బంగారు భూములుగా మారిన బంజర్లు!
పోలవరం, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): ప్రభుత్వం భూములు ఇచ్చినా వాటిని సేద్యం చేసుకోలేక కూలీలుగానే జీవిస్తున్న తరుణంలో ఇందిర జలప్రభ కార్యక్రమంతో తాము రైతులుగా సమాజంలో గౌరవప్రదమైన జీవనాన్ని సాగించే స్ధాయికి చేరుకున్నామని షెడ్యూల్డు కులాల రైతులు ధీమాగా చెబుతున్నారు. ఇందిర జలప్రభ ద్వారా తాము కూలీల స్ధాయి నుండి రైతులుగా అభివృద్ధి సాధించిన తీరును జీలుగుమిల్లి శివారు రామన్నపాలెం రైతులు బొంతు లక్ష్మణరావు, ముంగముర్రు ప్రభాకరరావు, కనుమాల శేషగిరి, చేబట్టున్న వీరాస్వామి వెల్లఢించారు.
మావూరు మండల కేంద్రమైన జీలుగుమిల్లి గ్రామపరిధిలోని రామన్నపాలెం. మాషెడ్యూల్డు కులాల పేదలకు ప్రభుత్వం మిగులు భూములు పంపిణీ చట్టం ద్వారా మూడు దశాబ్దాల క్రిందట సుమారు 150 ఎకరాల భూమి అందజేసింది. అయితే ఈ భూమి సాగుయోగ్యంగా లేకపోవుట చేత ఏవిధమైనటువంటి సేద్యం లేక పేదలు పేదలుగానే ఉండిపోయారే తప్ప రైతులుగా మారి తగిన ఫలసాయం పొందలేకపోయామని బొంతు లక్ష్మణరావు అన్నారు. ఈవిషయాన్ని గమనించిన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ఇందిర జలప్రభ క్రింద ఈభూములను బ్లాక్‌లుగా గుర్తించి సాగులోనికి తీసుకురావడానికి అవకాశం కల్పించారు.
రామన్నపాలెం బ్లాక్‌లో షెడ్యూల్డు కులానికి చెందిన నాతోపాటు ముంగముర్రు ప్రభాకరరావు, కనమాల శేషగిరి, చేబట్టున్న వీరాస్వామి అనే లబ్దిదారులకు చెందిన 14.25 ఎకరాల భూమిని ఇందిర జలప్రభలో గుర్తించారు. ముందుగా ఈ భూమిలో దుక్కి దున్ని రాళ్లు, పొదలు తొలగించిన పిదప ఇందిర జలప్రభ పధకంలో బోరు బావి నిర్మించారు. తద్వారా సాగునీరు సేద్యానికి లభించడంతో మా భూముల్లో వ్యవసాయం చేసేందుకు అవకాశం ఏర్పడింది. బోరు నిర్మాణం జరిగిన తర్వాత ప్రభుత్వ సహాయంతో దానికి విద్యుత్తు కనెక్షన్, మోటారు ఏర్పాటు చేసుకుని, ఆభూముల్లో ఉద్యానవన పంట అయినటువంటి పామాయిల్ మొక్కలను నాటుకున్నామని లబ్దిదారులు వెల్లడించారు.
అంతర పంటల సేద్యం కొరకు ప్రభుత్వం మొదటి సంవత్సరం 50 వేల రూపాయిలు అందజేయగా దీనికి తోడుగా తాము పత్తి, మొక్కజొన్న పంటలను అంతర పంటలుగా సాగుచేస్తున్నామన్నారు. ఈ అంతరపంటల సేద్యం వలన లభించు ఆదాయం ఎకరానికి సుమారు 30 వేల నుండి 40 వేల రూపాయల వరకూ పొందగలమన్నారు. ఇందిర జలప్రభ ద్వారా బీడు భూములు సాగులోనికి రావడంతో లబ్దిదారులైన లక్ష్మణరావు, ప్రభాకరరావు, శేషగిరి, వీరాస్వామి తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.
ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంత రైతాంగానికి ప్రభుత్వం సుస్ధిర వ్యవసాయం అందించి జలకళతో రైతన్న గుండెల్లో ఆనందాన్ని నింపడానికి ఇందిర జలప్రభ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోంది. పేదరికంలో జీవిస్తున్న 5 లక్షల మంది ఎస్సి, ఎస్‌టిల కుటుంబాల జీవితాల్లో సుస్ధిరమైన ఆర్ధిక అభివృద్ధి సాధించాలన్న తలంపుతో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించిన ఇందిర జలప్రభ కార్యక్రమంతో బంజరు భూములు జలకళతో సస్యశ్యామలం అవుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మెట్ట ప్రాంత మండలాల్లో 7 వేల 270 మంది ఎ స్సి, ఎ స్టి లబ్దిదారులకు చెందిన 13 వేల 473 ఎకరాలను 40 కోట్ల రూపాయల వ్యయంతో ఇందిర జలప్రభ ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తద్వారా బంజరు, బీడు భూములుగా ఉన్న వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ఆర్ధిక స్ధోమత లేక కూలీలుగా జీవిస్తున్న పేదలకు ఇందిర జలప్రభ కార్యక్రమంతో తలెత్తుకు తిరిగే స్ధాయికి ఎదుగుతున్నారు. జిల్లాలో ఇంతవరకూ రూ. 5.33 కోట్ల రూపాయలతో భూమి అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా 1402 మంది ఎస్సిలు, 471 మంది ఎస్టి కుటుంబాలు ప్రయోజనం పొందాయి. ఈ ఏడాది రూ. 7.62 కోట్లతో 4 వేల 765 ఎకరాల భూమి అభివృద్ధి పరిచేపనులు చేపట్టారు.


