బాబు ఎఫెక్ట్‌తో ‘ప్రత్యేక’ బ్యాన్?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తుందో రాదో తెలియదు కానీ, ఈ అంశం మాత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును రాజకీయంగా తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. చంద్రబాబు ఒత్తిడి పుణ్యంతో ఇక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని, ప్రత్యేక హోదా అంశాన్నే ఎత్తివేయాలని యోచిస్తోందట కేంద్ర ప్రభుత్వం. తాజాగా తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఒకవైపు మిత్రపక్ష పార్టీగా ఉంటూ వస్తున్న టీడీపీ నుంచి బీజేపీకి చిరకాల మిత్రుడైన పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక హోదాపై విరుచుకుపడటంతో సందిగ్దతలో పడిన కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎదురవుతున్న ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. ఇప్పటిక వరకు మన దేశంలో వెనుక బడిన రాష్ట్రాల అభివృద్ది కోసం కేంద్ర సర్కార్ ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తుంది.
అయితే తాజా ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఏపీకి హోదా ఇస్తే బీహార్, ఒడిసా, బెంగాల్ తదితర రాష్ట్రాలు కూడా అడుగుతాయి. రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది. ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధానాంశం అవుతుందని కేంద్రం ఏపీకి చెబుతున్న మాట. ఈ క్రమంలో అసలు ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇవ్వడం ఎందుకు? ప్రత్యేక హోదా అనే అంశాన్నే పూర్తిగా ఎత్తివేసేందుకు కేంద్రం పావులు కదుపుతుంది. త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు ఈ హోదా అంశానికి సంబంధించిన ప్రతిపాదన రానుండటం గమనార్హం. మనదేశంలో ప్రస్తుతం ప్రత్యేక హోదా 11 రాష్ట్రాలకు అమలవుతోంది. తాజా ప్రతిపాదన ప్రకారం ఇకపై ఏ రాష్ట్రానికి హోదా ఇచ్చే అవకాశం ఉండదు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలను కూడా ఆ కేటగిరీ నుంచి తప్పిస్తారు.
అయితే హోదా కింద ఇప్పటి వరకు అందుతున్న ప్రయోజనాలను మాత్రం కొనసాగిస్తారు. ఆయా రాష్ట్రాల సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా వాటి అవసరాలకు అనుగుణంగానే ప్రయోజనాలు కలిపిస్తారు. హోదా ఇచ్చేది ఎవరు? జాతీయ అభివృద్ది మండలి(ఎన్డీసీ)లో ప్రధాని, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రణాళిక సంఘం ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మండిలిలోనే నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు ఎన్డీసీ రద్దయ్యింది. అందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమని కేంద్రం భావిస్తోంది. 14 వ ఆర్థిక సంఘం మరోవైపు 14 వ ఆర్థిక సంఘం కూడా ప్రత్యేక హోదా కొనసాగించడంలో అర్థం లేదనే భావనను తన నివేదికలో వ్యక్తం చేసిందని అధికారులు పేర్కొన్నారు.
కేంద్రం నుంచి అందుతున్న సహయం 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ద్వారా వచ్చే నిధులను రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకుంటే అభివృద్ది సాధ్య పడుతుందని అభిప్రాయ పడింది. ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ది మండలి రద్దు ఈ క్రమంలో ఇప్పటికే ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ది మండలి వంటి కీలక విభాగాలను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం రాజకీయ ఒత్తిడులు తప్పించుకునే క్రమంలో ప్రత్యేక హోదా ను కూడా రద్దు చేస్తే సరిపోతుందిగా అన్న దిశగా యోచిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే కేటినెట్ ముందుకు ఓ ప్రతిపాదన కూడా వచ్చిందని అంటున్నారు. ప్రత్యేకహోదా వల్ల కలిగే లాభం ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రాలకు రెండు రకాల ప్రయోజనాలున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో గ్రాంట్లు వస్తాయి. అంటే ఆయా పథకాలకయ్యే మొత్తంలో 60 శాతం కేంద్రం భరిస్తే, రాష్ట్రాలు 40 శాతం భరించాలి.
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు మాత్రం పది శాతం భరిస్తే చాలు. కేంద్రమే 90 శాతం ఖర్చుచేస్తుంది. ఇకపోతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అలోచనను మార్పు చేస్తూ మరో తీపి కబురు ను వినిపించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీని ప్రకటించాలన్న యోచనలో కేంద్ర ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వివరణ ఇచ్చారు. ఏపీ విభజన నష్టాన్ని పూడ్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రులను తరచూ ఏపీకి తీసుకొచ్చి వారితో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీకి హోదా ఇచ్చినా కేంద్రం నుంచి అందే సాయం మాత్రం పదేళ్ల పాటు కొనసాగాలనదే తన అభిమతమని వివరించారు. సరైన కసరత్తు లేకుండా రాష్ట్రాన్ని విభజించడం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందన్న మంత్రి చట్టంలో పేర్కొన్న, నోటి మాట ద్వారా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.
