మళ్లీ ఓఎన్జీసీ ముడి చమురు లీకేజీ
తూర్పు గోదావరి జిల్లా కేశనపల్లిలోని ఓన్జీసీ వెస్ట్ స్ట్రక్చర్ పరిధిలోని గొల్లపాలెం-తూర్పుపాలెం జీజీఎస్ సమీపంలో గొల్లలపాలెంలో పైపులైను ధ్వంసమై ముడిచమురు లీకైంది. ఇక్కడి కేడబ్లు్యడీహెచ్ బావి నుంచి కేడబ్లు్యఏఏ బావికి, అక్కడి నుంచి జీజీఎస్కు వెళ్లే పైపులైను మంగళవారం ఉదయం లీకైంది. పైపులైను నుంచి ఒత్తిడితో ముడిచమురు ఉద్ధృతంగా పైకి ఎగదన్నినట్లు స్థానికులు తెలిపారు.
సుమారు 50 మీటర్ల పైకి ఎగదన్నడంతో సమీపంలోని సరుగుడు చెట్ల మీద నుంచి పడి, ఈ ప్రాంతమంతా చమురుతో నిండిపోయింది. ఉదయం 8.30 గంటల సమయంలో చమురు లీకవడం చూసిన స్థానికులు సమీపంలో ఓఎన్జీసీ బావి వద్దగల సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు అప్రమత్తమై పైపులైనులో చమురు ప్రవాహాన్ని నిలిపివేశారు.
లీకేజీతో ముడి చమురు సరుగుడు తోటల మధ్యనున్న గాడుల్లోని నీటిలో ప్రవహించడంతో ఆ ప్రాంతమంతా కలుషితమైంది. దీని ప్రభావంతో ఈ ప్రాంతంలోని సుమారు 25 ఎకరాల సరుగుడు, కొబ్బరి తోటలకు నష్టం కలుగుతుందని సీసీఎఫ్ సొసైటీ అధ్యక్షుడు నల్లి అంబేద్కర్, రైతులు గంటా వరప్రసాద్, గంటా ఆశీర్వాదం, బోడపాటి స్టాలిన్ తదితరులు వాపోయారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలని వారు ఓఎన్జీసీ అధికారులను డిమాండ్ చేశారు.


