మహిళా ఉద్యోగిని కుర్చీకి కట్టేసి సజీవ దహనం
పట్నా, అక్టోబర్ 25: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళను కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ దారుణం జరిగింది. జూనియర్ ఇంజనీర్ అయిన 42 ఏళ్ళ సరితా దేవి ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమెను తాళ్ళతో కుర్చీకి కట్టేసి నిప్పంచడంతో పూర్తిగా కాలిపోయింది. సోమవారం ఈ విషయం వెలుగుచూడంతో పోలీసులు అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో ఓ సూసైట్ నోట్‌ను కూడా గుర్తించారు.
అయితే దీనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ కూడా తమను తాము కట్టేసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోలేరని పోలీసులు చెబుతున్నారు. సరితా దేవి అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్‌తో పాటు దూరంగా ఉంటున్న భర్తను అరెస్ట్ చేసి ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఉద్వాసనకు గురై అరెస్టయిన ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తు పూర్తవడంతో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక జడ్జి పూనమ్ చౌదరీ ఎదుట బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ రేపు జరగనుంది. రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్ కుమార్ రెండు నెలలుగా జైలులో ఉంటున్నారు. ఈ కేసులో విచారణ పూర్తికావడంతో బెయిలు కోసం కోర్టును ఆశ్రయించినట్టు సందీప్ తరపు న్యాయవాది నితిన్ అహ్లావత్ తెలిపారు.
మారుమూల ప్రాంతాలకp హైస్పీడ్ ఇంటర్నెట్
బెంగళూరు, అక్టోబర్ 25: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ స్పీడ్ అనేది కీలకంగా మారింది. ఆన్లైన్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశాల ఆర్థికాభివృద్ధిలో ఇంటర్నెట్ ప్రముఖ పాత్ర పోషిస్తోందనడంలో అనుమానం లేదు. అయితే ఈ విషయంలో నగరాలతో పాటు మారుమూల ప్రాంతాలకూ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మెట్రో నగరాల్లో హైస్పీడ్ నెట్వర్క్ అందుబాటులో ఉంటే చాలా ప్రాంతాల్లో నేటికీ 2జీ ఇంటర్నెట్ కూడా లేని పరిస్థితులున్నాయి. మరి ఈ వ్యత్యాసాల్ని తగ్గించలేమా? పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అంతటా హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందించడం సాధ్యం కాదా? ఈ ప్రశ్నకు సమాధానమే ‘ఆస్ట్రోం టెక్నాలజీస్’. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్పేస్ స్టార్టప్ ఇది. ఉపగ్రహాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ఈ స్టార్టప్ లక్ష్యం. ఇందుకు 2020లోగా 150 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ డిసెంబర్లో తొలి ఉపగ్రహం నమూనాను ఆవిష్కరించి 2018లో అంతరిక్షంలోకి పంపించనున్నట్లు సంస్థ సీఈవో నేహా సటక్ వెల్లడించారు. ఈ శాటిలైట్లతో మారుమూల ప్రాంతాల్లోనూ 50 నుంచి 400ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. డీటీహెచ్ సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లోనూ టెలివిజన్ ప్రసారాలు నిరాటంకంగా వస్తున్నాయి. అచ్చం అలాగే ఈ సంస్థ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించనుంది. అందుకోసం ఒక్కోటి 120 కిలోల బరువుండే 150 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించనుంది. అవి భూమి చుట్టూ తిరుగుతూ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తాయి. ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు గూగుల్ లూన్, ఫేస్బుక్ సోలార్ డ్రోన్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. అయితే వాటి సేవలు కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలకే పరిమితమవుతాయి. ఈ ఉపగ్రహాల ద్వారా మాత్రం ప్రపంచమంతటికీ సేవలు అందించే వీలుంటుందట.
స్వాతంత్ర్య సమరయోధుడు పాప్రికర్ కన్నుమూత
గ్వాలియర్, అక్టోబర్ 25: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ రఘునాథ్ పాప్రికర్(100) గ్వాలియర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ వర్గాలు మంగళవారం అధికారికంగా వెల్లడించాయి. పాప్రికర్ 12 సంవత్సరాల పాటు గ్వాలియర్ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగాను, 1960లో సిటీ మేయర్‌గానూ ఆయన సేవలందించారు. తండ్రి స్థానంలో ఉండి, అన్నిరంగాల్లో మాకు మార్గదర్శనం చేసే గొప్ప వ్యక్తి కోల్పోయామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పాప్రికర్కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.


