మంత్రి కుమారుడు కిడ్నాప్ కథ సుఖాంతం
- 115 Views
- wadminw
- September 9, 2016
- అంతర్జాతీయం
కరాచీ, సెప్టెంబర్ 9: కిడ్నాప్‌నకు గురైన మంత్రి తనయుడు ఎట్టకేలకు మిలిటెంట్ల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. గత మే 20న పాకిస్తాన్‌లోని సమస్యాత్మక ప్రాంతం బలోచిస్తాన్‌కు చెందిన మంత్రి సర్దార్ ముస్తఫా తారీన్ కుమారుడు అసద్ తారీన్ను కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంతలో కొందరు సాయుధులు పిషిన్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో అసద్‌ను అడ్డగించి అపహరించారు. అసద్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో డోలాంగి ఏరియాలో అసద్ తారీన్ను తాము రక్షించామని పిషిన్ డిప్యూటీ కమిషనర్ అబ్దుల్ వాహిద్ కాకర్ శుక్రవారం తెలిపారు. పాక్-ఆఫ్గన్ సరిహద్దుల్లో దొరికిన అసద్‌ను పటిష్ట భద్రత మధ్య అక్కడి నుంచి క్వెట్టాకు తరలించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలను ఆయన బహిర్గతం చేసేందుకు నిరాకరించారు.
రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అసద్‌ను రక్షించారా లేక కిడ్నాపర్లు డిమాండ్ చేసిన మొత్తాన్ని వారికి ఇచ్చివేసి కాపాడారా అన్న విషయంపై ఇప్పటివరకూ స్పష్టతలేదు. గతంలోనూ సల్మాన్ తసీర్ అనే వ్యక్తి కిడ్నాప్‌నకు గురైన ఐదేళ్ల తర్వాత ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ విషయం తెలిసిందే. కాగా, అణుపరీక్షలను ధృవీకరిస్తూ ఉత్తర కొరియా ప్రకటన చేసింది. ఉత్తర కొరియా తన ఐదో అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఉత్తర కొరియా న్యూక్లియర్ టెస్ట్ సైట్లో 5.3 తీవ్రతతో సంభవించిన భూకంపాన్ని అణుపరీక్షలుగా ప్రపంచదేశాలు అనుమానించిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ ప్రకటనను చేసింది.
ఉత్తర కొరియా నిర్వహించిన అనుపరీక్షలలో ఇదే అత్యంత శక్తివంతమైనదని దక్షిణ కొరియా వెల్లడించింది. కొత్తగా అభివృద్ధి చేసిన వార్‌హెడ్‌తో దేశ ఉత్తర ప్రాంతంలోని న్యూక్లియర్ టెస్ట్ సైట్ నుంచి శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. విజయవంతంగా పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపింది. కాగా ఉత్తర కొరియా చర్యపై ప్రపంచ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర కొరియా స్వీయ విధ్వంసానికి పాల్పడుతోందని దక్షిణ కొరియా విమర్శించింది.
