ప్రభుత్వాన్ని విమర్శించడం దేశద్రోహమేమీ కాదు: సుప్రీం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం రాజద్రోహం కిందికి రాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం పరువునష్టం కిందికో, రాజద్రోహం కిందికో రాదు అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పును అనుసరించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జడ్జీలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అటువంటి విమర్శలు హింసకు దారితీసినా, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమైనా అప్పుడు అది రాజద్రోహం కిందికి వస్తుందని స్పష్టం చేస్తూ జస్టీస్ దీపక్ మిశ్రా, జస్టీస్ ఉదయ్ లలిత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్ప చెప్పింది. ఈ సందర్భంగా 1962 నాటి కేదర్నాథ్సింగ్, బీహార్ రాష్ట్రాల మధ్య జరిగిన కేసును ఉదహరించింది.
ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై దేశద్రోహం లేదా పరువునష్టం కేసులు పెట్టడం సరికాదని వెల్లడించింది. ఇటీవల చాలా కేసులు దేశద్రోహం కింద నమోదవుతున్న నేపథ్యంలో 1962లోని దేశద్రోహ చట్టాన్ని పరిగణనలోకి తీసుకున్న దీపక్ మిశ్రా, యూయూ లలిత్‌తో కూడిన బెంచ్ ఈ కేసులపై క్లారిటీ ఇచ్చింది. దేశదోహ్ర కేసుల అంశాన్ని మళ్లీ పునః సమీక్షించాల్సినవసరం లేదని వెల్లడించిన బెంచ్, 54 ఏళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం ఏవైతే గైడ్-లైన్సు రూపొందించిందో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అవే గైడ్-లైన్సును పాటించాలని ఆదేశించింది. కేదర్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులోని 1962 తీర్పును పరిగణనలోకి తీసుకొని, ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు, రాసే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుందని వెల్లడించింది. ఇవి విమర్శల రూపంలోనైనా, కామెంట్ల రూపంలోనైనా ఉండొచ్చని క్లారిటీ ఇచ్చింది.
రైల్వే స్టేషన్లో బాంబుల బ్యాగులు
జైపూర్, సెప్టెంబర్ 6: రాజస్థాన్‌లో బాంబుల బ్యాగులు కలకలం సృష్టించాయి. కోటా సిటీలోని రైల్వే స్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాంపై అనుమానాస్పదంగా రెండు బ్యాగులను గుర్తించారు. దీంతో వాటిని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు ఉన్నాయి. కోటా సిటీలోని రైల్వే ప్లాట్‌ఫాం నెంబర్ 1పై దొరికిన రెండు బ్యాగుల్లో 2.75కేజీల పేలుడు పదార్థాలు, విద్యుత్ తీగలు, డిటోనేటర్లు లభించాయని అక్కడి పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు రెండు వేర్వేరు బ్యాగుల్లో పెట్టినట్లు పోలీసులు చెప్పారు. మంగళవారం సాయంత్ర 4.30గంటల ప్రాంతంలో వీటిని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే, ఆ పేలుడు పదార్థాలు ఎలాంటివి అనే విషయంలో వివరణ మాత్రం ఇవ్వలేదు. శరవేగంగా బాంబ్ స్క్వాడ్ టీం స్పందించడంతో ఎలాంటి ప్రమాద ఘటన చోటుచేసుకోలేదు. ఢిల్లీ, ముంబయి వంటి సుదూర ప్రయాణాలు చేసేందుకు రాజస్థాన్‌లో ఇదే ప్రముఖ రైల్వే స్టేషన్. ఇదిలావుండగా, ఢిల్లీకి చెందిన నర్సు ప్రీతి రతిపై యాసిడ్ దాడి, హత్య కేసులో నిందితుడిగా ఉన్న అంకుర్ పన్వర్ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా ప్రకటించింది. ప్రీతి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందనే అసూయతో అంకుర్ ఆమెపై యాసిడ్ పోసి, హత్య చేశాడని కోర్టు మంగళవారం నిర్ధారించింది. కోర్టు బుధవారం అతనికి శిక్షను ఖరారు చేయనుంది. న్యాయం కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్నామని, తమకు న్యాయం జరిగిందని, దోషికి మరణశిక్ష వేయాలని కోరుతున్నట్టు ప్రీతి తండ్రి అమర్ సింగ్ చెప్పాడు. కాగా తన కొడుకును అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, సీబీఐ దర్యాప్తు చేయించాలని అంకుర్ తల్లి కైలాష్ డిమాండ్ చేసింది. 