ప్రమాదకర స్థాయికి హుస్సేన్ సాగర్
- 105 Views
- wadminw
- September 3, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్ జంట నగరాల్లో భారీ వర్షాలపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్థన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులతో కేటీఆర్ చర్చించారు. ఉదయం నుంచి కురిసిన కుండుపోతతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు విద్యుత్ అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.
షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అవాంతరాలు నిరోధించాలన్నారు. మరోవైపు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండుగంటల పాటు భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఉదయం 11 గంటల వరకూ నగరంలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలను అధికారులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు.
అంబర్‌పేటలో అత్యధికంగా 11.8 సెంటీ మీటర్ల వాన కురవగా మేరేడ్ పల్లిలో అత్యల్పంగా 0.75 మిల్లీమీటర్ల వాన కురిసింది. అంబర్ పేటలో 118, మల్కాజ్ గిరిలో 91.25, సైదాబాద్‌లో 87, కుద్భుల్లా పూర్లో 79.75, ఖైరతాబాద్‌లో 76.75, అమీర్ పేట్లో 69.5, బహదూర్ పురాలో 65, కీసరలో 62.75, హిమాయత్ నగర్లో 61, చార్మినార్‌లో 58.5, రాజేంద్రనగర్‌లో 53, తిరుమల్‌గిరిలో 50, నాంపల్లిలో 47.5, బాలానగర్‌లో 44, గోల్కొండలో 35.75, శేరిలింగంపల్లిలో 35, మల్కాజ్ గిరిలో 31.75, ఉప్పల్‌లో 19.75, రామచంద్రాపురంలో 13.75, షేక్ పేట్లో 4.25, మారేడ్ పల్లిలో 0.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు ప్రాధమిక సమాచారంగా మంత్రిగా వివరించారు.
కాగా, భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. హుస్సేన్ సాగర్‌లో నీటి మట్టం అనూహ్యంగా నాలుగు అడుగుల మేర పెరిగింది. దీంతో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది.
రవాణా వ్యవస్థ స్తంభించింది. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వాహనాలు నీట మునిగాయి. వర్షాల కారణంగా పలు ఎంఎంటీస్ రైళ్లను రద్దు చేశారు. రాజ్‌భవన్ సమీపంలో రైలు పట్టాలు నీటిలో ముగినిపోయాయి. మరోవైపు, ఒడిశా, ఛత్తీస్గడ్ మీదుగా వాయువ్యదిశగా ఉపరితల ఆవర్తనం కదులుతోంది. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
కొన్ని ప్రాంతాల్లో మోస్తరు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్‌లో బుధవారం ఉదయం 11.30 గంటల వరకు 71 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24గంటల్లో నమోదైన వర్ష పాతం వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడులో 7 సెం.మీ, గన్నవరం విమానాశ్రయంలో 7, ఏలూరులో 7, ఎలమంచిలిలో 7 నందిగామలో 7, పాలకోడేరులో 6, కర్నూలులో 8, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, కోటలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాల పెద్దేముల్లో 22 సెం.మీ, పరిగిలో 21, గండేడులో 13, పర్వతగిరిలో 13, మిర్యాలగూడలో 11, కొత్తగూడెంలో 10, కొడంగల్‌లో 9, దర్మసాగర్లో 9, హయత్‌నగర్‌లో 8, బోనకల్, భువనగిరిలో 8, షామీర్పేట, భీమదేవరపల్లి, గార్ల మండలాల్లో 6, తిమ్మాపూర్, ఇల్లెందు, దోమ, కోస్గి, ఇబ్రహీంపట్నం, వికారాబాద్ బొమ్రాస్ పేటల్లో 7 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, భాగ్యనగరంలో బుధవారం ఉదయం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయయమయ్యాయి. రహదారులు తటాకంలా మారడంతో వాహన చోదకులు నరకయాతన అనుభవించారు. వరద నీటితో జలమయమైన రహదారులపై ముందుకెళ్లలేక వెనక్కి రాలేక తీవ్ర అవస్థలు పడ్డారు.
ఉప్పల్‌లో భారీ వర్షానికి నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మొట్రో స్టేషన్, జెన్ట్యాక్ వద్ద వరదనీరు నిలిచిపోయింది. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి హబ్సిగూడ వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 8గంటల నుంచి మాదాపూర్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. 9.30 గంటల ప్రాంతంలో కాస్త తగ్గుముఖం పట్టింది. హైటెక్ సిటీకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది. చాదర్‌ఘాట్, ఆజంపూర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జలమయమైన రోడ్లపై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మలక్‌పేట ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో విద్యార్ధులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. నల్గొండ చౌరస్తా, ఐఎస్ సదన్, చంచల్‌గూడ ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోయింది.
మాదన్నపేట కూరగాయాల మార్కెట్లో భారీగా వరద నీరు చేరడంతో కూరగాయలు అమ్మకాలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి చాదర్ ఘాట్, మలక్‌పేట వంతెన, ఆజంపురాలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైల్వే వంతెన కింద భారీగా నీరు చేరి చెరువును తలపించే విధంగా ఉంది. ఆరాంఘర్ చౌరస్తాలో భారీగా వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పోలీసులు దగ్గరుండి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. ఉప్పరపల్లి వద్ద తటాకాన్ని తలపించేలా నీరు నిలిచిపోయింది. సమీపంలోని బస్తీలు జలమయమయ్యాయి.
ఇళ్లల్లో వరద నీరు చేరి, బస్తీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. మియాపూర్ ప్రాంతంలో ఉదయం నుంచి బారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జాతీయ రహదారిపై మియాపూర్, మదీనాగూడ ప్రాంతాల్లో రెండు అడుగుల మేర వర్షం నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాగా, పంజాగుట్ట మార్కెట్‌బస్తీ ముందు నిమ్స్ మెడికల్‌హాల్ సమీపంలో టమోట లోడుతో ఉన్న ఓ డీసీఎం వెనుకటైరు రోడ్డుపై ఉన్న రంధ్రంలో కుంగడంతో డీసీఎం ఆగిపోయింది. అదే దారిలో వస్తున్న ఆర్టీసీ బస్సు డీసీఎం పక్కనే మొరాయించడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ట్రాఫిక్ పోలీసులు ఎర్రమంజిల్ వద్ద వాహనాలను చైనాబజారు షాపు వైపు మళ్లిస్తున్నారు.


