మలుపుల కేసులో రాజ్యాంగ సవాల్!
ఓటుకు నోటు కేసు వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతోంది. ఈ కేసు గొప్పదనం ఏమిటంటే కేసులో ఏదో హడావుడి అవుతుందని ప్రజలు అనుకునే లోపుగానే, అంతకన్నా రాజీ అయిపోయిందన్న ప్రచారం జరిగిపోవడం. ఇది నిజంగానే ఒక స్టడీ కేసుగా భవిష్యత్తులో పరిశోధకులకు ఉపయోగపడవచ్చు. కొద్ది రోజుల క్రితం ఎసిబి కోర్టు ఈ కేసుకు సంబందించి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రను విచారించి నివేదిక ఇవ్వాలని కోరిన విషయం సంచలనమే అయింది. కాని ఆ తర్వాత కేంద్రంలోని కొందరు బిజెపి పెద్దలు కాని, టిడిపి కేంద్ర మంత్రి సుజనా చౌదరి రంగంలో దిగి చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కనబడుతున్నాయి.
టిఆర్ఎస్కు చెందిన ఒక పత్రిక తొలి రోజు ఎంతో ప్రముఖంగా కోర్టు ఆదేశాల వార్తను ప్రచురిస్తే, ఆ తర్వాత ఎసిబి కోర్టుకు తెలంగాణ ఎసిబి ఇచ్చిన మెమో గురించి కానీ, చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేస్తామని కోర్టుకు తెలియచేసిన విషయానికి గాని అసలు ప్రాముఖ్యత ఇవ్వకుండా లోపలి పేజీలకు, అది కూడా చాలా చిన్నవార్తగా ప్రచురించడం చూస్తుంటే ఏదో మతలబు ఉన్నట్లు కనబడుతుంది.
అదే సమయంలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ఈ కేసు అసలు అవినీతి నిరోధక చట్టం పరిదిలోకి రాదని, ఎన్నికల అక్రమాల కేసుగా చూడాలన్న వాదనను వినిపించడం ఆరంబించారు. అదే సమయంలో రాజ్ భవనలో రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు బొత్స సత్యనారాయణ, కరుణాకరరెడ్డి వంటివారు ఆరోపిస్తున్నారు.
ఏమైతేనేమీ ఊహించిన విధంగా తాత్కాలికంగా అయినా కేసులో చంద్రబాబు స్టే పొందగలిగారు. నిజంగా దీని గురించి వ్యాఖ్యానించాలంటే రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపివేస్తున్న ఓటుకు నోటు కేసు రాజ్యాంగ వ్యవస్థలకే సవాల్ విసురుతోంది.తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు పొందేందుకు గాను టిఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ కు డబ్బు ఇచ్చే చేసే ప్రకియలో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడడం, అదే క్రమంలో స్టీవెన్సన్ కు ఎపి ముఖ్యమంత్రి ,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తూ ఆడియో టేపులో చిక్కిన వైనం దేశం అంతటా సంచలనం సృష్టించింది. ఎంతో సీనియర్ నేతగా ఉంటూ, నిత్యం నిప్పు అని,నిక్కచ్చి,తప్పు చేయలేదని కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు ఇలా ఆడియోలో దొరికిపోయారా అని అంతా ఆశ్చర్యపోయారు.
మొదట ఈ కేసుతో కొంత ఫంక్ అయినా, చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శించి, ఏ వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయవచ్చో రుజువు చేశారు. అంతేకాక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై పోన్ టాపింగ్ అంటూ ఎదురు కేసులు పెట్టి హడావుడి సృష్టించడం ఒక వైపు ,కేంద్రంలోని పెద్దల ద్వారా రాయబారాలు చేయించడం మరో వైపు సాగించి కేసు ముందుకు వెళ్లకుండా చేయడం లో సఫలం అయ్యారు.తెలంగాణ ఎసిబి చార్జీషీట్ లో ముప్పైమూడు సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావించినా, ఆయనను నిందితుడుగా ఎసిబి చేయలేకపోవడం అంటే అది చంద్రబాబు చాతుర్యంగానే బావించాలి. చంద్రబాబు,కెసిఆర్ లు రాజీపడడం వల్ల మొత్తం కేసు అంతా నీరు కారిపోయిందని భావన ఏర్పడింది.
