బీర్కే భవన్‌ను పీడించనున్న సీట్ల కొరత
- 57 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): తెలుగు రాష్ట్రాల విడదీత తరవాత ఆంధ్రప్రదేశ్‌కి హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం అన్ని రకాలుగా ఏపీ కి మేలు అవ్వాలి అంటే వారు ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని ఉన్న హైదరాబాద్ మీద హక్కులు కాకపోయినా రాజధాని అనే పేరుని 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఏర్పాటు చెయ్యాలి అని ఆ చట్టంలో పేర్కొన్నారు అప్పటి నాయకులు. ప్రైవేటు ఉద్యోగులు, ప్రైవేటు కాంట్రాక్టర్లూ తప్ప దాదాపు ఏపీకి సంబంధించిన ప్రతీ ప్రభుత్వ ఉద్యోగీ ప్రస్తుతం హైదరాబాద్ ఖాళీ చేసేశాడు. ముఖ్యంగా సచివాలయం విషయంలో అప్పట్లో భారీ గొడవలే జరిగాయి.
అందరూ కలిసి ఉండే సచివాలయంలో తెలంగాణా ఆఫీసర్లూ, ఏపీ ఆఫీసర్లు అంటూ గొడవలు చేసుకున్నారు. వారిని కూల్ చెయ్యడానికి ఇటు చంద్రబాబు అటు కెసిఆర్ రావాల్సి వచ్చింది చాలా సార్లు. ఇప్పుడు ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి వెళ్ళిపోయారు. మొదట అస్సలు కుదరదు అంటే కుదరదు అని చెప్పిన వారు ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితిని అర్ధం చేసుకుని అక్కడ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకొని వారి డిమాండ్లని సాధించుకుని కొత్త ప్రాంతంలో కొలువులు మొదలు పెట్టేసారు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏపీ సచివాలయ ఉద్యోగులు హాయిగా అమరావతిలో పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు అనుకోని ఇబ్బంది వచ్చి పడింది. చక్కగా ఉన్న భవనాలను కూల్చి అద్భుతమైన కొత్త భవనాన్ని కట్టించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు చకచకా సన్నాహాలు చేస్తోంది. 10 రోజుల్లోగా సచివాలయ ప్రాంగణం మొత్తం ఖాళీ చేసేయ్యాలి అని డైరెక్ట్ కేసీఆర్ తాలూకా ఆఫీసర్ల దగ్గర నుంచే ఆదేశాలు వచ్చేశాయి. ఇంజినీరింగ్ విధులతో సంబంధించిన కొన్ని శాఖల కార్యాలయాలని వాటి ప్రధాన ఆఫీసుల భవనాల్లోకి మారుస్తాం అంటున్నారు. మిగిలిన వాటిని బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవనంలోకి మార్చే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది.
దీనికోసం ప్రధాన కార్యదర్శి అలుపు లేకుండా పని చేస్తున్నారు. ఈ ఆఫీసుల తరలింపు పనుల పర్యవేక్షణ బాధ్యతలను 9 మంది అధికారులకు అప్పగించారు. ఏయే శాఖల ఆఫీసులను ఎక్కడికి తరలించాలి, వాటి ఫైళ్లు ఇతరత్రా విషయాలపై వీరు తగిన పర్యవేక్షణ, ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. బూర్గుల భవనం ఇప్పటికే ఆఫీసులతో ఫుల్లుగా నిండిపోయింది. సచివాలయంలో ఇన్ని శాఖల ఉద్యోగులు అక్కడికి వెళితే కనీసం కూర్చోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి. అక్కడ అందరికీ సర్దుబాటు కాకపోతే ఇంకెక్కడికి పంపాలి అనేది ప్రభుత్వానికి ఉన్న ఛాలెంజ్. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలాగూ సచివాలయం జోలికి వెళ్లరు గాక వెళ్లరు. నెలకి ఒకటి రెండు సార్లు కూడా వెళ్లరు.
కాబట్టి కొత్త సీఎంవోను కొత్తగా నిర్మించిన ఆధునిక క్యాంప్ ఆఫీసుకు తరలించాలని నిర్ణయించారు. అంతవరకూ ఇబ్బంది లేదు. మిగతా కార్యాలయాల విషయమే సందిగ్ధంగా ఉంది. 10 రోజుల్లోగా సెక్రెటేరియట్ బోసిపోయి కనిపించబోతోంది అన్నమాట. పేరుకే రెండు రాష్ట్రాలకీ చెందిన సెక్రెటేరియట్ గానీ రెండు రాష్ట్రాల ఆఫీసులూ అక్కడనుంచి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే కనిపిస్తారు. ఉమ్మడి రాజధానిలో ఏపీకి కేటాయించిన భవనాలను తమకు అప్పగించేలా చూడాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. ఏపీ ప్రభుత్వం కూడా ఓకే అంటుందనే నమ్మకంతో కొత్త భవనాల నిర్మాణానికి సిద్ధమవుతోంది.
దీనికి వందల కోట్ల రూపాయలు ఖర్చు కాబోతున్నాయి. ముందు ఏపీ ఉద్యోగులని తరలించి, ఇప్పుడు తెలంగాణా ఉద్యోగులని తరలించి తన వాస్తు లెక్కలో కొత్త సచివాలయం నిర్మించాలి అనే కెసిఆర్ ప్లాన్ ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చింది. స్లో అండ్ స్టడీ విన్స్ దీ రేస్ అనే సామెత ని కెసిఆర్ పక్కగా అమలు పరుస్తున్నారు.