కొందరు చంద్రబాబును భయ పెడతున్నారని, ఆయన భయపడాల్సిన పని లేదని అన్నారు. హోదా విషయంలో కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. హోదా వస్తే అన్నీ వస్తాయని అనుకోవడం పొరపాటేనన్నారు. తానెప్పుడూ ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదని, అయితే రాష్ట్రాభివృద్దికి అదే సంజీవని మాత్రం కాదని పేర్కొన్నారు. దీనిని బట్టి గమనిస్తే ప్రత్యేక హోదాపై కేంద్రం ఎంత సీరియస్‌గా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. అనవసరపు పొకడలపోయి సమస్యలను కొన్ని తెచ్చుకోవడం ఎందుకు? అన్న కేంద్రం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఏదేమైనా మరి కొన్ని రోజులో ప్రత్యేక హోదా అనే పేరు లేకుండా కేంద్ర పావులు కదుపుతుందనడంలో సదేహం లేదు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేనట్టేనా? భారీ ప్యాకేజీతోనే ఏపీ ప్రజలను కేంద్రం మెప్పిస్తుందా? ప్రత్యేక హోదా కంటే భారీ ప్యాకేజీతోనే మెరుగైన మేలు జరుగుతుందన్న మాటలో వాస్తవం ఉందా? ఇంతకీ ప్రత్యేహోదా బెటరా? లేక భారీ ప్యాకేజీ సూపరా? ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హోదా కంటే మించి ప్యాకేజీని ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం కసరత్తుల్లోకి దిగిపోయిందట. ఈ విషయమై మూడు నాలుగు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబుతో, కేంద్రమంత్రి సుజనా చౌదరితో కేంద్రమంత్రులు జోరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రత్యేక హోదా బదులు అంతకు మించిన ప్యాకేజీ ఇస్తామని కేంద్రమంత్రులు చంద్రబాబుకు, సుజనాకి చెప్పినట్లుగా తెలుస్తోంది. హోదాకు బదులు ఏపీకి ఇచ్చే ప్యాకేజీని కేంద్రం సిద్ధం చేస్తోందని, ఇందుకు సంబంధించి ఇటీవల మరింత కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ప్యాకేజీ పైన కసరత్తు నేపథ్యంలోనే కేంద్రమంత్రులు, చంద్రబాబు, సుజనలతో చర్చలు జరుపుతోంది.
అమరావతికి 5 వేల కోట్ల రూపాయల వరకు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేనందున, అదేవిధంగా భారీ ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తున్నందున ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 4 వేల కోట్ల రూపాయల నుంచి 5 వేల కోట్ల వరకు ప్రత్యేకంగా కేటాయించాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకేజీకి అధిష్టానం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. ఏపీ కోసం ఇచ్చే హామీలు ఇలా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ చేయడం. ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీల కన్నా మెరుగైనవి ఇవ్వడం. రాజధాని అమరావతి నిర్మాణానికి 4 వేల రూపాయల నుంచి 5 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం వంటి హామీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ నేతలతో చర్చలు ప్రత్యేక హోదా బదులు భారీ ప్యాకేజీ విషయమై కసరత్తు చేస్తున్నామని, తుది దశకు చేరుకుందని ఏపీ బీజేపీ నేతలతోను అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇంకా ఏం చేయాలో ఏపీ నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. అయితే హోదా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను రాజీ పడే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధానికి నిధులు, ఆర్థిక లోటు భర్తీ, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ కావాలని బాబు కోరుతున్నారు. అయితే ప్రత్యేక హోదాను మరిపించే మెగా ఫ్యాకేజీతో ఏపీ ప్రజలను సంతృప్తి పరచాలన్న నిర్ణయంతో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం చెబుతున్న ఆ భారీ ప్యాకేజీ తీసుకోవాలా? లేక ప్రత్యేకహోదా తీసుకుంటేనే మేలు జరుగుతుందా? రెండింటిలో ఏదీ బెటర్ అనే సందిగ్ధత పలు పార్టీల నేతలతో పాటు ప్రజల్లోనే నెలకొని ఉంది. ప్రత్యేక హోదా వల్ల ప్రత్యేక లాభాలు, సదుపాయాలు పొందుతున్న విషయాలను ఒకసారి పరిశీలిస్తే, దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
ప్రత్యేకహోదా రాష్ట్రాలకు కేంద్ర గ్రాంట్లు 90 శాతం వరకు వస్తాయి. 10 శాతం మాత్రమే లోన్ వస్తుంది. గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనక్కర్లేదు. లోన్ ద్వారా ఐతే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు భారీగా రాయితీలు లభిస్తాయి. 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా 100 శాతం రాయితీ ఉంటుంది. పన్ను మినహాయింపులు, ప్రైట్ రీయింబర్స్ మెంట్లు దక్కితే పారిశ్రామికవేత్తలు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతారు. ప్రత్యేక హోదాతో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. అంతేకాదు భారీ స్థాయిలోనే ఉద్యోగవకాశాలు సమకూరుతాయి. పన్నురాయితీలు, ప్రోత్సహకాల వల్ల కొనుగోలు చేస్తున్న అనేక వస్తువుల ధరలు తగ్గుతాయి. కరెంటు చార్జీలు కూడా తగ్గుతాయిది. వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా హోదాతో పొందవచ్చు.
ప్రత్యేకహోదా వల్లే ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో రెండు వేల పరిశ్రమలు వచ్చాయి. దాంతో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. వెనకబడిన రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేకహోదా వల్ల పది వేల పరిశ్రమలు వచ్చాయి. అలాంటిది 5 కోట్ల ప్రజానీకం గల 972 కి.మీ. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభిస్తే అది పెద్ద సంజీవనే అవుతుందని ఏపీ ప్రజలు అంటున్నారు. నిజానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఏపీ ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీ వస్తే రాష్ట్రంలో తమ జీవితాలు బాగుపడుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం హోదా కంటే భారీ ప్యాకేజీ అంటూ రెడీ అవుతుండటం చర్చనీయాంశమవుతోంది. మొత్తానికి కేంద్రం అధికారికంగా వెలువరించే చివరి నిర్ణయం ఏముంటుందనే దానిపైనే ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమ మనసును ఏ మాత్రం నొప్పించినా వారికి కూడా కాంగ్రెస్ లాంటి గతే పట్టించాలని ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది వాస్తవం.


