మద్యం ‘మత్తు’ సన్నాసులు!
- 84 Views
- wadminw
- October 5, 2016
- రాష్ట్రీయం
కావాలని ఎవరూ రోడ్డు ప్రమాదానికి గురి కావడమో లేక కారణం అవడమో చేయరు. దాన్నే ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనగా కూడా భావిస్తారు. కానీ, కేవలం మద్యం మత్తులో చేసిన పొరపాటు కారణంగా జరుగుతున్న ప్రమాదాల మాట ఏమిటి? ఆయా దుర్ఘటనల్లో మృత్యువాత పడుతున్న వారి గురించి ఎలా ఊహించుకోవాలి? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుతప్పే. కానీ, ఇక్కడ తప్పు కేవలం ప్రమాదరహితంగా మాత్రం జరగడం లేదు. రహదారులు రక్తమోడుతున్నాయి. నిండు ప్రాణాలను క్షణాల్లో గాల్లో కలుస్తాయి.
అల్లారుముద్దుగా పెరిగే చిన్నారులు కళ్ల ముందే కళ్లు మూస్తున్నారు. దీనికి కారణం రోడ్లపై తిరుగుతున్న మానవ రూపంలో ఉన్న తాగుబోతు రాక్షసులు. తాగుబోతుల గ్యాంగ్‌లను అరికట్టే విధానమే లేదా? రోడ్లపై నరకం చూపిస్తున్న ఈడియట్స్ ఆగడాలను అదుపు చేసేదెవరు? నిన్న చిన్నారి రమ్య ప్రాణాలు బలికాగా, నేడు మరో చిన్నారి సంజన చావుబతులకులతో కొట్టుమిట్టాడుతోంది. వారి కుటుంబ సభ్యులను కూడా బలి తీసుకుంటున్నారు తాగుబోతుల గ్యాంగులు. రోడ్లపై ఈడియట్స్కు కొదువే లేదు.
హైదరాబాద్‌లో మరో రమ్య ఉదంతం జరిగింది. పంజాగుట్టలో కొన్ని రోజులక్రితం తాగుబోతులు చిన్నారి రమ్య జీవితాన్ని ఛిద్రం చేసిన ఘటన మరువకముందే మరో తాగుబోతు బ్యాచ్ దారుణానికి ఒడి కట్టారు. హైదరాబాద్ నగర్ శివారులోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. తప్ప రాగి రాష్ డ్రైవింగ్ చేసిన ఓ తాగుబోతు బ్యాచ్ ఓ తల్లి కూతుళ్లను ప్రమాదానికి గురిచేశారు. కారులో ప్రయాణిస్తున్న వారు తల్లి కూతుళ్లను ఢీ కొట్టారు. దీనితో ప్రమాదంలో నాలుగేళ్ళ చిన్నారి కోమాలోకి వెళ్ళింది.
చిన్నారికి ప్రక్కటెముకలు విరిగాయని, బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు సంజన తల్లి కూడా చావుబ్రతుకుల మధ్య ఉంది. తల్లి కూతుళ్ళను ప్రమాదానికి గురి చేసిన యువకులు కారును ఘటనాస్థలం లోనే వదిలేసి పారిపోయారు. ఆ కారులో మద్యం సీసాలు దొరికినట్లు పోలీస్‌లు వెల్లడించారు. ఇక మూడు నెలల క్రితం పంజాగుట్టలో చిన్నారి రమ్యను చిదిమేశారు టీనేజీ తాగుబోతులు. ఆ తాగుబోతులకు ఇప్పుడు బెయిల్ వచ్చింది. మన వ్యవస్థ ఎలా ఉందో మరోసారి ఈ ఘటన నిరూపించింది.
చిన్నారి రమ్య మృతి కేసులో నిందితులకు బెయిల్ రావడంపై రమ్య తల్లిద్రండులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రమ్య చనిపోయి 90రోజులు దాటినా ఎలాంటి చర్యలు లేవని ఆవేదన చెందారు. ఈ కేసులో నిందితులకు బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చిన్నారి రమ్య ఘటనే మళ్లీ పునరావృతం అవడంపై స్పందించిన రమ్య తల్లిదండ్రులు ఇంకెంతమంది రమ్య, సంజనలు బలికావాలని నిలదీశారు. రమ్య పేరుతో డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టం తేవాలన్న రమ్య తల్లిదండ్రులు ఈ కేసులో ఆరుగురు దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
మరోవైపు హయత్‌నగర్‌లో తాజాగా జరిగిన చిన్నారి సంజన యాక్సిడెంట్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్, యాదిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి సంజన పరిస్థితి విషమంగా ఉంది. సంజనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చిన్నారి సంజన ఘటనకు దారితీసిన కారణాలు నిజంగా శోచనీయం. నిజానికి ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలే పంచ ప్రాణాలు. వాళ్లు ఏది అడిగినా కాదనలేకపోవడం తప్పుకాదు.
