బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో రద్దీ సాధారణం
- 75 Views
- wadminw
- October 5, 2016
- రాష్ట్రీయం
తిరుపతి, అక్టోబబర్ 5 (న్యూస్టైమ్): తిరుమల శ్రీవారి సన్నిధిలో బుధవారం రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం ఉదయం సమయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల్లో స్వామి వారి దర్శనం లభిస్తోంది. మరోవైపు, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదానానికి విజయవాడ నుంచి కృష్ణాజిల్లా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. విజయవాడలోని బెంజిసర్కిల్ లోని లారీయజమానుల కార్యాలయం నుంచి తిరుమలకు బయలుదేరిన కూరగాయల లారీకి అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ పచ్చ జెండా వూపి ప్రారంభించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు సమారు 10 ఏళ్ల నుంచి కూరగాయలు పంపిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొత్త రాష్ట్రానికి, రవాణా రంగానికి తిరుపతి వెంకన్న ఆశీస్సులు ఉండాలని ఏపి లారీ యజమానుల సంఘం రాష్ట్రకార్యదర్శి ఈశ్వరరావు కోరారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు రెండు లక్షల మందికి అన్నప్రసాదాల వితరణ చేస్తున్నట్లు శ్రీవెంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ప్రత్యేకాధికారి చెంచులక్ష్మీ బుధవారం ఇక్కడ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, రుచికరమైన, నాణ్యతతో కూడిన అన్నప్రసాదం, అల్పాహారం, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
గరుడోత్సవం రోజున నాలుగు మాడవీధుల్లో వేచి ఉండే భక్తులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెరుగు అన్నం, సాంబారు అన్నం, బిస్మిలాబాత్ సరఫరా చేస్తామన్నారు. మరో లక్ష మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నామని, చిన్నపిల్లల కోసం పాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నప్రసాద భవనం, క్యూలైన్లు, గ్యాలరీలు, నడకమార్గంలో, యాత్రికుల వసతి సముదాయల్లో అన్న ప్రసాదాల వితరణ కొనసాగుతోందన్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సుమారు 1.6 లక్షల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేసినట్లు వివరించారు.
క్యూలైన్లో 12 వేల మంది భక్తులకు సాంబరు అన్నం, పెరుగు అన్నం, బిస్మిలాబాత్, దాదాపు 75 వేల మందికి పాలు, కాఫీ, టీలు అందించామన్నారు. అన్నప్రసాదాల తయారీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆరోగ్య విభాగం పరీక్షించిన తర్వాతనే భక్తులకు సరఫరా చేస్తున్నట్లు చెంచులక్ష్మి చెప్పారు.


