మంత్రి సునీత ఫ్లెక్సీలను తొలగించిన ‘తమ్ముళ్లు’
- 82 Views
- wadminw
- October 26, 2016
- రాష్ట్రీయం
అనంతపురం, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర సతీమణి పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. సునీత, సూరి ఇద్దరూ అధికార టీడీపీకి చెందినవారే అయినా వారి అనుచరుల మధ్య ఫ్లెక్సీల వివాదం ఏర్పడింది. మంత్రి సునీత అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పక్కనే ఉన్న ధర్మవరం నియోజకవర్గం నుంచి సూరి ఎన్నికయ్యారు. సునీత అనుచరులు ధర్మవరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా స్థానిక ఎమ్మెల్యే సూరి అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ఏర్పడింది. సూరి అనుచరులు సునీత వర్గీయుల ఫ్లెక్సీలను తొలగించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు ఈ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. సూరి వర్గీయులను అరెస్ట్ చేయాలని పరిటాల సునీత అనుచరులు ఆందోళనకు దిగారు. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధర్మవరంలో పర్యటించిన సందర్భంగా బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తూ ధర్మవరంలో ఎమ్మెల్యే అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలలో ఎక్కడా మంత్రి సునీత ఫొటో కన్పించలేదు. జిల్లాకు చెందిన మరో మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి ఫొటో మాత్రమే కన్పించింది. ధర్మవరం బ్రాంచ్ కెనాల్ అంశంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, అనంతపురం జిల్లా ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ వర్గీయుల మధ్య చెలరేగిన గొడవతో అక్కడ 144 సెక్షన్ విధించారు. ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ, మంత్రి పరిటాల సునీత వర్గాలకు చెందిన కార్యకర్తలకు ఫ్లెక్సీ విషయమై చోటుచేసుకున్న వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు ఇన్‌ఛార్జి తహసీల్దారు నారాయణమూర్తి నవంబర్ 3 వరకు ధర్మవరంలో 144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు.
అనంతలో జనసేన ‘సీమాంధ్ర హక్కుల చైతన్య’ సభ
విప్లవకారుల్ని స్మరించుకోవడమే భాగ్యమని పేర్కొన్న పవన్
అనంతపురం, హైదరాబాద్, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): నవంబర్ 10న అనంతపురంలో తలపెట్టిన జనసేన బహిరంగ సభకు ‘సీమాంధ్ర హక్కుల చైతన్య’ సభగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామకరణం చేశారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ సభ జరుగుతుందని ఆ పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కార్యకర్తలు, నేతలు చురుగ్గా చేపడుతున్నట్లు తెలిపారు. సభా ప్రాంగణానికి విప్లవ నేత తరిమెల నాగిరెడ్డి, సభా వేదికకు స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు పేర్లను పవన్ ఖరారు చేశారని ఆ ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో పుట్టి రాష్ట్రానికి, ఈ దేశానికి అపార సేవలందించిన మహనీయులు నాగిరెడ్డి, సుబ్బారావులను ఈ సందర్భంగా స్మరించుకోవడం జనసేనకు కలిగిన భాగ్యంగా పవన్ వాఖ్యానించారని రాఘవయ్య తన ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు, జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ పార్టీ పరంగా తన అభిమానులకు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు. మరో రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తాయని గతంలోనే ప్రకటించారు పవన్. అందుకోసం ఒక్కో మెట్టు సిద్ధం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కొన్ని నెలల కిందట వరకూ, ముఖ్యంగా ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉన్న పవన్ ప్రస్తుతం అంతగా స్పందించడం లేదు. కొన్ని రోజుల కిందట ఏపీకి ప్రత్యేక హోదా అంటూ రెండుసార్లు బహిరంగసభలు నిర్వహించారు. వీటితో పాటు ప్రస్తుతం మరిన్ని సోషల్ మీడియా వెబ్సైట్లలో ప్రచారం మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ కోసం అధినేత పవన్ యూట్యూబ్ ఛానల్, అధికారిక ఫేస్బుక్ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటున్న పవన్ కాటమరాయుడు షూటింగ్ ప్రారంభించడం, మరోవైపు జనసేన మనసేన అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన విషయాలను ఇందులో కచ్చితంగా పోస్ట్ చేస్తామని జనసేన పార్టీ నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనసేన మనసేన పేరుతో యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన టీజర్‌కు మంచి స్పందన రావడం గమనార్హం.
పోలీస్ యూనిఫాంలో వచ్చి కిడ్నాప్
అనంతపురం, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): అనంతపురం జిల్లా కదిరి మండల కేంద్రంలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేగింది. స్థానిక ఇందిరా కాలనీలో నివాసముంటున్న ప్రేమనాథ్ రెడ్డి అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున కిడ్నాప్‌కు గురయ్యాడు. రెండు బైక్‌లపై పోలీసు డ్రెస్‌లో వచ్చిన నలుగురు వ్యక్తులు ప్రేమనాథ్రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు ప్రేమనాథ్‌రెడ్డి భార్య లక్ష్మి తెలిపింది. వైఎస్సార్ జిల్లాకు చెందిన రాణా ప్రతాప్ రెడ్డే కిడ్నాప్ చేయించి ఉంటాడని ప్రేమ్‌నాథ్‌రెడ్డి తండ్రి, భార్య ఆరోపిస్తున్నారు. రాణా ప్రతాప్‌రెడ్డి, ప్రేమనాథ్‌రెడ్డి గతంలో మిత్రులు. రాణా ప్రతాప్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రేమ్‌నాథ్ రెడ్డి అతనికి రూ.3.5 లక్షలు అప్పు ఇచ్చాడు. అయితే అతను తిరిగి చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుండటంతో నోటీసులు ఇచ్చాడు. నాకే నోటీసులు ఇస్తావా? నిన్ను, నీ భార్యను చంపేస్తానంటూ ఇటీవల ప్రేమనాథ్రెడ్డిని రాణా ప్రతాప్ రెడ్డి బెదిరించాడని భార్య లక్ష్మి తెలిపింది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్, తెదేపా నేత ప్రతాప్‌రెడ్డి కుమారుడు ప్రేమ్‌నాథ్‌రెడ్డి బుధవారం ఉదయం కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఉదయాన్నే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై ప్రేమ్‌నాథ్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ప్రేమ్‌నాథ్‌రెడ్డి ఉన్నారా? అని ఇంటి ముందు ముగ్గువేస్తున్న అతని భార్యను అడిగారు. వాకింగ్‌కు వెళ్తున్నారని చెప్పి కొద్ది దూరంలో ఉన్న తన భర్తను చూపించింది. ముందుకు వెళ్లిన వారు మరో ఇద్దరితో కలిసి బలవంతంగా ద్విచక్ర వాహనాలపై ప్రేమ్నాథ్రెడ్డిని తీసుకెళ్లినట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ్‌నాథ్‌రెడ్డి, ఆయన స్నేహితుడు రాణా ప్రతాప్‌రెడ్డికి మధ్య వున్న ఆర్థిక లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