2013లో ప్రీతికి ముంబైలోని కొలబా నావల్ హాస్పిటల్లో (ఐఎన్ఎస్ అశ్విని) స్టాఫ్ నర్సుగా ఉద్యోగం వచ్చింది. ప్రీతి ఉద్యోగంలో చేరేందుకు తన కుటుంబ సభ్యులతో కలసి మే 2న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి ముంబై వచ్చింది. అదే రైలులో ఆమెకు తెలియకుండా అంకుర్ దొంగచాటుగా (టికెట్ లేకుండా) ముంబై వచ్చాడు. బాంద్రా టర్మినెస్లో ప్రీతి దిగిన వెంటనే అంకుర్ ఆమెపై యాసిడ్ దాడిచేసి పారిపోయాడు. ఈ ఘటనలో ప్రీతి ఊపరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 1న మరణించింది. ప్రీతికి ముంబైలో ఉద్యోగం రావడంతో ఆమె ఢిల్లీ నుంచి ముంబైకు వెళ్లడం అంకుర్ ఇష్టంలేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రీతిని పెళ్లిచేసుకోవాలని అతను ఆశపడగా, ఆమె తన కెరీర్ దృష్ట్యా నిరాకరించింది. ప్రీతి ముంబైకు వెళ్లకుండా ఆపేందుకు అంకుర్ ప్రయత్నించగా, అతని అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆమె ముంబైకి బయల్దేరింది. ప్రీతిపై యాసిడ్ దాడి చేయాలని అంకుర్ ముందస్తుగా పథకం వేసుకున్నాడు. ఏప్రిల్ 2న అతను యాసిడ్ కొన్నాడని దర్యాప్తులో తేలింది. ముంబైలో ప్రీతిపై దాడిచేసిన తర్వాత అదే రైల్లో ఢిల్లీకి తిరిగివెళ్లాడు.
కశ్మీర్ వేర్పాటువాద నేతలపై కఠిన చర్యలు?
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కశ్మీర్ వేర్పాటువాద నేతలపై కఠిన చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. వారికి కల్పిస్తున్న జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని తగ్గించడంతోపాటు పాస్ పోర్టులను వెనక్కి తీసుకోనుంది. అలాగే బ్యాంక్ అకౌంట్లను తనిఖీ చేయడంతో పాటు వారిపై నమోదైన కేసులపై విచారణను వేగవంతం చేయనుంది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్కౌంటర్ నాటి నుంచి అల్లర్లతో కశ్మీర్ రగులుతోంది. వేర్పాటువాదంతో కశ్మీర్ యువతను రెచ్చగొడుతున్న హురియత్ వంటి వేర్పాటువాద నేతలపై కఠిన చర్యలతోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని కేంద్రం భావిస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పాటు పర్యటించిన అఖిలపక్ష బృందంతో చర్చలకు వేర్పాటువాదులు ముందుకురాలేదు. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిపట్ల అవలంభిస్తున్న మెతక వైఖరి వల్లనే ఈ పరిస్థితి అని కేంద్రం భావిస్తోంది. దీంతో వారిపై కఠిన చర్యలకు రాజ్‌నాథ్ సింగ్ సిఫార్సు చేయడంతో ప్రధాని మోదీ దానికి అంగీకరించినట్లు తెలిసింది. బుధవారం జరిగే అఖిలపక్ష బృందం సమీక్షా సమావేశంలో కేంద్రం తన వైఖరి ప్రకటించనుంది. మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం ఓ వైపు ప్రయత్నిస్తుండగా మరోవైపు అల్లర్లను మరింత ఉధృతం చేసేందుకు వేర్పాటువాద నేతలు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్న తరుణంలో మరింత ఆందోళనలకు పిలుపునిచ్చారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్కౌంటర్ అనంతరం జులై 9 నుంచి సుమారు రెండు నెలలుగా కశ్మీర్లో సమ్మె జరుగుతోంది. దీన్ని ఈ నెల 16 వరకు కొనసాగించాలని వేర్పాటువాద నాయకులు సయ్యద్ ఆలీ జిలానీ, మిర్వాజ్ ఉమర్ ఫరూక్, మహ్మద్ యాసిన్ మాలిక్ ప్రకటించారు. కొత్త నిరసన కార్యక్రమాన్ని మంగళవారం వారు వెల్లడించారు. ముస్లింలకు పవిత్ర ఈద్ రోజైన సెప్టెంబర్ 13న కూడా సమ్మెకు విరామం ప్రకటించలేదు. ఆ రోజు యూఎన్ మార్చ్, మరునాడు రహదారుల దిగ్బంధం, సామూహిక