బ్రాహ్మోత్సవాలకు పోలీసులు బిజీబిజీ
చిత్తూరు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పనిచేస్తున్న పోలీసులు ప్రస్తుతం పరుగులు తీయాల్సి వస్తోంది. ఒక వైపు నేరాల సంఖ్య పెరగడం, మరోవైపు ప్రముఖుల భద్రత కోసం క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సి రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో పనిభారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నారు. నగరంలో శుక్రవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భారీ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసే లోపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం తిరుపతి వస్తున్నారు. 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. దీంతో ఇంట్లో వారితో కూడా గడపలేకుండా పోతున్నారు. ఆధ్యాత్మిక జిల్లా కావడంతో నిత్యం వీఐపీల తాకిడి ఉంటోంది. అదేవిధంగా ఏదో ఒక విషయంపై రాజ కీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనలు చేస్తుం టారు. వీటికితోడు నేరాలతో పోలీసులపై పని భారం అమాంతం పెరిగిపోయింది. ప్రముఖల రక్షణ కోసం ఎండనక, వాననక తిరగాల్సి వస్తోంది. జిల్లాలో ఏ సంఘటనలు చోటు చేసుకున్నా అటువైపు పరుగులు తీయాల్సి వస్తోం ది. నగరంలో ఊహించని విధంగా పెరిగిన ట్రాఫిక్‌ను కట్టడి చేయాలంటే తలప్రాణం తోకకు వస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలుకాక ముందే వీఐపీల పర్యటనతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లా పోలీసులకు పనిభారం ఎక్కువ కావడంతో వారాంతపు సెలవు ఇస్తామని గతంలో అధికారులు చెప్పారు. అమలు చేయడంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు జిల్లాకు నెలకు రెండుసార్లయినా వస్తుంటారు. ఎప్పుడూ ఎవరో ఒక మంత్రి, ఏదో ఒక కమిటీ సభ్యులు వస్తూనే ఉంటారు. దీంతో ఎర్రటి ఎండలో పోలీసులు నిలబడి డ్యూటీ చేయాల్సిందే. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 3వ తేదీ నుంచి 11 వరకు జరగనున్నాయి. బందో బస్తులో 30 మంది డీఎస్పీలు, 65 మంది సీఐలు, 220 మంది ఎస్ఐలు, 470 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1700 మంది పీసీలు, 500 మంది హోంగార్డులు, 200 మంది మహిళా పీసీలు, 500 మంది మహిళా హోంగార్డులు, 15 టీమ్‌లకు చెందిన ఏఆర్, బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది పాల్గొననున్నారు. అప్పటి వరకు ఈ హడావుడి తగ్గే అవకాశం లేదు.
హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య
చిత్తూరు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): తిరుపతి నగరంలోని ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీ హస్టల్ గదిలో విద్యార్థిని శనివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు ఉదయం ఆ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు కాలేజీ సిబ్బందికి తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని పేరు స్వాతి అని పోలీసులు తెలిపారు. ఆమెది కడప జిల్లా స్వస్థలం అని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ కుమార్తె మృతికి హాస్టల్ వార్డెన్ వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.
వెంకన్న బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ
చిత్తూరు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంకురార్పణ వైదిక కార్యక్రమంతో ఆరంభం కానున్నాయి. తిరుమలేశుని సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరుఫున ఆయన పర్యవేక్షించే కార్యక్రమమే ఈ అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం విష్వక్సేనుడు ఛత్రచామర మంగళవాయిద్యాలతో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించటం ఆలయ సంప్రదాయం. ఆలయంలో అంకురార్పణ వైదిక పూజలనంతరం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. ఆ తర్వాతే బ్రహ్మోత్సవాల వాహన సేవలకు నాంది పలుకుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇక్కడి కల్యాణవేదికలోని ఫల, పుష్ప ప్రదర్శన శాలలో మత్స్యావతార సైకత శిల్పం రూపుదిద్దుకుంటోంది. సుమారు ఏడు టన్నుల ఇసుకతో మైసూరుకు చెందిన సైకత శిల్ప నిపుణులు ఎంఎల్ గౌరి (25), నీలాంబిక (23)తో కలసి సైకత శిల్పాన్ని రూపొందించే ప్రక్రియ ప్రారంభించారు.


