ప్రయాణం లేకుండా ఉనికి సాధ్యమా?
- 98 Views
- wadminw
- December 23, 2016
- Home Slider యువత సంపాదకీయం
చరిత్ర పొడుగునా ఎప్పుడైనా మానవప్రాణికి ప్రయాణం లేకుండా గడిచిందా? కెన్యాలోనో, ఆఫ్రికాలో మరెక్కడో పుట్టిన మనిషికి ప్రయాణమే గదా భూగోళాన్ని పరిచయం చేసింది! భూఖండానికంతటికీ విస్తరింపజేసింది! కొత్త వాతావరణాలు ఇచ్చింది! కొత్త భాషలు నేర్పింది! కొత్త జీవితం సృష్టించింది! కొన్ని ప్రయాణాలు భౌతికంగా సశరీరంగా చేసేవి కావచ్చు. మరికొన్ని ప్రయాణాలు అంగుళం కూడ కదలకుండానే మనసులో విశ్వాంతరాళాన్ని మునివేలితో తాకివచ్చేవి కావచ్చు.
చిన్నదో పెద్దదో సంతోషదాయకమైనదో దుఃఖభాజనమైనదో భౌతికమైనదో మానసికమైనదో ప్రయాణం లేకుండా మనిషి ఉనికి సాధ్యమేనా? ఏ వ్యక్తి జీవితమైనా, ఏ సమాజ జీవితమైనా ఎన్నెన్ని ప్రయాణాల కలనేత? ఎన్నెన్ని మజిలీల తలపోత? చదువు కోసమూ, ఉద్యోగం కోసమూ, ఆలోచనల కోసమూ, ఆచరణ కోసమూ, నా కోసమూ, ఇతరుల కోసమూ, ఇతరుల మాటలు నేను వినడానికీ, నా మాటలు ఇతరులకు వినిపించడానికీ ఐదు దశాబ్దాలుగా అనేక ప్రయాణాలు చేశాను గాని ఈ వారం, పది రోజులలో చేసిన మూడు ప్రయాణాలు పాఠకులతో పంచుకోవాలి.
వాటిలో రెండు భౌతిక ప్రయాణాలు. ఒకటి పశ్చిమ సముద్ర తీరానికీ, మరొకటి తూర్పు సముద్ర తీరానికీ. రెండు చోట్లా అట్టడుగు శ్రమైకజీవన సౌందర్యపు సహవాసంలో కొన్ని గంటలు గడిపే అవకాశం వచ్చింది. ఈ రెండు ప్రయాణాలు మనిషి మీద, భవిష్యత్తు మీద గొప్ప ఆశను కలిగించినవి. ఇక మిగిలినది మానసిక ప్రయాణం సుదీర్ఘంగా అరవై సంవత్సరాలుగా సాగుతున్న ప్రయాణం.
నావరకు నేను నలభై సంవత్సరాలుగా చేస్తున్న ప్రయాణం. ఇప్పుడిప్పుడే ఒక మజిలీకి చేరుతున్న అనుభవం. ఈ ప్రయాణం రాజకీయాల మీద, వ్యవస్థ మీద అంతులేని నిరాశను మిగిల్చినది. మొదటి ప్రయాణం ముంబాయికి. అక్కడ తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక నాయకత్వంలో జరిగిన తెలంగాణ బిల్లు సాధన బహిరంగ సభలో మాట్లాడడానికి. తెలంగాణ నుంచి పొట్ట చేత పట్టుకుని ముంబాయికి వెళ్లిన తెలంగాణ బిడ్డలు దాదాపు పదిహేను లక్షల మంది ఉండవచ్చునని అంచనా.
వాళ్లు తమ వృత్తుల, కులాల, అభిరుచుల ప్రాతిపదికపై నలభైకి పైగా నిర్మాణాలలో, ప్రజాసంఘాలలో సంఘటితమై ఉన్నారు. ఆ సంఘాలన్నీ కలిసి ఆ సభను నిర్వహించాయి. ఉదయం దిగిన దగ్గరినుంచి మర్నాడు ఉదయం దాకా ఆ శ్రమజీవులు చూపిన ఆదరణ, వాళ్లలో వ్యక్తమైన తెలంగాణ చైతన్యం అబ్బురపరచాయి. వాళ్లలో చాల మంది తెలంగాణలో చేనేత రంగం విధ్వంసమైన నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ కార్మికులుగా బొంబాయికి వలస వెళ్లినవాళ్లు. దేశవ్యాప్తంగా నిర్మాణాలు చేసిన పాలమూరు వలస కార్మికులు.
