మరోసారి విఫలయత్నం!
మావోయిస్టుల్ని ఏరివేయాలన్న పోలీసుల లక్ష్యం మరోసారి విఫలమైనట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో జరిగిన భారీ ఎన్కౌంటర్ నుంచి కూడా ‘ఆర్కే’ తప్పించుకోవడాన్ని బట్టి చూస్తే పోలీసులు విఫలయత్నం చేశారన్నది అర్ధమవుతోంది. గతంలో చాలా సార్లు పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న ఆర్కే ఈసారి కూడా పక్కా వ్యూహంతో బయటపడ్డారు. కొంత మంది కీలక నాయకుల్ని కోల్పోయినప్పటికీ ఆర్కే లాంటి ఉద్యమ వ్యూహకర్త తప్పించుకోవడం ఇటు పోలీసులకూ మింగుడుపడ్డంలేదు.
చావుదెబ్బతిని తప్పించుకున్న మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రతీకారం పొంచి ఉందో అంతుచిక్కడం లేదు. ఆర్కే పేరు వింటే చాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ముచ్చెమటలు పోస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఏవోబీలో మావోయిస్టు ఉద్యమాన్ని ఉచ్ఛస్థితికి తీసుకెళ్లిన ఈ మావో అగ్రనేత అసలు పేరు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే)ను లక్ష్యంగా చేసుకునే పోలీసు ఉన్నతాధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారని తెలుస్తోంది. దాని ఫలితమే సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్.
అసలు లక్ష్యమైన ఆర్కే ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోగలిగినా పలువురు కీలకనేతలు సహా 24 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒకప్పుడు ఏవోబీ కార్యదర్శిగా పనిచేసిన ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జరిపిన శాంతిచర్చల్లో పాల్గొన్న మావోయిస్టుల బృందంలో ఆర్కే కూడా ఉన్నారు. ఆ తర్వాత పలుమార్లు జరిగిన ఎన్కౌంటర్ల నుంచి ఆయన తప్పించుకున్నారు. ఆర్కే లక్ష్యంగా ఎప్పటినుంచో పని చేస్తున్న పోలీసు బలగాలు ఆ మధ్య గాలికొండ ఏరియా, దంతెవాడ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్కే హతమయ్యాడని తొలుత వార్తలు వచ్చినా తర్వాత అవి వాస్తవం కాదని తేలింది.
తాజాగా ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్ లక్ష్యం కూడా ఆర్కేయేనని పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్ కేవలం ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతోనే జరిగినట్లు తెలుస్తోంది. కేవలం ఆర్కే లక్ష్యంగానే భద్రతా బలగాలు రంగంలోకి దిగినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి అంతర్గత సంభాషణల్లో స్పష్టం చేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా జంత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుడుములగుమ్మ సమితి పనసపుట్టు పంచాయతీలోని కటాఫ్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో మావోల ప్లీనరీ జరుగుతోందని, అందులో ఆర్కే ఉన్నాడన్న పక్క సమాచారంతోనే ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది.
ఇటీవల పోలీసులకు చిక్కిన మిలీషియా సభ్యుల్లో పలువురు గతంలో మావో కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వీరిలో కొంతమందిని షెల్టర్ జోన్ ఏరియాకు పంపి అక్కడ మావోల ఆనుపానులు గుర్తించారు. గత వారం రోజులుగా వీరు అదే పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు మావోల కదలికలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. డిసెంబర్లో జరగనున్న పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఈ ప్లీనరీలో అగ్రనేతలంతా సమావేశమవుతున్నట్టు పక్కా సమాచారం అందింది. తాజా ఎన్కౌంటర్ వెనుక ప్రధాన వ్యూహకర్త గ్రేహౌండ్స్ కమాండెంట్ జయరామిరెడ్డి అని తెలిసింది. ఏవోబీలో మావోయిస్టు కార్యకాలాపాలకు పూర్తిగా చెక్‌పెట్టాలన్న లక్ష్యంతో తాజా ఆపరేషన్‌కు ఆయనేస్కెచ్ వేయడంతోపాటు మొత్తం పర్యవేక్షించారని పోలీసు అధికారులు చెబుతున్నారు.