కానీ అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఆలోచించకుండా అన్నీ సమకూర్చడం అది స్టేటస్ సింబల్‌గా భావించడం మాత్రం క్షమార్హం కాదు. చదువుకునే పిల్లలకు కాలేజీకి వెళ్లడానికి, రావడానికి లేదా స్నేహితులతో బయటికి వెళ్లడానికి టూ వీలర్ చాలు. అంతకు మించి ఇవ్వగల స్థోమత ఉన్నా అది ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో చెప్పడానికి చిన్నారి రమ్య ఉదంతమే నిదర్శనం ఎలాంటి ప్రమేయం లేకుండా తన బాబాయి, తాత, పట్టుమని పదేళ్లు నిండని రమ్య ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు? యువకులన్నాక పార్టీలు, పబ్‌లు సహజమని వాదించే తల్లిదండ్రులు లేకపోలేదు. తాగమనండి, చిందేయమనండి అలా తాగినప్పుడు ఇంట్లోనే ఉండమని చెప్పండి.
రోడ్లమీదికి కారుల్లోనూ బైకుల మీదా వచ్చి పరుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని చెప్పండి. మన వినోదం, సంతోషం వేరొకరికి శాపం కావడాన్ని సమర్థిస్తారా? రమ్య కుటుంబం స్థానంలో ఉండి ఆలోచిస్తేనే వాళ్లు పడిన వేదన, అనుభవిస్తున్న క్షోభ అర్థమవుతాయి. యువత కూడా తాత్కాలిక సంతోషం, ఆనందం కోసం దురలవాట్లకు బానిసలు కావడం, అవి ఇతరుల ప్రాణాలను బలి తీసుకునేలా ప్రవర్తించడం ఎంత వరకు సబబో ఆలోచించాలి. సిగ్నల్ పడినా ఆపకుండా వెళ్లడం, రయ్యిమని దూసుకుపోవడం మీకు థ్రిల్ కలిగిస్తుందేమో కానీ మీకేదైనా జరిగితే మీ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చినవారవుతారు.
చాలామంది యువకులు రోడ్డుపై ద్విచక్రవాహనాలు నడుపుతుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తూ ఉంటుంది. వాళ్లు చిన్న గ్యాప్ ఉన్నా చాలన్నట్లు దూసుకువెళ్తుంటే ఎక్కడ స్కిడ్ అయి పడతారో అనిపిస్తుంది. వేగంగా వెళ్లడం, ఫీట్లు చేయడం యువకులు థ్రిల్ కలిగించే అంశమే. కాదనడం లేదు. కానీ దానివల్ల రోడ్డు మీద వెళ్లే ఇతరులకు ప్రాణాపాయం కలుగుతుందనే ఆలోచన లేకపోవడం నిజంగా దారుణం. మగపిల్లలకు బైక్ లేదా కారు ఇస్తుంటే వాళ్లు ఎలా నడుపుతున్నారో పక్కనే ఉండి గమనించండి. మీరు లేనప్పుడు వాళ్ల తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడమూ పెద్ద కష్టం కాదు. అతి వేగం అన్ని వేళలా అనర్థదాయకమనే విషయాన్ని వివరించండి.
అది రోడ్డు మీద వెళ్లే ఇతరులకే కాదు మీ పిల్లలకూ ప్రమాదకరమే అనేది విస్మరించకండి. మరోవైపు ప్రభుత్వమూ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. వీకెండ్లోనే కాదు, రాత్రుల్లోనే కాదు ప్రతి రోజు, ప్రతి పూట, డ్రంకన్ డ్రౌవ్ నిర్వహించాలి. మద్యం దుకాణాల్లో 21 సంవత్సరాల లోపు వారికి మద్యం అమ్మరాదని తీసుకున్న నిర్ణయాన్ని అన్నివేళల అమలు చేయాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే కాదు నిరంతరం కండీషన్స్‌ను అమలు చేయాలి. ఈ విషయంపై ప్రభుత్వమూ నిరంతరం పర్యవేక్షించాలి.
రోడ్లపై బైక్‌లు నడిపే తమ పిల్లలపై తల్లిదండ్రులు, మద్యం షాపు యజమానులు, అటు ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెడితే ఇలాంటి విషాద ఘటనలు జరగకుండా ఉంటాయి. అయితే, ఇవన్నీ ఆలోచించే వారెవరు? చట్టాలు ఉన్నంత మాత్రాన వాటిని పట్టించుకునే నాధుడూ లేకుండాపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రమాదాలను మాత్రం నివారించలేకపోతున్నారు పోలీసులు. దీనికి ప్రధాన కారణం నిర్లక్ష్య ధోరణే. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట పోలీసులు రోడ్డుమీద ఎన్ని కేసులు రాస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు.
లంచాలు ఇచ్చో జరిమానాలు చెల్లించో మళ్లీ మళ్లీ అదే తప్పుచేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాల్సిన సమయమైతే ఆసన్నమయిందనే చెప్పాలి. కేవలం తాగి మద్యం మత్తులో ప్రమాదాలకు కారణమవుతున్న కేసులను విశ్లేషించాకైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదో కేవలం కేసుల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం మాత్రం కాదన్నది పోలీసులు గ్రహించాలి. ఈ నేరానికి పాల్పడింది ఎంతటి వారైనా కేసులు పెట్టాల్సిందే. లంచం ఇస్తే తీసుకోండి. కానీ, కేసు మాత్రం పెట్టండి. అప్పుడు మరోసారి అదే తరహా నేరం చేయడానికి భయపడ్డం ఖాయం. చట్టంలో పేర్కొన్న ప్రకారం శిక్షల్ని అమలుచేస్తే మద్యం మత్తులో జరుగుతున్న నేరాలకు కొంత వరకైనా అడ్డుకట్టపడనుంది.


