మలయాళంలో ‘జనతా గ్యారేజ్’ పరిస్థితి ఏంటి?
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జనత గ్యారేజ్’ చిత్రం గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ‘జనతా గ్యారేజ్’కు తెలుగులో మిశ్రమ స్పందన వచ్చింది. అయినా కూడా మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించడంతో కేరళలో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడం జరిగింది. సినిమా ప్రారంభం నుండి కూడా కేరళలో ఈ సినిమాకు భారీగానే ప్రచారం చేయడం జరిగింది.
భారీ ప్రచారం చేయడంతో మంచి ఓపెనింగ్స్‌ను ఈ చిత్రం అక్కడ కూడా దక్కించుకుంది. మలయాళంలో ఒక డబ్బింగ్ సినిమా మొదటి రోజు అత్యధికంగా ఇప్పటి వరకు 74 లక్షలు వసూళ్లు సాధించింది. యోధావు సినిమా ఇప్పటి వరకు ఆ రికార్డును తన ఖాతాలో ఉంచుకుంది. ఇప్పుడు ఆ రికార్డు ‘జనతా గ్యారేజ్’ పేరుతో నమోదు అయ్యింది. మలయాళంలో అత్యధికంగా మొదటి రోజు వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ చిత్రంగా ‘జనతా గ్యారేజ్’ నిలిచింది అంటూ డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న మలయాళ నిర్మాతలు అంటున్నారు.
మోహన్‌లాల్ ఉండటం వల్ల ఈ సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినట్లుగా చెబుతున్నారు. ఒక డైరెక్ట్ సినిమా స్థాయిలో ఈ సినిమా వసూళ్లు సాధించింది. ఇక లాంగ్ రన్లో కూడా ఈ సినిమా తప్పకుండా మోహన్‌లాల్ పుణ్యాన భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం అని నిర్మాతలు అంటున్నారు.


