మరో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్టైమ్): నైరుతి రుతుపవనాల సీజన్ చివరిలో తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. ఊళ్లు, వాగులు ఏకం చేసేలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడా భారీ నుంచి అతి భారీవర్షాలు కురవడంతో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడింది. గురువారం రాత్రి కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీవర్షాలు కురవనున్నాయని, శుక్రవారం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం గురువారం సాయంత్రం ఇక్కడ హెచ్చరించింది. శుక్రవారం నుంచి వరుసగా నాలుగు రోజులపాటు తెలంగాణ, కోస్తాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు వరద ముప్పు పొంచి వున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని కోస్తాలో వున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా బలపడి పూర్తిగా కోస్తాపైకి వచ్చి స్థిరంగా కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం వుంది. అంతకుముందు ఐదు రోజుల క్రితం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా బలపడడంతో సముద్రం నుంచి భారీగా తేమ భూఉపరితలంపైకి వస్తోంది.
తీవ్ర అల్పపీడనం ఏర్పడిన ప్రాంతంలో దట్టంగా తేమ మేఘాలు ఆవరించాయి. వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో అల్పపీడనానికి దక్షిణ/నైరుతి భాగంలో నీటితో కూడిన మేఘాలు ఆవరిస్తాయి. ప్రస్తుతం అల్పపీడనానికి దక్షిణ భాగంలో మధ్య కోస్తా, దానికి ఆనుకుని తెలంగాణ ప్రాంతం వుంది. దీంతో గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలు, వాటికి ఆనుకుని వున్న తెలంగాణ జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారడం, రుతుపవనాలు చురుగ్గా వుండడంతో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. తీవ్ర అల్పపీడనం పశ్చిమంగా పయనిస్తే దక్షిణ కోస్తా జిల్లాలు, వాటికి ఆనుకుని వున్న రాయలసీమ, తెలంగాణ జిల్లాలపై ప్రభావం వుంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. శుక్రవారం తెలంగాణపై ఎక్కువ ప్రభావం వుండే అవకాశం ఉందని పేర్కొన్నారు.