తెలంగాణలో బతుకుదెరువు లేక ఆ అన్వేషణలో మహావకాశాల నగరంగా ముంబాయికి తరలివెళ్లిన వాళ్లు. ముంబాయి వస్త్ర పరిశ్రమ మూతపడడంతో ఆ మిల్లు కార్మికులు కూడ ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులుగా, ప్రైవేటు విద్యుత్ సరఫరా సంస్థ ఉద్యోగులుగా, పనిమనుషులుగా, ఏ రోజుకారోజు బతుకు వెళ్లదీసుకునే రోజు కూలీలుగా జీవిస్తున్నారు. ముంబాయి మహానగరంలో అత్యంత కష్టభరితమైన పరిస్థితులలో నిరుపేద జీవితాలు గడుపుతూ కూడ వారిలో వ్యక్తమైన మాతృభూమి అభిమానం చూస్తే కళ్లు చెమర్చాయి.
వలసవాదం నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడం కోసం సరిగ్గా వంద సంవత్సరాల కింద అమెరికాలో, కెనడాలో ఇటువంటి వలస కార్మికులు, విద్యార్థులు, చిరుద్యోగులు ప్రారంభించిన గదర్ పార్టీ గుర్తుకొచ్చింది. కన్నవారినీ పుట్టిన ఊరినీ వదిలి ఉపాధి కోసం వందల మైళ్లు వలస వెళ్లవలసి వచ్చినా తాము పుట్టిన ఊరిలో, ప్రాంతంలో జరుగుతున్న జనజీవన చలనాన్ని పట్టించుకుని, అందులో భాగం కావడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్లు. అవకాశం దొరికితే తిరిగి వెనక్కి రావాలనీ, మాతృభూమి పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలనీ వాళ్ల కోరిక.
తెలంగాణ రాష్ట్ర సాధన వాళ్లకు వెనక్కి తిరిగి వచ్చే అవకాశంగా కనబడింది గనుక వాళ్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగమయ్యారు. కోస్తాంధ్ర, రాయలసీమ పాలకుల విధానాల వల్లనే తమకు తమ పుట్టిన ఊరిలో ఉపాధి కరవైందనీ, ఆ పాలకులు తొలగిపోతే మళ్లీ తమ బంధుమిత్రుల మధ్యకు రావచ్చుననీ వాళ్లు భావిస్తున్నారు. గోరేగావ్ ఆజాద్ మైదాన్‌లో సగానికి సగం స్త్రీలతో, కుటుంబాలు కుటుంబాలుగా ఐదారువేల మందితో కిక్కిరిసిన ఆ బహిరంగ సభ వాళ్ల ఆకాంక్షలకు ప్రతిబింబం.
రెండో ప్రయాణం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఆర్ టి సి కార్మికులు ఏర్పాటు చేసుకున్న రాజకీయ శిక్షణా తరగతుల్లో మాట్లాడడానికి. నానాటికీ పని పరిస్థితులు దుర్భరంగా మారిపోతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో యాజమాన్యపు దుర్మార్గాలను, అక్రమాలను ప్రతిఘటించడానికి సంఘటిత కార్మికోద్యమం బలపడవలసిన అవసరం ఎంతో ఉంది.
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రపంచ బ్యాంకు పాలనలోకి వెళ్లిపోయిన తర్వాత, ఆర్ టి సి ని ప్రైవేటీకరించడానికి, మొత్తంగా ప్రజా రవాణా రంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు పెచ్చరిల్లుతున్నాయి. ఆ ప్రయత్నాలను ఎదుర్కోవలసిన కార్మిక సంఘాలు యాజమాన్యంతో లాలూచీ పడే, స్వప్రయోజనాల కోసం పనిచేసే నాయకత్వాల కింద ఉన్నాయి. ఈ స్థితిలో బీజరూపంలోనైనా కార్మికవర్గ సమరశీల చైతన్యాన్ని నిలిపి ఉంచడం కోసం, కార్మికులకు తమ జీవన స్థితిగతుల గురించీ, ఉద్యోగ భద్రత గురించీ చెప్పడం మాత్రమే కాక, రాజకీయ శిక్షణ కూడ ఇవ్వవలసిన అవసరం గుర్తించిన చిన్న కార్మిక బృందం తూర్పు గోదావరి జిల్లాలో చాల కాలంగా పనిచేస్తున్నది.