లేకుంటే పద్నాలుగు నెలల క్రితం మొదలైన ఈ కేసు లో తెలంగాణ ఎసిబి అదనపు చార్జీషీట్ వేయలేకపోయింది?ఒక పత్రిక రాసినట్లు చంద్రబాబు ఆడియోటేపును ఇంతవరకు అసలు పోరెన్సిక్ లాబ్ కు ఎందుకు పంపలేదు? చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని హూంకరించిన కెసిఆర్ ఎందుకు జారి పోయారు?చివరికి ఎపిలో ఒక విపక్ష ఎమ్మెల్యే అయిన రామకృష్ణారెడ్డి, న్యాయవాది సుదాకరరెడ్డిలు ఎంతో శ్రమకోర్చి, ముంబైలోని పోరెన్సిక్ లాబ్ నుంచి నివేదిక తెప్పించుకుని కోర్టులో సమర్పించవలసి వచ్చింది.ఇదంతా ప్రభుత్వం చేయవలసిన పని కదా?మరి ఏడాదికిపైగా ఎందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు? ఇదే ఒక సాధారణ వ్యక్తి అయి ఉంటే చట్టం, ప్రభుత్వం ఇలాగే ఉండేవా?చట్టం కొందరికి చుట్టమా?ఇక్కడ టిఆర్ఎస్ నేతలు ఆఫ్ ద రికార్డు ఒక మాట చెబుతుంటారు.
ఓటు కు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేసినా న్యాయవ్యవస్థను సైతం మేనేజ్ చేయడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు తేలికగా స్టేలు పొందుతారని అంటుంటారు.ఇలాంటి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు సవాల్ గా మారే మాట వాస్తవమే. అదే సమయంలో ఎసిబి కోర్టు న్యాయమూర్తి ఇప్పుడు ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించేదే. ఆయన ఎక్కడా మొహమాటం లేకుండా కేసులోని పూర్వాపరాలు పరిశీలించి చంద్రబాబు పాత్రపై పునర్విచారణ జరపాలని ఆదేశించడం ఆహ్వానించదగిన పరిణామంగానే బావించాలి.ఇప్పుడు దీనిని లాజికల్‌గా ఒక ముగింపునకు తీసుకువెళ్లవలసిన బాద్యత తెలంగాణ ఎసిబిపైన ,ప్రభుత్వంపైన ఉంటుంది?ఇది రాజకీయ వ్యవస్థకు సవాలు.ఈ కేసులో ముందుకు వెళ్లలేకపోతే తెలంగాణ ప్రబుత్వానికి ,ముఖ్యమంత్రి కెసిఆర్ కు అప్రతిష్ట వస్తుంది.
కేసులో చట్టప్రకారం వ్యవహరించి, కేసులో నిందితుడుగా చేరే పరిస్థితి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చేరితే అప్పుడు అది ఆయనకు గండంగా మారుతుంది.ఒక మాటలో చెప్పాలంటే కేసు ముందుకు వెళితే చంద్రబాబుకు, వెళ్లకపోతే కెసిఆర్ కు అప్రతిష్ట చుట్టుకుంటుంది.ఆ తర్వాత ఈ కేసును ఎలా డీల్ చేస్తుందన్నదానిపై న్యాయ వ్యవస్థ ప్రతిష్ట ఆధారపడి ఉంటుంది. అంతిమంగా రాజ్యాంగం అందరికి సమానమా?కాదా? అన్నదానికి ఓటుకు నోటు కేసు సవాల్ విసురుతోందని చెప్పాలి. మొత్తానికి ఈ కేసులో అనుకున్నదే జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మళ్లీ సాధించారు. ఇప్పటికే అనేక కేసుల్లో పై కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు తాజాగా ‘ఓటుకు కోట్లు’ కేసులో సైతం హైకోర్టు నుంచి స్టే సాధించారు. దేశంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ముఖ్యమంత్రి, ఆయన సహచరులు రెడ్‌హ్యాండెడ్‌గా ఆడియో, వీడియో టేపుల్లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారు.