పార్థనలకు పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ఈద్ రోజున నిరసనలు, సమ్మెకు వేర్పాటువాదులు విరామం ఇవ్వకపోవడం ఇదే తొలిసారి కానుంది. ‘పాకిస్థాన్ జిందాబాద్’ అనేవాళ్ళతో మాట్లాడటమెందుకని ముస్లిం మత పెద్దలు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రశ్నించారు. కశ్మీరులో ప్రస్తుత పరిస్థితులపై ఏర్పాటైన అఖిల పక్ష బృందం హురియత్ కాన్ఫరెన్స్ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేయకుండా ఉండాల్సిందన్నారు. కశ్మీరు పరిస్థితులపై చర్చించేందుకు ఈ బృందం మంగళవారం రాజ్‌నాథ్‌ను కలిసింది. కశ్మీరులో రెండు నెలల నుంచి అనిశ్చితి కొనసాగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అఖిల పక్ష బృందం కశ్మీరు వేర్పాటువాదులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ వేర్పాటువాద నేతలు చర్చలకు ససేమిరా అన్నారు. దీంతో రాజ్‌నాథ్ వేర్పాటువాదుల నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతోన్న కశ్మీర్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు భారత ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా, పాకిస్థాన్ కు వత్తాసుపలుకుతూ, తాము పాకిస్థానీయులమేనని చెప్పుకుంటున్నవారిపై జమ్ముకశ్మీర్ ఇస్లాం మతబోధకులు మండిపడ్డారు. కశ్మీర్ మతబోధకుల బృందం మంగళవారం ఢిల్లీలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసి, పాకిస్థాన్‌కు జిందాబాద్ కొడుతున్న వేర్పాటువాదులతో చర్చలు జరపొద్దని డిమాండ్ చేసింది. శని, ఆదివారాల్లో కశ్మీర్లో పర్యటించిన అఖిలపక్ష బృందంలోని కొందరు సభ్యులు వేర్పాటువాదులతో సమావేశం కావడాన్ని ముస్లిం మతపెద్దలు తప్పుపట్టారు. కశ్మీర్ సమస్య పరిష్కరించే క్రమంలో అలాంటి వారితో చర్చలు అనవరసమని వారు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని రాజ్2నాథ్ ముందు వెల్లడించారు. వేర్పాటువాదుల తీరు తనను కూడా అసంతృప్తికి గురిచేసిందని హోం మంత్రి అన్నారు. రాజ్‌నాథ్ నేతృత్వంలో కశ్మీర్లో పర్యటించిన అఖిలపక్షబృందంలో సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరి, సీపీఐ, జేడీయూ, ఆర్జేడీలకు చెందిన ఎంపీలు డి. రాజా, శరద్ యాదవ్, జయప్రకాశ్ నారాయణ్ మరో ప్రత్యేక బృందంగా ఏర్పడి వేర్పాటువాద నేతలతో చర్చలు జరిపేందుకు ఆదివారం విఫలయత్నం చేశారు. గృహనిర్భంధంలో ఉన్న హురియత్ కీలక నేత సయీద్ అలీషా గిలానీ తాను ఎంపీల బృందంతో మాట్లాడబోనని తేగేసి చెప్పారు. మరో నేత అబ్దుల్ ఘనీ భట్ అఖిలపక్షం పర్యటనను పనికిమాలిన చర్యగా అభివర్ణించారు. జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ కూడా ఇదే తరహాలో స్పందించారు. ప్రస్తుతం పోలీస్ నిర్బంధంలో ఉన్న యాసిన్ స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మాట్లాడలేనని, ఢిల్లీకి వచ్చినప్పుడు కలుస్తానని ఎంపీలతో అన్నారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ కశ్మీరియత్, ఇన్సానియత్, జమూరియత్ విధానానికి వ్యతిరేకంగా వేర్పాటువాద నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. అదేరీతిలో ఇప్పుడు కశ్మీరీ మతపెద్దలు కూడా వేర్పాటువాద నేతలతో ఎంపీలు మాట్లాడేందుకు ప్రయత్నించడాన్ని తప్పుపడుతున్నారు. మరోవైపు కశ్మీర్ ఆందోళనలను అదుపుచేసే క్రమంలో వేర్పాటువాద నేతలపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆయా నేతలకు కల్పిస్తోన్న భద్రతను ఉపసంహరణ లేదా తగ్గించాలని ప్రభుత్వ భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వేర్పాటువాద నేతల విదేశీయానాలు, ఇతర పర్యటనలు, సమావేశాలనూ నియంత్రించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.


