భారీ వర్షాలతో పులిచింతలకు వరద ఉధృతి
- 75 Views
- wadminw
- September 22, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పులిచింతలకు వరద పోటెత్తుతోంది. ఎడతెరిపిలేని వర్షాలవల్ల పులిచింతల ప్రాజెక్టుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరదవచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు వరదవల్ల ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇబ్బంది తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ, తెలంగాణ ఇరిగేషన్‌శాఖ మంత్రి టి.హరీష్‌రావుకు గురువారం ఫోన్‌చేశారు. నల్గొండ జిల్లాలో ముంపు గ్రామాల ప్రజలకు పిలిచింతల వరదవల్ల ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని, ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన హరీష్‌రావుకు సూచించారు. వరదముంపువల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో తలెత్తే పరిస్థితులను సంయుక్తంగా ఎదుర్కొందామని చెప్పారు.
సమన్వయంతో నీటిని కాపాడుకుందామని, ఎవరికీ ఇబ్బంది లేకుండా పర్యవేక్షిద్దామని చెప్పారు. నల్గొండ జిల్లాకు వరదవచ్చే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలవల్ల పులిచింతల నుంచి పెద్దఎత్తున వరదనీరు వచ్చిచేరుతోంది. ఇన్‌ఫ్లో 2.50 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 50వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 27.6 టిఎంసిలుగా ఉంది. నల్గొండ జిల్లాలో నెమలిపురి, రేగుళ్ళ గ్రామాలను పులిచింతల బ్యాక్‌వాటర్ ముట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.2తో ఉచిత కాలింగ్: బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): కనెక్షన్ తీసుకుంటే చాలు. అద్దె లేకుండా ఉచితంగా మాట్లాడుకునేలా బిఎస్ఎన్ఎల్ ఆఫర్‌ను సిద్ధంచేసింది. ఇప్పటికే రిలయన్స్ జియోకు షాకిస్తూ రూ.249కి అపరిమిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రకటించిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు దిమ్మతిరిగే ఆఫర్ తేనున్నట్లు సమాచారం. ప్రీపెయిడ్ కస్టమర్లు వాడుకునేలా 2జీ, 3జీ కస్టమర్లకు వాయిస్ కాల్స్ పూర్తి ఉచితంగా ఇవ్వాలని, దీనికి అద్దె అత్యంత నామమాత్రంగా రూ.2 నుంచి 4 మాత్రమే ఉంటుందని బిఎస్ఎన్ఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా 2జీ, 3జీ వినియోగదారులు ఉచిత కాల్స్‌ను ఏ నెట్‌వర్క్‌కైనా చేసుకోవచ్చని సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తొలిదశలో సంస్థ నెట్వర్క్ మెరుగ్గా ఉండే హిమచాల్‌ప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఒడిషా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ఆఫర్‌ను తీసుకువస్తామని, ఆపై దేశవ్యాప్తంగా అమలు చేస్తామని వివరించారు. జియో ఆఫర్లు 4జీ సపోర్టు చేసే ఫోన్లపైనే పనిచేస్తాయి. బిఎస్ఎన్ఎల్ తన తాజా ఆఫర్‌ను అమలుచేస్తే ఇండియాలోని ఏ మొబైల్ ఫోన్ నుంచైనా బిఎస్ఎన్ఎల్ సిమ్‌తో ఫ్రీకాల్స్ చేసుకోవచ్చు. అతి తక్కువ ఛార్జ్ ఆఫర్, మరో ఇంటర్నెట్ ప్యాక్‌తో బండిల్డ్ రూపంలో రావచ్చని టెలికం నిపుణులు అంచనా వేస్తున్నారు.


