బెల్టుషాపులో వ్యక్తి అనుమానాస్పద మృతి
ఏలూరు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): బెల్టుషాపు వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పెరవలి జాతీయ రహదారి పక్కన ఉన్న మద్యం దుకాణానికి గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు పెరవలికి చెందిన మానేపల్లిచంద్రశేఖర్(45) వచ్చాడు. మద్యం కొని తాగి అక్కడే ఉన్న బల్లపై పడుకున్నాడు. కొద్దిసేపు అటుఇటు దొర్లి, కిందపడ్డాడు. అయినా దుకాణ సిబ్బంది పట్టించుకోలేదు. నిద్రపోయాడనుకుని సిబ్బంది వెళ్లిపోయారు. మళ్లీ ఉదయం వచ్చి చూసేసరికి అక్కడే బల్ల వద్ద చంద్రశేఖర్ పడి ఉండడంతో అనుమానం వచ్చిన వారు అతడిని లేపగా లేవలేదు. దీంతో చనిపోయాడని నిర్ధారించుకుని పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న బంధువులు మృతదేహాన్ని చూసి కొట్టి చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కొద్దిసేపు బెల్టుషాపు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. నిర్వాహకులు తమకేమీ సంబంధం లేదని, మద్యం ఇవ్వబోమని చెప్పినా.. వినలేదని, తప్పక ఇచ్చామని చెప్పారు. పోలీసులు ఇరువర్గాల వాదనలు విన్నారు. దీంతో షాపు వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బెల్టుషాపు నిర్వాహకులు, మృతుడి బంధువులు గ్రామ పెద్దల వద్దకు వెళ్లి ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. బెల్టుషాపునకు అనుమతి లేకున్నా.. యథేచ్ఛగా నిర్వహించడం, అర్ధరాత్రి మద్యం అమ్మకూడదని నిబంధన ఉన్నా పాటించకపోవడం నేరమని పెరవలి ఎస్సై పి.నాగరాజు చెప్పారు. చంద్రశేఖర్ ఎలా చనిపోయాడనేది పోస్టుమార్టం నివేదికలో తేలుతుందని వివరించారు. బెల్టుషాపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, జిల్లాలో బెల్టుషాపులను నియంత్రించాలని పలువురు ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను కోరారు. శుక్రవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన జిల్లా వాసులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి ప్రజలు ఫోన్ చేసి బెల్టుషాపుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటిని నియంత్రించాలని కోరారు. దీనికి స్పందించిన ఎస్పీ ఎక్సైజ్ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి ఆ షాపులను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. ఇంకొందరు గణపతి నిమజ్జనాలకు ఏర్పాట్లు బాగా చేశారని ఎస్పీని అభినందించారు. ఏలూరు నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి స్థానిక ఫత్తేబాదలో రోడ్డుపై భవన నిర్మాణ సామగ్రి నిలువ వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులపై జంగారెడ్డిగూడెం నుంచి మరొకరు ఫిర్యాదు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కావడం లేదని, గణపవరం వాసి చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 25 మంది ఫోన్ చేసి వారి సమస్యలు విన్నవించారు.
దత్తత గ్రామాలలో అభివృద్ది పనుల అమలుతీరుపై సమీక్ష
ఏలూరు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): పశ్చిమ గోదావరి జిల్లాలో దత్తత గ్రామాల్లో కూడా పనులు జరగకపోతే ఎలా? ఏడాది నుండి దత్తత గ్రామాల్లో కూడా మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభంకూడా కాకపోతే ఇక అభివృద్ధి పనులు వేగవంతం ఎలా అవుతాయని జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ ప్రశ్నించారు. స్ధానిక కలెక్టరు కార్యాలయంలో శుక్రవారం దత్తత గ్రామాలలో అభివృద్ది పనుల అమలుతీరుపై కలెక్టరు ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఎంతోమంది ప్రజాప్రతినిధులు జిల్లాలో పలు గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఎంతో ఆతృతతో ఉన్నారని అయితే వారు ఆశించిన మేరకు పనుల ప్రగతి కనిపించడం లేదని ఇలా అయితే పనులు పూర్తవడానికి దశాబ్దాలు పడతాయని అటువంటి నిర్లక్ష్య పనివిధానం తనవద్ద కుదరదని డాక్టర్ భాస్కర్ స్పష్టం చేసారు. తూర్పుతాళ్లు గ్రామంలో 650 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని ఏడాది క్రితమే నిర్ణయించినప్పటికీ 524 మరుగుదొడ్లు ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని భాస్కర్ మండలాధికారులను ప్రశ్నించారు. జిల్లాలో బహిరంగ మలవిసర్జన లేని విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అయితే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో జాప్యం జరుగుతోందని ఈవిషయంలో ప్రజల ఆలోచనాధోరణి మారాలని కలెక్టరు కోరారు. బహిరంగ మలవిసర్జనవలన ఆపరిసర ప్రాంతాలు అపరిశుభ్రమై ప్రజలు అనారోగ్యపాలవుతారని తక్షణమే ఆదర్శగ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అక్టోబరు నాటికి పూర్తి చేయాలని కలెక్టరు ఆదేశించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా కుటుంబసభ్యుల ఆత్మగౌరవాన్ని దృష్టిలోపెట్టుకుని ఇంటింటా మరుగుదొడ్డి ముఖ్యమనే భావన పెంచుకోవాలని నేడు సెల్‌ఫోన్‌కు వేలాదిరూపాయలు ఖర్చుచేస్తున్నారని ప్రభుత్వమే పదిహేను వేల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోమంటే ఎ ందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టరు ప్రశ్నించారు. ప్రజలను చైతన్యపరిచి ఒక ఉద్యమరూపంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. మహదేవిపట్నంలో కూడా మరుగుదొడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని కేంద్రమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్న పేరుపాలెం సౌత్, తూర్పుతాళ్లు, పెదమైనివానిలంక గ్రామాలలో పనులకు శంఖుస్ధాపన పేరుతో జాప్యం చేయవద్దని ప్రజాప్రతినిధులు సకాలంలో పనులు జరగాలని కోరుకుంటారని కష్టపడి పనిచేసి నిర్ణీతకాలవ్యవధిలో చేపట్టిన పనులు పూర్తి చేయాలని ప్రారంభోత్సవాలను ఎ ంతో ఘనంగా హట్టహాసంగా నిర్వహించుకోవచ్చునని కలెక్టరు కోరారు. దత్తత గ్రామాలలో నత్తనడకతో పనులు జరిగితే కుదరదని జిల్లా అంతటా త్వరలోనే బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దనున్నామని ఇటువంటి స్ధితిలో దత్తత గ్రామాల్లో మరుగుదొడ్లు ఆలశ్యమైతే సహించబోమని కలెక్టరు హెచ్చరించారు. సంజీవపురం, పెదమైనివానిలంక, పెదకాపవరం, కె.రామవరం, తదితర దత్తత గ్రామాల్లో చేపట్టిన పనులన్నీ డిశంబరు నాటికల్లా పూర్తి చేయాలని డా. భాస్కర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో సిపిఓ శ్రీ బాలకృష్ణ, ఆర్ డబ్ల్యుయస్ యస్ఇ అమరేశ్వరరావు, గృహనిర్మాణశాఖ పిడి శ్రీనివాసరావు, డిసిహెచ్‌యస్ డా. శంకరరావు, డియంహెచ్ఓ డా. కోటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
ఏటీవో రాఘవుల సేవలు ప్రసంశనీయం: ఐపీఅండ్ఆర్ ఏడీ
ఏలూరు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): ఎ ంత ఎ దిగినా ఒదిగి ఉండి అందరిలో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి అసిస్టెంట్ ట్రజరీ అధికారి వై.వి. రాఘవులు అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టరు వి. భాస్కర నరసింహం అన్నారు. ఏలూరు జిల్లా ట్రజరీ కార్యాలయంలో అసిస్టెంట్ ట్రజరీ అధికారిగా శుక్రవారం పదవి విరమణ చేసిన సందర్భంగా స్ధానిక పోలీస్ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన వీఢ్కోలు సభలో ముఖ్యఅతిథిగా భాస్కర నరసింహం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిమనస్సు కలిగి అందరితో మంచిగా ఉండేవారికి అంతా మంచే జరుగుతుందని రాఘవులు తన ఉద్యోగ భాధ్యతలు సక్రమంగా నిర్వహించి వివాదాలకు తావు లేనివిధంగా సర్వీసు పూర్తి చేయడం ఎ ంతో గొప్ప విషయమన్నారు. సమావేశంలో పాల్గొన్న వక్తలు రాఘవులు అందించిన సేవలు కొనియాడడం ఆయన మంచితనానికి నిదర్శనమన్నారు. జిల్లా ఖజానా శాఖా ఉపసంచాలకులు లలితకుమారి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఖజానాశాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా జాయిన్ అయి అంచెలంచెలుగా ఎదిగి ఖజానా కార్యలాయానికి అమూల్యమైన సేవలు అందించారని ప్రతీ చేసిన ప్రతీ చోటా మంచి వర్కర్ అని పేరుగడించిన రాఘవులు పదవీవిరమణ చెందడం అందరికీ చాలా బాధాకరమైన విషయమని అయితే ఉద్యోగంలో చేరిన ప్రతీ ఒక్కరూ పదవివిరమణ చెందాల్సి ఉంటుందని వారి శేషజీవితం ఆయుఃరారోగ్యాలతో, సుఖశాంతులతో గడవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈసమావేశంలో జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు ఎస్వికె. మోహనరావు, అసిస్టెంట్ ట్రజరీ అధికారులు సూర్యకుమారి, కొండలరావు, తూర్పుగోదావరి జిల్లా ఖజానా శాఖ ఎస్టిఓ రమణ, సిబ్బంది ఫాజుద్ధీన్, కృష్ణంరాజు, ఇతర శాఖల సిబ్బంది, కుటుంబసభ్యులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని పదవి విరమణ చెందిన రాఘవులును దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.


