భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి జలకళ
విజయవాడ ప్రకాశం బ్యారేజి జలకళ సంతరించుకొంది. బ్యారేజీలోకి పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరింది. బ్యారేజీలో 12 అడుగుల మేర నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8గేట్లును తెరచి 5800 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. మరికొంత నీటిని డెల్టా కాలువలకు సాగు, తాగు నీరు కోసం విడుదల చేస్తున్నారు. కాలువలకు 10,338 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 7,275 క్యూసెక్కుల నీరు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. మరోవైపు, భారీ వర్షాలకు రైతాంగం విలవిల్లాడిపోతున్నారు.
పల్నాడులో వాగులన్నీ పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాల్లో నీళ్లు పారుతున్నాయి. కొన్ని మండలాల్లో సాగైన మినుము గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా చేతికందకుండా పోయే పరిస్థితి నెలకొంది. అనేక గ్రామాల్లో మినుము పంట ఉరకెత్తిపోయింది. అంతకుముందు రెండు నెలల పాటు కాచిన భారీ ఎండలకు మినుము, నూగు పంటలు మాడిపోగా చివరిలో మిగిలిన మినుము కూడా చేతికి రాకుండా పోయింది. తాజాగా ఉదయం నుంచి పల్నాడులోని అన్ని మండలాల్లో భారీగా వర్షం పడింది. మాచవరం మండలంలో ఉదయం ఆరు గంటల నుంచి 11.30 గంటల వరకు 50.2 మి.మీ. వర్షం పడింది. దాచేపల్లి మండలంలో కూడా వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో ఉదయం కురిసిన వర్షానికి కంది, మినుము పంటలు పూర్తిగా నీటమునిగాయి. పొలాల్లో పంటలు కనపడనంతగా ఓగేరు పొంగిపొర్లింది. కుప్పగంజివాగుకు కూడా వరద వచ్చింది. ఈపూరు మండలంలో కూడా ఉదయం భారీ వర్షమే పడింది. అంతకుముందు ఎండలకు అంతర పంటలన్నీ దెబ్బతినిపోగా తాజాగా సాగులో ఉన్న కందిచేలన్నీ ఉరకేసిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక గ్రామాల వద్ద వాగులు భారీగా పొంగినట్లు సమాచారం అందింది. బొల్లాపల్లి మండలం వడ్డెంకుంట, మూగచింతలపాలెం చెరువులు నిండాయి. దొండపాడు చెరువు కూడా సగం నిండినట్లు సమాచారం .
నకరికల్లు మండలంలో కూడా 91.4మి.మీ. వర్షపాతం నమోదైంది. నరసరావుపేట మండలంలో 34 మి.మీ. వర్షపాతం నమోదు కాగా రొంపిచర్లలో 22 మి.మీ. వర్షం కురిసింది. మాచర్లలో 72.6 మి.మీ. పిడుగురాళ్లలో 54.2 మి.మీ, గురుజాల 57 మి.మీలు మేర వర్షాలు పడ్డాయి. బుధవారం ఉదయం వినుకొండ నియోజకవర్గంలో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. కాగా, కరవు ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులందరూ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడులో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంటలన్నింటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. పంటలు ఉరకేసి పోకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా వ్యవసాయాధికారులు రైతులకు చెబితేనే ఉన్న పంటలు దక్కుతాయని రైతులు చెబుతున్నారు.