మూడువైపుల నుంచి ఇరు రాష్ట్రాల పోలీసులు బలగాలను రంగంలో దింపారు. సాధారణంగా ప్లీనరీ వంటి ముఖ్యమైన సమావేశాలు జరిగినప్పుడు మావోయిస్టులు మూడంచెల భద్రత ఏర్పాటు చేసుకుంటారు. అయితే ప్రస్తుత ప్లీనరీ జరుగుతున్న కటాఫ్ ఏరియా పూర్తిగా లోయ ప్రాంతం కావడంతో మూడంచెల భద్రతను ఛేదించే పని లేకుండా ఎత్తయిన ప్రదేశం నుంచి దాడి జరిపేలా వ్యూహరచన చేశారు. ఆపరేషన్ ఆర్కే పేరుతో శుక్రవారం రాత్రి నుంచి మొదలు పెట్టిన కూంబింగ్ చేపట్టిన దళాలు ఆదివారం సాయంత్రానికి మావో శిబిరానికి సుమారు పది కిలోమీటర్ల దూరానికి చేరుకున్నాయి. విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం బూసిపూట్ వద్ద వాహనాలతో పాటు సెల్ఫోన్లను పూర్తిగా బంద్ చేశారు. ఎటువంటి సిగ్నల్స్ పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగారు.
ఆ తర్వాత సుమారు 9 కిలోమీటర్లు పూర్తిగా కాలినడకనే లక్ష్యం వైపు సాగారు. సోమవారం తెల్లవారుజామున చీకటి తెరలు వీడకముందే కొండపై నుంచి ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. మావోలు వారిని గుర్తించినా అప్పటికే ఆలస్యమైంది. రెండు శిబిరాల్లో 40 మంది మావోలు ఉండగా గ్రేహౌండ్స్ దళాలు మాత్రం ఒక శిబిరం మాత్రమే ఉందన్న ఆలోచనతో దానిపై దృష్టి పెట్టాయి. ఈ శిబిరంలో ఉన్న ఆర్కే తనయుడు ఫృద్వీ అలియాస్ మున్నాతో సహా పలువురు మావో కీలకనేతలు నేలకొరిగారు.
కాగా రెండో శిబిరంలో ఉన్న ఆర్కేతోపాటు మరికొందరు అగ్రనేతలు తప్పించుకున్నారు. ఆర్కే చిక్కక పోయినప్పటికీ ఆర్కే తనయుడు మున్నాతో సహా చలపతి, రవి, దయా తదితర ముఖ్యనేతలు చనిపోయారు. ఆంధ్ర- ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో సోమవారం ఉదయం పోలీసులు-మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది మావోయిస్టులు, ఒక పోలీస్ సీనియర్ కమాండో మృతి చెందారు. చనిపోయిన మావోయిస్టుల్లో ప్రాథమికంగా 14 మందిని గుర్తించారు.
మృతుల్లో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ అధినేత అక్కిరాజు హరగోపాల్ ( ఆర్కే) తనయుడు పృథ్వీ అలియాస్ మున్నాతో పాటు ఇద్దరు స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు చమల కిష్టయ్య అలియాస్ దయ, బాకూరి వెంకటరమణ అలియాస్ గణేష్ కూడా ఉన్నారు. వీరిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా కూడా వ్యవహరిస్తారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా జెంత్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసపుట్టు పంచాయతీ పరిధి బెజ్జింగి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు ఈ విషయం చేరడంతో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో 13 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నట్లు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ వెల్లడించారు. ఇద్దరు సీనియర్ పోలీసు కమాండర్లకు బుల్లెట్ గాయాలవ్వగా అందులో మహ్మద్ అబూబకర్ మృతి చెందారు.
వైద్యసేవలు అందించడానికి హెలీకాప్టర్‌లో విశాఖకు తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను చనిపోవడంతో మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మరో క్షతగాత్రుడు దొంతల సతీష్‌ను నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యులు-2, డీసీఎస్-1, డీసీఎం-8, ఏసీఎం-3, ఇతర క్యాడర్ సభ్యులు-10 ఉన్నారు. ఈ ఘటనలో ఏకే-47లు 3, ఎస్ఎల్ఆర్-4, ఇన్సాస్లు-4, 303 రైఫిల్స్-7, ఎస్బీబీఎల్-4, పిస్టళ్లు-2, గ్రేనైడ్-1, ల్యాప్‌టాప్‌లు-2, రూ.2.16లక్షల నగదు, విప్లవ సాహిత్యం, 50 కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. 50 మందికిపైగా మావోయిస్టులు పాల్గొన్న ఆంధ్ర- ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధుల సమావేశానికి ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ అధినేత ఆర్కే నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటన నుంచి తప్పించుకున్న వారిలో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే) ఉన్నట్లు భావిస్తున్నారు. భారీ ఎన్కౌంటర్: పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇంత భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడం ఇదే ప్రథమం. 2013 సెప్టెంబర్ 13లో మల్కన్‌గిరి జిల్లా పొదియా ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే 1996లో ఏఓబీ పరిధిలోకి వచ్చే కొప్పడంజిలో జరిగిన కాల్పుల్లో మొత్తం 19 మంది చనిపోయారు. తాజాగా సోమవారం నాటి ఘటనలో 24 మంది మృతి చెందారు. దట్టమైన అటవీ ప్రాంతమైన చిత్రకొండ రిజర్వాయర్ కేంద్రంగా మావోయిస్టుల కార్యకలాపాలు జరుగుతున్నాయి.
