బీసీసీఐ కార్యదర్శిగా షిర్కే ఎన్నిక
ముంబయి, సెప్టెంబర్ 21: బీసీసీఐకి అంతా తానే అయి కొంత కాలంపాటు చక్రం తిప్పిన ఇండియన్ సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ ఐసీసీలో కూడా తన ఉనికిని చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. బీసీసీఐ, ఐసీసీలో ఏకఛత్రాధిపత్యంతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్.శ్రీనివాసన్ ఆశలు మళ్లీ అడియాసలే అయ్యాయి. ముంబయిలో బుధవారం జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో శ్రీనివాసన్ని ఐసీసీ భారత ప్రతినిధిగా ఎంపిక చేస్తారనే వూహాగానాలు వచ్చినా చివరికి చుక్కెదురైంది.
ఐసీసీ బోర్డ్ డైరెక్టర్ల బృందంలో భారత ప్రతినిధిగా ప్రస్తుతం కొనసాగుతున్న బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూరే కొనసాగనున్నారని బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు బీసీసీఐ కార్యదర్శిగా అజయ్‌షిర్కే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, భారత క్రికెట్ నియంత్రణ మండలి మధ్య ప్రచ్ఛన యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయడంలో కలగజేసుకోవాలని బీసీసీఐ మౌఖికంగా కోరింది. దీన్ని తిరస్కరించిన ఐసీసీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించింది.
వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి (దాదాపు 15 మ్యాచ్‌లు) ఐసీసీ దాదాపు రూ.1000 కోట్లు కేటాయించగా ఈ ఏడాది భారత్‌లో జరిగిన మహిళలు, పురుషుల ప్రపంచకప్ టోర్నీ (దాదాపు 57 మ్యాచ్‌లు)కి కేవలం రూ.311 కోట్లే కేటాయించడంతో బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీసీ ఆదాయంలో భారత్‌కు ప్రస్తుతం 22% వాటా వుంది. కొత్తగా తీసుకొనే నిర్ణయాలకు ఆమోదం లభిస్తే ఈ వాటా 15 శాతానికి పడిపోతుంది. అంటే ఏడాదికి రూ.100 కోట్లు నష్టం వాటిల్లుతుంది. పై కారణాలతో బీసీసీఐ ఐసీసీపై తీవ్ర ఆగ్రహంతో వుంది.
దీనికి తోడు ఐసీసీలో భారత్ ఒక సభ్యదేశం మాత్రమేనని తనకు 105 సభ్య దేశాలూ ముఖ్యమే అంటూ భారత్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేనని శశాంక్ మనోహర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ నేపథ్యంలో భారత్ ఘనంగా నిర్వహిస్తున్న 500వ టెస్ట్ వేడుకలకు మనోహర్‌ను ఆహ్వానించింది. ఈ వేడుకలను తాను హాజరు కాలేనని చెప్పడం అంతరం మరింత పెంచిందని భావిస్తున్నారు. దీంతో ఐసీసీలో మనోహర్‌కు చెక్ పెట్టేందుకు శ్రీనివాసన్‌ను భారత ప్రతినిధిగా తెరపైకి తీసుకురానున్నట్లు వార్తలొచ్చాయి. బుధవారం జరిగిన ఏజీఎం సమావేశానికి వారం ముందు బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే.. శ్రీనివాస్‌ను కలవడం ఈ వాదనకు బలం చేకూర్చింది. అయితే అనురాగ్ ఠాకూరే ఆ బాధ్యతను నిర్వర్తిస్తారని తెలిసింది.


