భారత్‌కు పొంచివున్న ‘ఉగ్ర’ భూతం
- 95 Views
- wadminw
- September 22, 2016
- అంతర్జాతీయం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: భారతదేశంలోని ప్రధాన నగరాలు, సైనిక స్థావరాలు, భద్రతా సంస్థలపై ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోరుబా ఇందుకు కుట్రపన్నినట్లు అనుమానిస్తున్నాయి. ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు, కీలక స్థావరాలు, భద్రతా దళాలు సహా పట్టణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాక్ ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్టు ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. ఇటీవల కాలంలో అరెస్టు అరున పాక్ ఉగ్రవాదులు, చొరబాటుదారులు ఈ వివరాలు వెల్లడించారని పేర్కొన్నది. ఉధంపూర్ దాడి సమయంలో పాక్ ఉగ్రవాది మొహమ్మద్ నవేద్ యాకూబ్‌ను గత ఏడాది అరెస్టు చేసిన సమయంలో సేకరించిన వివరాలకు, తాజాగా ఊడీ సెక్టర్లో జరిగిన ఉగ్రవాది దాడిలో సేకరించిన ఆధారాలకూ పొంతన ఉన్నట్లు తెలిసింది.
అనుమానితులు ఆక్రమిత కాశ్మీరులోని ముజఫరాబాద్ లష్కరే శిబిరంలో నాలుగు మాసాల పాటు శిక్షణ తీసుకున్నట్టు పాక్‌కు అందజేయడానికి తయారు చేసిన నివేదికలో భారత్ స్పష్టం చేసింది. ఇక్కడ శిక్షణ పొందిన లష్కరే తోరుబా ఉగ్రవాదులు మొహమ్మద్ భారు, మౌవాజ్, అబూ అలీ, అహ్మద్ సహా నవేద్ భారత్‌లోకి ప్రవేశించాడు. నవేద్‌తో పాటు అతని వెంట వచ్చిన మొహమ్మద్ నోమన్ అలియాస్ మొమిన్ ఆగస్టులో ఉధంపూర్‌లో బీఎస్ఎఫ్ కాన్వాయిపై దాడికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు జవాన్లు మరణించారు. భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో మొమిన్ చనిపోయాడు. నవేద్‌ను ఇద్దరు యువకులు పట్టుకొని భద్రతాదళాలకు అప్పగించారు. నవేద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించారు. మరో పాక్ ఉగ్రవాది సజ్జద్ అహ్మద్‌ను సైన్యం ఆగస్టులో అరెస్టు చేసింది.
22 ఏళ్ల సజ్జద్ యూరి సరిహద్దుల నుంచి భారత్‌లోకి చొరబడ్డాడు. సజ్జద్ కూడా లష్కరే శిక్షణా శిబిరంలోనే శిక్షణ పొందినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దౌత్యపర ఒత్తిడిని భారత్ తీవ్రం చేసింది. విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ పాక్ హైకమిషనర్ అబ్దుల్బాసిత్ను పిలిపించి మాట్లాడారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు క్రియాశీలంగా ఉన్నాయని ఉడీ ఉగ్రదాడి స్పష్టం చేస్తోందన్నారు. ఆ దాడిలో పాక్‌లోని ఉగ్రవాదుల ప్రమేయానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాధారాలను ఆ దేశం దృష్టికి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల మృతదేహాల నుంచి స్వాధీనం చేసుకున్న జీపీఎస్ పరికరాల్లో నియంత్రణ రేఖ వెంట ఆ ముష్కరులు చొరబడిన ప్రదేశం, సమయం, ఆ తర్వాత వారు దాడి చేసిన ప్రాంతానికి చేరుకున్న మార్గం సమాచారాన్ని బాసిత్‌కు వివరించారు.
ఉగ్రవాదులు వాడిన గ్రెనేడ్లపై కూడా పాక్ గుర్తులు ఉన్నాయని చూపుతూ ఇవి ఉడీ దాడిలో పాక్ ప్రమేయాన్ని సూచిస్తున్నాయని చెప్పారు. ఈ సీమాంతర దాడులపై పాక్ ప్రభుత్వం దర్యాప్తు చేయాలని భావిస్తే ఉడీ, పూంచ్ సెక్టార్లలో హతమైన ఉగ్రవాదుల వేలిముద్రలు, డీఎన్ఏ నమూనాలను అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూభాగాన్ని వినియోగించడానికి అనుమతించబోమని పాక్ 2004 జనవరిలో ఇచ్చిన హామీని గుర్తుచేశారు. ఆ హామీని తరచుగా, అధికంగా ఉల్లంఘించటం తీవ్ర ఆందోళనకరమైన విషయమని ఆక్షేపించారు. తాను పాక్ హైకమిషనర్‌తో మాట్లాడుతున్న సమయంలోనే నియంత్రణ రేఖ వద్ద పాక్ వైపు నుంచి రెండు చోట్ల కాల్పుల ఉల్లంఘనలు కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఉగ్రవాదుల నుండి జీపీఎస్ వివరాలతో పాటు, సమాచార వివరాల పత్రాలు, పరికరాలు, ఆహారం, మందులు, దుస్తులు వంటి పాక్‌లో తయారైన వస్తువులనూ భారత్ స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆయనకు తెలిపారు. దీనిపై పాక్ ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. మరోవైపు పాక్‌పై కఠిన చర్య చేపట్టాలన్న పిలుపుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కూడా సరిహద్దు భద్రతపై కేబినెట్ కమిటీ పెద్దల్లో కొందరితో సంప్రదింపులు జరిపారు. గత ఆదివారం 18 మంది జవాన్లను బలితీసుకున్న ఉగ్రదాడికి ప్రతిస్పందనలపై బేరీజు వేశారు. బీజేపీ, దాని మాతృ సంస్థ అయిన ఆర్.ఎస్.ఎస్.
