భవిష్యత్తుపై బంగారు ఆశలు!
- 100 Views
- wadminw
- December 23, 2016
- Home Slider సంపాదకీయం
తెలంగాణ విశ్వవిద్యాలయాలను ప్రపంచ స్థాయి కలిగినవిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీలకు సమర్థులైన వారినే ఉపాధ్యక్షులుగా నియమించనున్నదని వార్తలు వస్తున్నాయి. ఇది శుభపరిణామం. అయితే మన యూనివర్శిటీలు ఇప్పుడు కేవలం వీసీల నియామకంతోనే ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయాలుగా మారి పోతాయని భావించరాదు. విశ్వ విద్యాలయాలకు కావలసింది ప్రధా నంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన ఫ్యాకల్టీ (బోధనా విభాగం)లు. వీటిని అత్యంత ప్రతిభావంతులు, ఉన్నత విద్యార్హతలు, పరిశోధనా పత్రాలు సమర్పించిన వారు, అంతర్జాతీయంగా ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా పని చేస్తున్నవారిని నియమించడం ముఖ్యం.
లెక్చరెర్లుగా కూడా నెట్ పాసై, పీహెచ్డీ చేసిన అభ్యర్ధుల శక్తి సామర్ధ్యాలను గ్రూప్ డిస్కషన్స ద్వారా మదింపుచేసి నియమించడం ముఖ్యం. వీటితోపాటే యూనివర్శిటీలకు అవసరమైన నిధులను సమకూర్చాలి. అంతర్జాతీయంగా పేరున్న మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆక్స్ఫర్డ్, క్రేంబ్రిడ్జ్ వంటి ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలతో అధ్యయన, పరిశోధనా ఒప్పందాలు చేసుకోవడం ముఖ్యం. వాటి నుంచి సహకారం తీసుకుంటూ మన విశ్వవిద్యాలయాలను వాటికి దీటుగా తయారు చేసుకోవాలి. విద్యార్థులను కూడా నేటి అవసరాలకు తగిన విధంగా తీర్చిదిద్దాలి.
అందుకోసం మారుతున్న కాలం ప్రకారం సిలబస్‌ను ఆధునికీకరించడంతోపాటు విద్యార్థుల్లో విషయ నైపుణ్యతను పెంపొందించేలా చేయాలి. ఉన్నత విద్యను గత మూడు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్త్రంలో ప్రభుత్వాలు భ్రష్ఠు పట్టించాయి. ఉన్నత విద్య 1982 నుంచి పూర్తిగా చిన్నచూపునకు గురయింది. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులు లేక అనేక విభాగాల్లో అధ్యాపకులను నియమించలేదు. ఉన్నత విద్యను నష్టదాయక రంగం (భారీ ఖర్చు తప్ప ఎలాంటి ఆదాయం లేని రంగం)గా ప్రభుత్వాలు భావిస్తూ నిధుల కేటాయింపును పూర్తిగా తగ్గించి వేశాయి.
కనీసం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కూడా లెక్చరెర్ల నియామకాలు జరపలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని జూనియర్, డిగ్రీ బకళాశాలల్లో అధ్యాపకులు లేక ప్రమాణాలు అడుగంటి విద్యార్థులు ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలను ఆశ్రయించేలా చేశారు. అలా ప్రభుత్వ కళాశాలలకు మనుగడ లేకుండా పోయింది. ఆ తరువాత ప్రైవేట్ ఇంజినీరింగ్, మెడికల్, డెంటల్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కాలేజీలు రావడానికి దారులు ఏర్పరిచారు. ఈ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థుల్లో కేవలం 15-20 శాతం మందికి తప్ప మిగతా వారికి ఉద్యోగం దొరకని విధంగా చదువులు ఉన్నాయంటే ప్రమాణాల పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కేసీఆర్ సర్కారు సరిచేసుకుంటూ ముందుకు కదలాల్సిఉంది. తెలంగాణలో 20 విశ్వ విద్యాలయాలు (ఐఐటీ,ఎన్ఐటీ, ఐఐఐటీవంటివికూడా కలిపి) ఉన్నాయి.
రాశి ఎక్కువగా ఉన్నా వీటిలో సౌకర్యాలు నాస్తి. బోధించే అధ్యాపకులు, ఆచార్యులు చాలా తక్కువగా ఉన్నారు. చదివిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అంతంతగానే ఉంటున్నాయి. అదేవిధంగా దేశంలో 621 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఏఒక్కటీ కూడా ప్రపంచంలోని 200 ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో చోటు దక్కించుకోలేందంటే మన నాణ్యతా ప్రమాణాల తీరు తెలిసిపోతోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం విద్య (ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య)లో ప్రమాణాల సాధనను ఒక సవాలుగా స్వీకరించి కార్యాచరణకు దిగాల్సి ఉంది. అయితే ఫలితాలు అంత త్వరగా వచ్చే అవకాశంలేదు. దీనికి ఎన్నో సంవత్సరాల సమయం పడుతుంది.
ఒక క్రమపద్ధతి ప్రకారం సాధించడానికి సమర్థులైన నిజాయితీపరులైన ఆచార్యులను, అధికారులను ఒక బృదంగా నియమించి, వారంతా కలిసిబ ట్టుగా సమన్వయంతో పనిచేసేలా చూడాలి. అంతే కాకుండా అత్యున్నత ప్రమాణాలు సాధించేలా లక్ష్యాల సాధనను నిర్దేశించాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది- యూనివర్శిటీలకు రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే వ్యవస్థను కల్పించడం ముఖ్యం. వీసీలు, రిజిస్ట్రార్లు సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శినో, మంత్రినో కలిసి విశ్వవిద్యాలయాలకు కావాల్సిన నిధులు, వసతుల కోసం చక్కర్లుకొట్టే వ్యవస్థను రద్దు చేయాలి. అప్పుడే విశ్వవిద్యాలయాల్లో అనుకున్న ఫలితాలు పొందడానికి వీలవుతుంది.