వందమందికి పైగా డ్రైవర్లూ కండక్టర్లూ పాల్గొన్న ఆ చిన్న శిక్షణా తరగతుల్లో వ్యక్తమైన కార్మిక సంఘీభావం, అగ్రగామి చైతన్యం, తమ వృత్తి గురించి మాత్రమే కాక శాస్త్రీయ ప్రాపంచిక దృక్పథం గురించి తెలుసుకోవాలనే తపన, కార్మికులుగా తమకు లోకంలోని ప్రతి విషయమూ తెలిసి ఉండాలనీ, ప్రతి విషయం మీద తమకొక వైఖరి ఉండాలనీ అవగాహన భవిష్యత్తు మీద గొప్ప ఆశను కలిగించాయి. ఈ రెండు ప్రయాణాల్లోనూ పూసల్లో దారంలా మనసులో మెరమెరలాడుతున్నది సుదీర్ఘ తెలంగాణ ప్రయాణం.
ముంబాయి ప్రయాణంలో అది స్పష్టంగానే, ప్రత్యక్షంగానే ఉన్నది. అప్పటికి కేంద్ర మంత్రివర్గ బృందం తన పని పూర్తి చేసి మంత్రివ్రర్గానికి తన ముసాయిదా సమర్పించలేదు. కాని రేపో మాపో ఆ పని జరుగుతుందనే ఆశ, జరగాలనే కోరిక ఉన్నాయి. ఆ సభంతా ఆ ఆశ మీదనే సాగింది. రామచంద్రాపురం ప్రయాణం నాడు కేంద్ర మంత్రివర్గం ఆ ముసాయిదాను ఆమోదించబోతున్నది. ఆ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న వారందరూ తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారే అయినప్పటికీ, తెలంగాణ ఏర్పాటయితే ఏం జరుగుతుందో అనే సందేహాలు ఉన్నవారే అయినప్పటికీ, తెలంగాణ ప్రజలకు ఆరు దశాబ్దాలుగా జరిగిన అన్యాయం తెలిసిన వారు.
కార్మికవర్గ చైతన్యంతో అర్థం చేసుకున్నవారు. తెలంగాణ ఏర్పాటును మనసారా స్వాగతిస్తున్నవారు. ఆ శిక్షణా తరగతి అయిపోయి తిరిగివస్తుంటే ఆ ప్రయాణం పొడవునా కేంద్ర మంత్రివర్గం ముసాయిదాను ఆమోదించిందన్న సందేశాలు. అవునా, తెలంగాణ ఏర్పడనున్నదా? ప్రయాణం ముగిసిపోనున్నదా? అసలు ప్రయాణానికి ముగింపు ఉంటుందా, మజిలీలు మాత్రమే ఉంటాయా?
ఇప్పుడొక మజిలీకైనా చేరబోతున్నామా? ఎండమావే ఒయాసిస్సులా కనబడుతున్నదా? నాలుగు సంవత్సరాల కింద 2009 డిసెంబర్లో ఖమ్మంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ రైలు నలభై సంవత్సరాలు ప్రయాణం చేసి, డిసెంబర్ 9న ఔటర్ సిగ్నల్ దగ్గరికి చేరుకున్నదనీ, డిసెంబర్ 23న దాన్ని అక్కడ ఆపేశారనీ, ఔటర్ సిగ్నల్ దాకా వచ్చిన రైలును ప్లాట్ ఫారం మీదికి రాకుండా ఎవరూ ఆపలేరనీ అన్నాను. ఆ ఔటర్ సిగ్నల్ దగ్గర నిరీక్షణ నిండా నాలుగు సంవత్సరాలు సాగింది. ఇప్పటికైనా రైలు కదులుతున్నదా?
ప్లాట్ ఫారం మీదికి చేరుతున్నదా? తెలంగాణ ప్రయాణం సుదీర్ఘమైన తండ్లాట. తెలంగాణ తన ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం, స్వయంపాలన కోసం, తన వనరుల మీద తన అధికారం కోసం కనీసం నూట యాభై సంవత్సరాలుగా తండ్లాడుతున్నది. ఆ తండ్లాట ఎన్నెన్నో వ్యక్తీకరణలు పొందింది. ప్రత్యేక రాష్ట్ర వాంఛ తాజా వ్యక్తీకరణ. అది సాధించినంత మాత్రాన ఆ తండ్లాట, ఆ ప్రయాణం పూర్తయిపోదు. కాని అది ఒక ముఖ్యమైన మజిలీ. ఆ మజిలీ అయినా చేరినట్టేనా? భౌతిక ప్రయాణాలకు ఎక్కడో ఒకచోట ముగింపు, కనీసం ఏదో ఒక మజిలీ ఉంటాయి. కాని మానసిక ప్రయాణాలకు గమ్యం ఉందా? ఎక్కడికక్కడ కొత్త ప్రయాణం మొదలవుతుందా?