అగ్రనేతలతోనూ మోదీ ఆంతరంగికంగా భేటీ అయి చర్చించినట్లు సమాచారం. ఉడీ ఉగ్రదాడి కారకులను శిక్షించే విషయాన్ని ప్రభుత్వంతీవ్రంగా పరిగణిస్తోందని, సరిహద్దుకు ఆవలి నుండి భారత్‌లోకి ఉగ్రవాదాన్ని చొప్పిస్తోంటే సర్కారు నిద్రపోదని రక్షణమంత్రి పరీకర్ పేర్కొన్నారు. ‘బాధ్యులైన వారిని శిక్షిస్తాం’ అన్న ప్రధాని మాటలు కేవలం ప్రకటనగానే ఉండిపోతుందని భావించటం లేదన్నారు. ఎలా శిక్షించాలో నిర్ణయించాల్సింది తామని అన్నారు. ఈ ఏడాది పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడితో మొదలుపెట్టి భారత్‌పై దాడి చేయడం కోసం నియంత్రణరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంట ఉగ్రవాదుల చొరబాట్లకు నిరంతరం యత్నాలు సాగుతున్నాయని, అందులో 31 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఉడీలో ఆర్మీ బేస్ క్యాంపుపై దాడి చేసి 18 మంది సైనికుల మరణానికి కారణమైన నలుగురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారే అని దర్యాప్తులో వెల్లడైంది. వీరు ఆర్మీ బేస్‌ను ఆనుకుని ఉన్న కంచెను రెండు చోట్ల కత్తిరించి లోపలికి చొరబడినట్టు తేలింది.
వాస్తవాధీన రేఖకు ఆనుకుని ఉన్న ఈ ఆర్మీ బేస్ లేఅవుట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు స్టోర్ రూమ్, కిచెన్‌లోకి వెళ్లి దాక్కున్నారని, భద్రతాసిబ్బంది నుంచి తప్పించుకునేందుకు వాటిని తగులబెట్టడంతో మంటలు చెలరేగాయని సమాచారం. మరోవైపు, కశ్మీర్ వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వద్దనున్న ఉడీ, నౌగామ్ సెక్టార్లలో భారత జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. వాతావరణం బాగాలేనప్పటికీ మూడో రోజు గురువారం కూడా గాలింపు కొనసాగిస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. ఉడీ దాడి జరిగిన తర్వాత భారత భద్రతా బలగాలు పదిమంది ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే.
ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాల కోసం సైనికులు గాలిస్తున్నారు. నియంత్రణ రేఖకు 300 మీటర్ల దూరంలో మిలిటెంట్ల మృతదేహాలను భారత జవాన్లు గుర్తించారు. మరోపక్క.. భద్రతా దళాలు త్రాల్లో మిలిటెంట్ శిబిరాన్ని గుర్తించి అందులోని ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ మహ ర్షి, రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. మరోపక్క కశ్మీర్‌లోని ఉడి సెక్టార్‌పై టెర్రరిస్టుల దాడి సృష్టించిన వేడితో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య భారీగా మాటల యుద్ధం కొనసాగుతోంది. టెర్రరిజాన్ని నిర్మూలించి పాకిస్థాన్‌ను దారికి తీసుకొచ్చే సత్తావున్న నాయకుడిగా 2014 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పేరు తెచ్చుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇప్పుడు అసలైన అగ్ని పరీక్ష ఎదురైంది.
సరిహద్దుల గుండా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ఎలా బుద్ధి చెప్పాలన్న అంశంపై ఆయన సంబంధిత రంగాల నిపుణులను, సలహాదారులతో సమాలోచనలు సాగిస్తున్నారు. పాకిస్థాన్‌కు శాశ్వతంగా గుణపాఠం చెప్పేందుకు సమాలోచనలతో కాలయాపన చేయడం కంటే కదన రంగానికి కాలు దువ్వడమే మంచిదనే వాదన కూడా ప్రభుత్వ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ‘పాకిస్ధాన్‌తో స్నేహం కోసం నరేంద్ర మోదీ పదే పదే ప్రయత్నించి అలసిపోయారు. శాంతి కోసం ప్రయత్నించినప్పుడల్లా వారు టెర్రరిస్టు దాడులతో సమాధానం ఇచ్చారు. ఇక పాకిస్థాన్‌తో సంబంధాలు మునుపటిలా ఉండవు’ అని కేంద్ర చట్ట, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వ వర్గాల ధోరణిని సూచిస్తున్నాయి.
పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం చేసేందుకు మెజారిటీ దేశ ప్రజల మద్దతు కూడా ఉందని ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ ఇటీవల నిర్వహించిన సర్వే వెల్లడించిన విషయం తెల్సిందే. సాయుధ దళాలతోనే టెర్రరిజాన్ని అణచివేయాలని 62 శాతం మంది ప్రజలు తమ సర్వేలో అభిప్రాయపడ్డారని ఆ సెంటర్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని, ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన రిటైర్డ్ జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్ కూడా అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా న్యూయార్క్‌లో ఈ వారంలో జరుగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని ఉపయోగించుకొని ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టాలని, దౌత్యపరంగా ఒంటరిదాన్ని చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలని, ముఖ్యంగా ముందుగా పాకిస్థాన్‌తోని అన్ని వాణిజ్య, జల ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిపుణులు, సలహాదారులు ప్రధానికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు పాకిస్థాన్ పట్ల అప్పటి యూపీఏ ప్రభుత్వం మెతక వైఖరిని అవలంభిస్తోందని ఆరోపించిన నరేంద్ర మోదీ ‘మీరు బలహీనులా’ అంటూ ప్రభుత్వ నాయకత్వాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరి ఇప్పుడు బలమైన నాయకుడిగా ఆవిర్భవించిన మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇదిలావుండగా, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి అనుచిత వ్యాఖ్యలతో భారత్‌ను మరోమారు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడుతూ కశ్మీర్ అంశంపై భారత్ తేల్చి ఉంటే ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియ మరింత ముందుకెళ్లి ఉండేదన్నారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని అమరవీరుడిగా కీర్తిస్తూ కశ్మీర్ స్వాతంత్య్రం కోరుతున్న యువతను భారత ఆర్మీ చంపేస్తోందన్నారు.
దీనిపై స్వంతంత్ర విచారణ జరగాలని, లోయలో కర్ఫ్యూ ఎత్తేయాలన్నారు. కశ్మీర్లో భారత ఆర్మీ ఆకృత్యాల ఆధారాలను ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌కు అందజేస్తానన్నారు. భారత్ ముందస్తుగా నిబంధనలు పెట్టి చర్చలకు పిలుస్తోందని, అన్యాయం జరుగుతున్నప్పుడు శాంతి నెలకొనటం అసాధ్యమని అన్నారు. కశ్మీర్‌పై ముందుగా చర్చిస్తానంటే భారత్‌తో శాంతి చర్చలకు ఎప్పటికీ సిద్ధమన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశం సందర్భంగా పలు దేశాల నేతలతో భేటీ సందర్భంగా షరీఫ్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. అమెరికా, బ్రిటన్, జపాన్, టర్కీ దేశాల నేతలతో సమావేశం సదర్భంగా కశ్మీర్ అంశాన్ని షరీఫ్ లేవనెత్తారు. కాగా, అట్టుడుకుతున్న హింస, ఉగ్రవాదుల కదలికలు, కల్లోలంగా మారిన కశ్మీర్‌ను కుదుట పరచడానికి భారత సైన్యం ఆపరేషన్ ‘కామ్ డౌన్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను ఏరివేసి సాధారణ పరిస్థితులు కల్పించడానికి దక్షిణ కశ్మీర్లో 4,000 అదనపు జవాన్లను గుట్టుచప్పుడు కాకుండా రంగంలోకి దింపింది.
అయితే కనీస బలగాలను మాత్రమే ఉపయోగించాలని వారికి కచ్చితమైన ఆదేశాలున్నట్టు అధికారులు తెలిపారు. జనజీవనానికి విఘాతం కలిగిస్తున్న ఆందోళనకారులను కట్టడి చేయడానికి వీరిని నియోగించారు. పుల్వామా, షోపియన్, అనంత్‌నాగ్, కుల్గామ్ జిల్లాల్లో బలగాలు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసుల సహకారంతో సైన్యం దక్షిణ కశ్మీర్‌ను జల్లెడ పడుతోంది. అల్లర్లను మరింతగా రెచ్చగొట్టడానికి వంద మంది ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్లోకి చొరబడినట్టు సమాచారం. బక్రీద్‌నాడు లోయలో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు యువకులు మరణించారు. అలర్ల నేపథ్యంలో 200 ఏళ్ల తరువాత తొలిసారిగా జమా మసీద్ మూతపడింది. 1821 తరువాత ఇక్కడ బక్రీద్ ప్రార్థనలు జరగకపోవడం ఇదే తొలిసారి.


