బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెస్కే
ముంబయి, సెప్టెంబర్ 21: భారత క్రికెట్ జట్టు ఎంపిక బరువు బాధ్యతలను తెలుగు ఆటగాడయిన ఎం.ఎస్.కె. ప్రసాద్‌కు అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్‌ను నియమిస్తూ ముంబయిలో బుధవారం జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ పదవిలో ప్రస్తుతం కొనసాగుతున్న సందీప్ పాటిల్ స్థానంలో ప్రసాద్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారత్ తరపున ఎమ్మెస్కే ప్రసాద్ 6 టెస్టులు, 17 వన్డేలు ఆడారు. బీసీసీఐ సెలక్షన్స్ కమిటీ ఛైర్మన్‌గా నియమితుడైన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు. ఎమ్మెస్కే ప్రసాద్ ప్రస్తుతం జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు.
సీనియర్ సెలక్షన్ కమిటీలోనూ ఏడాది పదవీకాలం కూడా పూర్తి చేసుకున్నాడు. దేవాంగ్ గాంధీ, గగన్ ఖోడా, శరణ్‌దీప్ సింగ్, జతిన్ పరాంజేప్ సభ్యులుగా నియమితులయ్యారు. సెలక్టర్ పదవికి రేసులో ఉన్న వెంకటేశ్ ప్రసాద్ జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. కాగా, క్రికెట్ అంటే ఇండియాలో తెలియని వారుండరంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. అలాంటి క్రికెట్లో మన ఆంధ్రా నుంచి ఎంతమంది ప్రాతినిధ్యం వహించారంటే వెంటనే సమాధానం చెప్పలేం. హైదరాబాద్ బోర్డ్ నుంచి చాలా మంది లెజెంట్స్ ఇండియన్ క్రికెట్లో తమ సత్తా చాటారు. కానీ 60 ఏళ్లు దాటిన ఆంధ్రా బోర్డ్ నుంచి చాలా తక్కువ మంది మాత్రమే భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకున్నారు.
అందులో మొదటి వ్యక్తి ఎమ్మెస్కే ప్రసాద్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు టీం ఇండియా క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయి అత్యున్నత పదవికి చేరుకున్న తొలి తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన క్రీడా జీవితంలో ఎన్నో మజిలీలు. ముంబై, బెంగాల్ బోర్డుల హవా కొనసాగుతున్న సమయంలోనే భారత క్రికెటర్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు ఎమ్మెస్కేది జమీందారీ కుటుంబ నేపధ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమ్మెస్కే ప్రసాద్‌ది జమీందారీ కుటుంబం. అతని తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చి సొంతగా ఎదగాలని ఉద్యోగం సంపాదించుకున్నారు. తనకు చెందాల్సిన ఆస్తిని ఇంటివారికే విడిచిపెట్టారు.
దీంతో ఎమ్మెస్కే చిన్నతనం నుంచే మధ్యతరగతి జీవితం అలవాటైంది. పేరుకి జమీందారీలే అయినా సాధారణ మధ్యతరగతి పరిస్థితుల్లో పెరిగారు. అన్న, చెల్లి ఇంజనీరు, డార్టర్ అయితే తాను మాత్రం క్రికెటర్ అయ్యానని నవ్వుతూ చెప్పుకొస్తుంటారాయన. ‘‘నా చిన్నప్పుడు రెండు గదులున్న ఇంటిలో మేం ఉండేవాళ్లం” అని ఎప్పుడు ఆయన గతాన్ని కదిలించినా ఎమ్ఎస్కె ప్రసాద్ చెబుతారు. స్కూల్ అయిపోయిన తర్వాత గ్రౌండ్‌కి వెళ్లి ఆడుకోవడమే ఆయనకు తెలుసట. ప్రాక్టీస్ చేయడానికి సరైన గైడ్ లైన్స్ లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించడం ప్రసాద్‌కి మాత్రమే సాధ్యమైంది.
క్రికెట్ ప్రారంభించిన మొదటి రోజుల్లో ఒక కోచ్ ఉండేవారట. అనంతరం ఆయన ట్రాన్స్ఫర్ అయి వేరే చోటికి వెళ్లిపోవడంతో తమకు కోచ్ లేకుండానే ప్రాక్టీస్ చేసేవాళ్లమని ఎమ్మెస్కే అంటుండేవారు. “టీవీలో చూసి, హ్యాంగింగ్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాం” అని కూడా ఆయన ఒకానొక సందర్భంలో చెప్పారు. ఓనామాలు నేర్పిన కోచ్ లేకపోవడంతో క్రికెట్ చూసి ప్రాక్టీస్ చేసేవారట. ఇక నెట్ ప్రాక్టీస్ అనేది ఆయనకు అసలు తెలియనే తెలియదట. ఇప్పటి లాగా అప్పట్లో పరిస్థితులుండుంటే కనీసం తాను మరింత గొప్ప క్రికెటర్ అయి ఉండేవాడినని అంటుండేవారు. అప్పటి కాలంలో ఉన్న పట్టుదల, ఆలోచన ఈతరం వారికి లేదనే ఎమ్మెస్కే మాత్రం తాజాగా తనను వరించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నారు.