చిత్రకొండ రిజర్వాయర్ వద్దకు సరైన రాకపోకలు లేకపోవడంతో మిలీషియా సభ్యులు, సానుభూతిపరుల సాయంతో మావోయిస్టులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. చిత్రకొండ రిజర్వాయర్‌ను అనుసంధానం చేస్తూ గురుప్రియ వంతెనతో పాటు 150 గ్రామాలకు ఉపయోగపడే రహదారి నిర్మాణంలో జాప్యం జరగడం వీరికి కలిసొచ్చింది. పోలీసు బలగాల సాయంతో ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతంపై పోలీసుల పట్టు పెరిగింది. 2008 జూన్ 28న బలిమెల జలాశయంలో అల్లంపాక వద్ద గ్రేహౌండ్స్ బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిగారు. ఈ ఘటనలో లాంచీలో 38 మంది గ్రేహౌండ్స్ పోలీసులు, ఒక ఒడిశా పోలీసు, ఒక లాంచి డ్రైవర్ మృతి చెందారు.
ఈ సమయంలో లాంచిలో 2 పార్టీలకు చెందిన 68మంది ఉన్నారు. ఈ ఘటనకు ప్రతీకారంగా పోలీసుల బలగాలు కూంబింగ్‌లు ముమ్మరంచేశాయి. కీలక ప్రాంతా ల్లో పోలీస్ అవుట్‌పోస్టులు ఏర్పాటు చేశాయి. ఈ సంఘటన స్థలం వద్ద లభించిన అత్యాధునిక ఆయుధాలు, ఇతర సామగ్రిని బట్టి భారీ సంఖ్యలో మావోయిస్టులు అక్కడ సమావేశమైనట్లు తెలుస్తోందని డీజీపీ సాంబశివరావు విలేకరులతో చెప్పారు. అక్కడికి మరిన్ని బలగాల్ని కూడా పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లిన సిబ్బందికి సోమవారం ఉదయం 6.45 గంటలు 7 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడ్డారని, లొంగిపోమని హెచ్చరించినా వాళ్లు వినకుండా కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని డీజీపీ సాంబశివరావు వెల్లడించారు.
ఆపమన్నా వాళ్లు ఆపలేదని మధ్యాహ్నానికీ కాల్పులు జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. తొలుత ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందిన వారి వద్దకు పోలీసులు వెళ్లే ప్రయత్నం చేశారన్నారు. ఆ సమయంలో మావోయిస్టులు మళ్లీ కాల్పులకు దిగడంతో మధ్యాహ్నం వరకు మృతదేహాల వద్దకు వెళ్లలేకపోయారన్నారు. ఈ సంఘటన జరిగిన అటవీప్రాంతం భౌగోళికంగా అత్యంత సంక్లిష్టమైనదని వివరించారు. అలాంటి ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారని తెలిసి ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులు, కేంద్రబలగాలు సంయుక్తంగా మావోయిస్టులపై దాడి చేయడానికి వెళ్లాయన్నారు. పోలీసులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి వారితో వీరోచితంగా పోరాడారన్నారు.
గాయపడింది పోలీసులైనా, నక్సలైట్లయినా విశాఖ రప్పించి వైద్యం అందిస్తామని డీఐజీ తెలిపారు. మృతదేహాలను మల్కన్‌గిరి వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు. ఒడిశా డీజీపీ కె.బి.సింగ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారని చెప్పారు. సంఘటనా స్థలంలో ఒడిశా రాష్ట్రంలోని గుమ్మా బ్లాకుకు చెందిన జొడుగుమ్మ పంచాయతీ కొజ్జిరిగూడ గ్రామానికి చెందిన బొల్లూరి లొక్నోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులు లగేజి మోయడానికి తనను తీసుకెళ్లారని, ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని లోక్నో విలేకర్లకు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు సాధారణ దుస్తులతో ఉన్నారు. వీరిపైనా స్పష్టత రావాల్సి ఉంది.


