమైన రీతిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్నీ ఉతికి ఆరేస్తున్నాయి. కేవలం పదం వాడలేదు అంతే కానీ,
మిగతాది అంతా సేమ్ టు సేమ్! ‘హోదా ఇస్తాం’ అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో లేదు. అధికారంలో ఉన్న పార్టీ ‘అది కాదు, ఇది ఇస్తాం’ అంటోంది. రెండిటిని బేరీజు వేసుకొని చూసుకోకుండా మొండిగా వెళ్తే ఎవరికీ నష్టం? జనానికే కదా? పోనీ తమకు ప్రత్యేక హోదానే కావాలి అన్నామనుకోండి. బీజేపీ ఇవ్వదు, అప్పుడు బీజేపీని భూస్థాపితం చేస్తాం అని చేస్తాం అని అంటారు.
అలానే చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దాని వల్ల బీజేపీకా నష్టం? ఆ పార్టీకి ఎమన్నా పోయేది ఉందా? అసలు ఆంధ్రాలో ఆ పార్టీ ఉనికి ఎంత?
దాని సత్తా ఎంత? ఎపుడన్నా అధికారంలో ఉందా? ఆ పార్టీకి పోయేది కాని, కొత్తగా వచ్చేది కానీ ఏమీలేదు. కానీ, నష్టపోయేది ఎవరన్న ఉన్నారు అంటే అది ఖచితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనమే. భావి తరాలు చంద్రబాబు లాంటి సమర్ధుడు ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే ఇంకొకరేవరన్నా ఉంటే భవిష్యత్తు ఏమిటి? భవిష్యత్తు రాజకీయ లక్ష్యాలతో కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధిని, పెరగనున్న ఉపాధి అవకాశాలనూ ఆకాంక్షించాల్సిన అవసరం ఉంది.


