భారత సైనికుల పాత్ర అభినందనీయం
కాకినాడ, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): పాకిస్థాన్ అనుసరిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడంలో అద్భుత ప్రతిభను కనబరచిన భారత సైని కుల పాత్ర అభినందనీయమని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద సరస్వతి స్వామి అన్నారు. ఆయన శుక్రవారం రమణయ్యపేటలోని శ్రీపీఠంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత సైనికుల సంక్షేమం కోసం దసరా ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తామన్నారు. నాలుగు నెలలపాటు తాను అమెరికాలో పర్యటించినట్టు ఆయన తెలిపారు. అమెరికన్లు భారత్‌లో పండుతున్న పసుపుతో చేసిన మాత్రలు వాడి వారి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నారన్నారు. అయితే మన దేశంలో అమెరికా ప్రవేశపెడుతున్న బర్గర్లు, పిజ్జాలు వంటివి తిని, వారి మందులను వాడి ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారన్నారు. శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కోటికుంకుమార్చన నిర్వహిస్తున్నామన్నారు. శ్రీపీఠం ఆధ్వర్యంలో ఏడు ఎకరాల్లో ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేసి దేశవాళీ ఆవులను పెంచుతామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి రైతుకు ఒక ఆవు, దూడను అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. దేశంలో 32 రకాల జాతులకు చెందిన ఆవులు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 13కి పడిపోయిందన్నారు. ఆవు జాతులను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రతి సినిమా ఒక డ్రీమ్ రోలే: ‘మజ్ను’ హీరో నాని
కాకినాడ, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): తన ప్రతి సినిమా ఒక డ్రీమ్ రోలేనని, పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం వల్లే విజయాలు సొంత చేసుకుంటున్నానని సినీ హీరో నాని అన్నారు. ఆయన నటించిన ‘మజ్ను’ సినిమా విజయయాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలోని ఆనంద్ రీజెన్సీలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ దిల్ రాజు నిర్మిస్తున్న ‘నేను లోకల్’ అనే సినిమాలో నటిస్తున్నానన్నారు. తన సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ మాట్లాడుతూ విజయాల హీరో నానితో తాను నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. చిత్ర దర్శకులు విరించి వర్మ మాట్లాడుతూ తన తొలిచిత్రం ఉయ్యాల జంపాల సమయంలో రాజమహేంద్రవరంతో అనుబంధం ఏర్పడిందన్నారు. అనంతరం చిత్ర యూనిట్ మజ్ను సినిమా ప్రదర్శింపబడుతున్న అనుశ్రీ, నాగదేవి థియేటర్లకు వెళ్లి సందడి చేసింది. కార్యక్రమంలో అనుశ్రీ థియేటర్ మేనేజర్ విష్ణు, సుంకర బుజ్జి పాల్గొన్నారు.
సమన్వయంతో సంక్షేమ పథకాల సద్వినియోగం
శతశాతం లబ్దిదారులకు మేలు: అధికారులకు కలెక్టర్ హితవు
కాకినాడ, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల సమన్వయంతో అమలౌతున్న అభివృద్ది, సంక్షేమ పథకాల క్రింద కేటాయింపులను సకాలంలో నూరు శాతం సద్వినియోగం చేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టుహాలో జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి శనివారం రాజమండ్రిలో జరుగనున్న జిల్లా అభివృద్ది మరియు సమన్వయ కమిటీ (దిశ) సమావేశంలో సమీక్షించనున్న అంశాల పై ఆయా శాఖల సిద్దం చేసిన సమాచారాన్ని పరిశీలించి సూచనలు జారీచేశారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిధులు కల్పిస్తున్న వివిధ అభివృద్ది, సంక్షేమ పధకాలు, వాటి క్రింద ఈ యేడాది జిల్లాకు జరిగిన కేటాయింపులు, ఇప్పటి వరకూ సాధించిన ఆర్థిక, భౌతిక లక్ష్యాలను ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో సామాజిక భద్రత, గృహనిర్మాణం – హౌసింగ్ ఫర్ ఆల్, స్వచ్ఛభారత్, జాతీయ ఆరోగ్య మిషన్, ప్రధాన మంత్రి కృషి సింఛాయి పధకం, దీనదయాల్ గ్రామీణ విద్యుదీకరణ, సర్వ శిక్షాభియాన్, మద్యాహ్న భోజన పధకం, డిజిటల్ ఇం డియా లాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్, గ్రామీణ స్థాయికి ఇంటర్నెట్ సేవల విస్తరణ, ఉజ్వల్ యోజన, అమృత్, ఉదయ్ తదితర కేంద్ర గ్రాంట్ కార్యక్రమాల అమలు పురోగతిని ఆయన పరిశీలించారు. ఆయా కార్యక్రమాల క్రింద చేపట్టిన పనుల ఛాయాచిత్రాలతో కమిటీకి వివరించేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్దం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతి పధకం క్రింద లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లేదా హార్డ్ కాపీ ద్వారా కమిటీకి సమర్పించాలన్నారు. కొన్ని పధకాల క్రింద పుష్కలంగా నిధులు కేటాయించినా, అధికారులు సంశయాత్మక ధోరణితో వినియోగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద తల్లి-బిడ్డ ఆరోగ్య రక్షణ కొరకు కోట్లలో నిధుల కేటాయింపు జారీ అయినా ఇప్పటి వరకూ నిధుల వినియోగం లక్షలలోనే ఉందన్నారు. నిధులను దుర్వినియోగం చేయడం ఎంత నేరమో, నిధులను లక్ష్యిత ప్రజల సంక్షేమ, ప్రయోజనాల కోసం ఖర్చు చేయకుండా మురగ బెట్టడం కూడా అంతే నేరమని అధికారులు గుర్తించాలన్నారు. ఆయా పధకాల క్రింద నిధుల వినియోగం పై స్పష్టమైన మార్గదర్శకాలను క్షేత్ర అధికారులకు వివరించి, నిధులు సకాలంలో సమగ్రంగా సద్వినియోగమైయ్యేట్లు పర్యవేక్షించాలని శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రతి నెల లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేసే ప్రక్రియలో వేలిముద్రల సమస్యలు, సాంకేతిక సమస్యలు తదితర అనివార్య కారణాల వల్ల దాదాపు 10శాతం పింఛన్లు పంపిణీ అధికారుల అథన్టికేషన్తో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ విధానంలో పింఛన్ల పంపిణీ చేయడంలో అవకతవకలు జరిగేందుకు ఆస్కారం ఉన్న దృష్ట్యా అధికారుల అథన్టికేషన్తో జరుగుతున్న పింఛన్ చెల్లింపులపై డ్వాక్రా, మెప్మా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పరిశీలన నిర్వహించేందుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిశీలనలో చనిపోయిన పింఛన్‌దారులు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన పింఛన్‌దారులకు సంబంధించిన పింఛన్లు అథన్టికేషన్ ప్రక్రియలో డ్రా చేసినట్లు గుర్తిస్తే సంబంధిత పంపిణీ అధికారులపై క్రమశిక్షణా చర్యలు గైకొనడంతో బాటు, సొమ్ము రికవరి చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి ఎస్.మల్లిబాబు, డ్వామా పిడి ఎ.నాగేశ్వరరావు, కాకినాడ మున్సిపల్ కమీషనర్ అలీమ్ భాషా, డిఎంహెచ్ఓ కె.చంద్రయ్య, వ్యవసాయ శాఖ జేడి కెఎస్‌వి ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేశ్వరరావు, పిఆర్ ఎస్ఈ వెంకటేశ్వరావు, హౌసింగ్ పిడి సెల్వరాజ్, డిసిఓ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.


