ప్రభుత్వంపై వైకాపా కుటిల ప్రచారం చేస్తోంది: మంత్రి రావెల
గుంటూరు: తెలంగాణాలో చోటుచేసుకున్న ఓటుకు నోటు కేసును వైకాపా కుట్రపూరితంగా తెరపైకి తీసుకొచ్చిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఆదివారం జడ్పి ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ఎసిబి జోక్యం చేసుకోకూడదన్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలను విచారించే అధికారం కేవలం ఎన్నికల సంఘానికి మాత్రమే ఉందన్నారు. స్టింగ్ ఆపరేషన్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని గుర్తుచేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఎదుర్కోలేక వైకాపా కోర్టులో అక్రమ కేసులు వేస్తోందని విమర్శించారు. రాజకీయ జీవితంలో ఏ విధమైన మచ్చలేకుండా స్వచ్చమైన పాలన చేస్తున్న చంద్రబాబును ఓటుకు నోటు కేసులో సంబంధం లేదన్నారు. ఐదుకోట్ల ప్రజల మనోభావాలను వైకాపా నాయకులు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో వైకాపాను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు.


