మరో ఐదు రోజులు భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలంగాణ వ్యాప్తంగా బుధ, గువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్పపీడనం ఏర్పడటంతో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. హైదరాబాద్ నగరంలోనూ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు.
ఇటీవల నగరంలో ఏకధాటిగా మూడు గంటల పాటు 7 సెంటీమీటర్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఒకేసారి అంత వర్షం కురవడంతో నగరం అతలాకుతమైంది. ఈసారి కూడా ఒకేసారి ఏకధాటిగా వర్షం కురిసే అవకాశాలు లేకపోలేదని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణం శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ వివిధ శాఖలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరద సహాయం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలను మూడు షిఫ్టుల్లో పనిచేసేలా చూడాలని చెప్పారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి వివిధ శాఖల అధికారులకు, జోనల్ అధికారులకు, ఇంజనీర్లకు ప్రత్యేకంగా సూచనలు పంపారు. వరద సహాయ బృందాలు, వాహనాలను అందుబాటులో ఉంచేలా చూడాలని అన్నారు. అనుకోని సంఘటలను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గణేశ్ నిమజ్జనం ఉన్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.