ఆ విషయాలను కోట్లాదిమంది ప్రజలు వీక్షించారు. అయినా ఈ కేసులో సాంకేతిక కారణాలతో దర్యాప్తు నిలుపుదల చేస్తూ చంద్రబాబు స్టే తెచ్చుకోగలగడం విశేషం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపేసింది. అంతేకాక ఫిర్యాదునకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ కూడా నిలుపుదల చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అటు ఏసీబీ, ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డిలను ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేయడంతో పాటు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని విచారించాల్సిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ సెలవుపై భోపాల్ వెళ్లడంతో దీనిని మరో న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారు దాఖలు చేసిన కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ కూడా దాఖలు చేశారని కోర్టుకు నివేదించారు. ఇటువంటి పరిస్థితుల్లో కింది కోర్టు ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ఈ సమయంలో ఆయన ఏదో విషయం చెప్పేందుకు ప్రయత్నించగా న్యాయమూర్తి అడ్డుతగులుతూ అవన్నీ వద్దు పాయింట్లోకి రండి అంటూ స్పష్టం చేశారు. అసలు ఈ కేసుకూ, ఫిర్యాదుదారుకూ ఎటువంటి సంబంధంలేదని, ఈ కేసుకు అతను థర్డ్‌పార్టీ అని లూథ్రా వివరించారు. అంతేకాక అతను పిటిషనర్‌కు రాజకీయ ప్రత్యర్థని, ప్రతిపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యే అని తెలిపారు. ఈ సమయంలో న్యా యమూర్తి స్పందిస్తూ, అతను ఫిర్యాదు దాఖలు చేయడం సక్రమమే కాని మేజిస్ట్రేటే సరైన ఉత్తర్వులు ఇవ్వలేదంటారు అంతేనా? అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారని ఏసీబీ తరఫు న్యాయవాది వి.రవికిరణ్రావును ప్రశ్నించారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చిన తరువాత ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మెమోను పరిశీలించబోతుండగా మళ్లీ న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాటిని చూడాల్సిన అవసరం లేదని విషయం చెప్పండన్నారు.
కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదని, దర్యాప్తు కొనసాగుతోందని అందులో పేర్కొన్నామని రవికిరణ్‌రావు తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఇటువంటి మెమో మీరెలా దాఖలు చేస్తారు? కోర్టు మీకు ఆదేశాలు ఇచ్చింది. వాటిని మీరు అమలు చేయాలి. అంతే తప్ప అందుకు విరుద్ధంగా మెమో ఎలా దాఖలు చేస్తారు? ఇలా దాఖలు చేయవచ్చని ఏ చట్టం చెబుతోంది? తప్పో ఒప్పో మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. వాటిని మీరు అమలు చేయాల్సిందే. చేయబోమని ఎలా చెబుతారు? మెమో దాఖలు ద్వారా కోర్టు నుంచి మరో ఉత్తర్వులు ఆహ్వానిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఈ ఫిర్యాదు దాఖలు చేసే అర్హత ఫిర్యాదుదారుకు ఎక్కడ ఉందని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బదులిస్తూ, ప్రైవేటు వ్యక్తికి జోక్యం చేసుకునే అర్హత ఉందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందన్నారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలపై ఈ దశలో పిటిషన్ దాఖలు చేసే అర్హత చంద్రబాబుకే లేదని వివరించారు.
ఇందుకు సంబంధించి ఆయన సుప్రీంకోర్టు తీర్పులు కొన్నింటిని ఉదహరించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ‘అవన్నీ వద్దు.. మీరు ఓ తీర్పు చూపితే వాళ్లు వంద తీర్పులు చూపిస్తారు. నేరుగా పాయింట్లోకి రండి’ అన్నారు. ఇటువంటి పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నిషేధం విధిస్తోందని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఇవన్నీ ఎందుకు ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదంటారు అంతే కదా అని న్యాయమూర్తి మళ్లీ వ్యాఖ్యానించారు. దీంతో సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ అవినీతికి పాల్పడేలా మిగిలిన నిందితులను ప్రోత్సహించినందుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) సెక్షన్ 12 కింద చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాము సీఆర్పీసీ సెక్షన్200 కింద ఫిర్యాదు చేశామన్నారు. సెక్షన్ 156(3) కింద ఫిర్యాదు దాఖలు చేయలేదన్నారు.
పీసీ యాక్ట్ కింద చర్యలు కోరి, దర్యాప్తునకు సంబంధిత కోర్టు ఆదేశించిన సందర్భాల్లో మిగిలిన ఏ కోర్టులు కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ పీసీ యాక్ట్ సెక్షన్ 19(3) నిషేధం విధిస్తోందన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన మళ్లీ కొన్ని తీర్పుల గురించి ప్రస్తావించారు. తీర్పుల సంగతి ఎందుకు అవినీతి నిరోధక చట్టం కింద ఈ పిటిషన్ దాఖలు చేయకూడదు స్టే ఇవ్వకూడదు. ఇదే కదా మీరు చెప్పాలనుకుంటోంది. అని న్యాయమూర్తి అడిగారు. మరి నిబంధనలను కింది కోర్టు సరిగా అర్థం చేసుకోకుండా ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా బాధితుడు కోర్టుకు రాకూడదా? దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసిన కేసుల్లో మళ్లీ దర్యాప్తు చేయాలని ఆదేశించవచ్చా? అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు.