శ్రీలంకలో భారతీయుడి అరెస్టు
కొలంబో, సెప్టెంబర్ 9: భారత్‌కు చెందిన ఓ వ్యక్తిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. సుమారు కోటి రూపాయల ఖరీదు చేసే 1.4 కేజీల హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తుండగా కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారు జామున ఇండియాలోని చెన్నై నుంచి కొలంబో విమానాశ్రయానికి చేరిన నిందితుడ్ని హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్నాడన్న అనుమానంతో నార్కోటిక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. హెరాయిన్‌తో పాటు అడ్డంగా బుక్కవ్వడంతో అతడికి ఏడు రోజులపాటు నిర్బంధం విధించి, తదుపరి దర్యాప్తు చేపడుతున్నట్లు శ్రీలంక పోలీసులు వెల్లడించారు. ఇదిలావుండగా, ఫ్రాన్స్‌లో మరో ఉగ్రదాడికి ఇస్లామిక్ స్టేట్ కుట్ర పన్నిందా? అవుననే అంటున్నాయి అక్కడి నిఘా వర్గాలు. అయితే, ఈ సారి దాడిని మహిళలతో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు నిన్న రాత్రి ముగ్గురు ఉగ్రవాద అనుమానిత మహిళలను పారిస్‌లో అదుపులోకి తీసుకోవడంతో ఉగ్రకుట్ర బయటపడింది. ఆరు గ్యాస్ సిలిండర్లతో అనుమానాస్పదంగా పార్కింగ్‌లో ఉన్న కారును ఆదివారం పారిస్‌లో గుర్తిచారు. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు మహిళలు 39, 23, 19 సంవత్సరాల వయస్సు గల వారిగా గుర్తించారు. అరెస్ట్ సమయంలో వారు తీవ్రంగా ప్రతిఘటించి పోలీసులపై దాడికి దిగారు. పోలీసులు కాల్పుల్లో ముగ్గురిలో ఓ మహిళ గాయపడింది. ఎట్టకేలకు వీరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్న పోలీసులు ఒకరికి ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్నట్లు ప్రాధమికంగా నిర్థారించారు. అరెస్ట్‌కు ముందు వీరిని గమనించిన ఓ స్థానికుడు మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు మహిళలు చాలా ఉద్వేగంగా కనిపించారని, అనుమానాస్పదంగా సంచరించారని వెల్లడించాడు. విదేశీ టూరిస్టులతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాన్ని వీరు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరు కొత్త తరహాలో దాడి చేయడానికి ప్రణాళికలు వేసినట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి బెర్నార్డ్ కెజ్న్యూవ్ తెలిపారు.
ఫేమస్ కావాలని పేరెంట్స్‌నే హతమార్చారు!
వాషింగ్టన్, సెప్టెంబర్ 9: అర్జంటుగా ఫేమస్ అయిపోవాలన్న ఓ విపరీత ధోరణి ఇద్దరు టీనేజీ కుర్రాళ్లను కిల్లర్స్‌గా మార్చింది. ఫేమస్ అయిపోవడానికి కిల్లర్స్ అవడమే కరెక్ట్ అనుకుని తల్లిదండ్రులతో పాటు ఇద్దరు తోడబుట్టిన వాళ్లను కిరాతకంగా మార్చేశారు ఓ దుర్మార్గ సోదరులు. అమెరికాలోని ఓక్లోహామాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓక్లోహామాలోని టల్సా అనే పట్టణంలో నివసించే డేవిడ్ బేవర్, ఏప్రిల్ బేవర్ అనే దంపతులకు ఐదుగురు సంతానం. ఇందులో రాబర్ట్ బేవర్ (19), మైఖెల్ బేవర్ (17) ఐదుగురు సంతానంలో పెద్దవాళ్లు. ఏ ప్రభావం వాళ్లపై బలంగా పడిందో తెలియదు గానీ అర్జంటుగా ఫేమస్ కిల్లర్స్ అయిపోవాలనే దురాశ ఇద్దరిలో మొదలైంది. తమ కిల్లింగ్ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇంట్లో వాళ్లనే టార్గెట్ చేసుకున్నారు ఇద్దరు. ఇంట్లో రాత్రి పూట అందరు నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా గొడ్డళ్లు, బ్లేడ్లతో రాబర్ట్, మైఖేల్ వారిపై విరుచుకుపడ్డారు. తల్లిదండ్రులతో సహా ఇద్దరు సోదరుల్ని, ఓ సోదరిని కిరాతకంగా హత్య చేశారు. ఇదే ఘటనలో గాయపడ్డ ఓ 13ఏళ్ల బాలికతో పాటు, రెండేళ్ల పాప ప్రాణాలతో బయటపడినట్లుగా సమాచారం. గతేడాది విచారణకు వచ్చిన ఈ కేసులో రాబర్ట్, మైఖెల్ ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించడంతో స్థానిక కోర్టు వీరిద్దరికి యావజ్జీవ శిక్షను విధించింది. ఇందులో రాబర్ట్ ఇప్పటికే శిక్షను అనుభవిస్తుండగా మైఖెల్ వచ్చే ఏడాది నుంచి జైలు జీవితం గడపనున్నాడని తాజా విచారణలో కోర్టు తీర్పును వెలువరించింది. వీరిద్దరికీ పెరోల్ కూడా లభించే అవకాశం లేదు.