అవినీతి నిరోధక చట్టం కింద ఫిర్యాదు దాఖలు చేసినప్పుడు అందులో స్టే కోరడానికి వీల్లేదని సుధాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి ఉత్తర్వులు ఇవ్వడం ప్రారంభించారు. ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత ఫిర్యాదుదారుకు ఉందా? సీఆర్పీసీ సెక్షన్ 200 కింద ఫిర్యాదు చేసినప్పుడు 156(3) కింద మేజిస్ట్రేట్ దర్యాప్తునకు ఆదేశించవచ్చా? దర్యాప్తు పూర్తైచార్జిషీట్ దాఖలు చేసిన కేసులో మళ్లీ దర్యాప్తు చేయమని మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చా? కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు అవసరం లేదంటూ ఏసీబీ మెమో దాఖలు చేయవచ్చా? అన్న అంశాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందువల్ల ఏసీబీ కోర్టు ఆదేశాల అమలును స్టే చేస్తున్నట్లు ప్రకటించారు.
అదే విధంగా ఫిర్యాదుకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తున్నట్లు కూడా తెలిపారు. విచారణ వాయిదా వేస్తున్న తరుణంలో ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు స్పష్టత కోరారు. దీనిని న్యాయమూర్తి స్పందిస్తూ ‘రవికిరణ్ మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ప్రధాన కేసులో మీరు దర్యాప్తు కొనసాగించుకోవచ్చు. ఇవి కేవలం ఎమ్మెల్యే ఫిర్యాదునకు సంబంధించిన కేసులో ఇస్తున్న ఉత్తర్వులు మాత్రమే’ అని స్పష్టం చేశారు. ఈ సమయంలో సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఉత్తర్వుల కాపీని వీలైనంత త్వరగా అందజేసేలా చూడాలని కోరారు. ఎందుకని న్యాయమూర్తి ప్రశ్నించగా, అప్పీల్‌కు వెళతామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేస్తారన్న మాట అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సాయంత్రం కల్లా ఉత్తర్వుల కాపీని ఇవ్వాల్సినంత అత్యవసరం ఏదీ లేదని, కాపీ కోసం సుధాకర్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న న్యాయమూర్తి తరువాత వాటిని తొలగించారు.
న్యాయమూర్తి ఉత్తర్వులు ఇవ్వడం పూర్తి చేసిన తర్వాత అందరూ కోర్టు హాలులో నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమౌతున్న సమయంలో ఓ ఏజీపీ (ప్రభుత్వ సహాయ న్యాయవాది) తన నోటికి పని చెప్పారు. చంద్రబాబుపై దర్యాప్తునకు ఆదేశించిన మేజిస్ట్రేట్‌కు దురుద్దేశాలు ఆపాదించేలా వ్యాఖ్యలు చేశారు. అది కూడా కోర్టు హాలులోనే. పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబుపై దర్యాప్తునకు ఆదేశించిన మేజిస్ట్రేట్ మీ బంధువేలే. ఎవరికి తెలియదు అంటూ పొగరుగా వ్యాఖ్యానించారు. దీనిపై సుధాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. దీంతో ఒకసారిగా కోర్టు హాలు, బయట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏజీపీ వ్యాఖ్యలను సుధాకర్‌రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆయనకు ఇవన్నీ సహజమంటూ న్యాయమూర్తి నవ్వుతూ వ్యాఖ్యానించారు. అప్పటికే కోర్టు హాలు బయట పెద్ద సంఖ్యలో న్యాయవాదులు గుమికూడారు.
తరువాత కోర్టు హాలు నుంచి బయటకు వచ్చిన సుధాకర్‌రెడ్డి కింది కోర్టు మేజిస్ట్రేట్ ఏ విధంగా తనకు బంధువవుతారో చెప్పాలంటూ ఏజీపీని గట్టిగా నిలదీశారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. దీంతో అక్కడ ఒకింత ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సైతం తీవ్రంగానే స్పందించారు. దీంతో అటు పోలీసులు, ఇటు మిగిలిన న్యాయవాదులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఏజీపీ మాటలను అక్కడున్న న్యాయవాదులందరూ తప్పుపట్టారు.


