మార్పును కోరుకున్నాడు!
నమ్మడానికి కాస్త కష్టంలా ఉన్నా ఇది నిజం. సమాజంలో మార్పు ఆశించిన ఓ మేథావి ఏకంగా పేదల సేవకు ఉపక్రమించాడు. ఆచార్యుడిగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామాచేసి మారుమూల పల్లెల్లోని గిరిజనుల సేవలో తరిస్తున్న ఆ మేథావి నిన్నమొన్నటి వరకూ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్ గువురు అలోక్‌సాగర్ అంటే ఆశ్చర్యమేస్తుంది. రాజన్ లాంటి ఎందరో మేథావులను ఈ సమాజానికి అందించిన అలోక్ చివరికి తన జీవితాన్ని మాత్రం గడచిన మూడు దశాబ్దాలుగా గిరిజన గ్రామాలకు అంకితం చేశారు.
అమాయక ఆదివాసీలను సామాజికంగా చైతన్యవంతుల్ని చేయడంపై ఆయన ప్రధానంగా దృష్టిపెట్టారు. ఒంటిపై లుంగీ తప్ప కనీసం షర్టు కూడా లేని మాసిన గడ్డం, పెరిగిన జుట్టుతో కనిపించే అలోక్ రాజన్ గురువంటే మొదట్లో ఎవరూ నమ్మలేదట. చూడ్డానికి పిచ్చివాడిలా కనిపించిన ఆయన్ని గ్రామంలోని వారంతా ఏవరూ లేని అనాధ అనుకున్నారట గత ముప్పయ్యేళ్లుగా. కానీ, ఇతని జీవితాన్ని తరచి చూశాక తప్ప ఎవరికీ ఈయన గురించి అంతుచిక్కలేదు. అతని సంకల్పం, లక్ష్యం, ఆదర్శం కనీసం నేడు ఎందరినో ఆలోచింపజేస్తోంది. కేవలం మాటలు కాదు, చేతలు ఎంత కష్టంతో కూడుకున్నాయో తెలియజేస్తుంది. ఎందుకంటే, అతను పిచ్చివాడు కాదు.
ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్. ఇది మూడు దశాబ్దాల క్రితం మాట. వినడానికి విడ్డూరంగా ఉన్నా వందల మంది గొప్పగొప్ప వ్యక్తులను, విద్యావంతులనూ దేశానికి అందించిన అసాధరణ వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి ఇలా ఒంటిపై దుస్తులు లేకుండా సాధారణ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడో తెలుసుకుంటే మనలో కూడా ఆయన భావాలు ఉంటే బావుండుననిపిస్తుంది. అలోక్‌సాగర్… 1973లో ఢిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ అందుకున్నాడు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన బోస్టన్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ కూడా పూర్తిచేశాడు. ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్‌గా పనిచేసి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాడు.
అయినా ఆయన మనసులో ఏదో తెలీని వెలితి తొంగిచూసింది. రొటీన్ లైఫ్‌కు భిన్నంగా ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఆయన్ని తొలిచేసింది. ఆ ఆలోచనల క్రమం నుంచి పుట్టిన కోరికే అతన్ని వూహించని నిర్ణయం తీసుకునేలా చేసింది. అదే కోరిక ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేయించింది. ఇదంతా ఎక్కడో కొండల్లో కోనల్లో నివసించే ఆదివాసీల కోసమే అంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ, నిజం. మారుమూల పల్లెల్లో నివసించే నిస్వార్థమైన ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపి వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్న అలోక్ తన ఉద్యోగాన్ని వదులుకుని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతానికి చేరుకున్నాడు.
కనీసం విద్యుత్, రోడ్డు సౌకర్యం కూడా లేని మారుమూల గ్రామమైన కొచాముచేరుకుని అంతటి అసాధరణ వ్యక్తి సాధారణ వ్యక్తిగా అక్కడి ఆదివాసీ ప్రజల్లో ఒకడిగా మారిపోయాడు. మూడు దశాబ్దాలుగా అలాగే జీవిస్తున్నాడు. బేతుల్, హోషంగాబాద్ జిల్లాలో ఆదివాసీల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నాడు. దేశానికి సేవ చేయడం అంటే మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయడమే అని నమ్మి మూడు దశాబ్దాలుగా వారి కోసం కష్టపడుతున్నాడు. దానిలో భాగంగా ఇప్పటివరకు ఒక్కడే దాదాపు 50వేల మొక్కలు నాటాడు. ఇప్పటికీ అలోక్ సాధారణ జీవితాన్నే గడుపుతున్నాడు. కేవలం అతని దగ్గర మూడు జతల కుర్తాలు, ఓ సైకిల్ మాత్రమే ఉన్నాయి.
ప్రతిరోజు ఆ సైకిల్‌పైనే తిరుగుతూ విత్తనాలు సేకరిస్తూ మారుమూల ప్రాంతాల ప్రజలకు అందిస్తున్నాడు. ఇటీవల బేతుల్ జిల్లాలో జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటన అతను ఎవరనే విషయం అక్కడి ప్రజలకు తెలిసేలా చేసింది. ఎన్నికల సమయంలో అధికారులు అలోక్ విషయంలో దురుసుగా ప్రవర్తిస్తే తాను ఎవరు? ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాడు? విద్యార్హతలు ఏంటన్న విషయాన్ని వెల్లడించాడు. అవి చూసి అక్కడి అధికారులు కూడా నమ్మలేదు. కానీ అతను చెప్పిన వివరాలపై విచారించిన మీదట నిజం తెలుసుకుని విస్తుపోయారు.
ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడిగితే ‘‘దేశంలో ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. కానీ, చాలామంది ప్రజలకు సేవ చేయడం మరచి తమ సర్టిఫికెట్స్ చూపించుకునేందుకే వారి తెలివితేటలను ఉపయోగిస్తున్నారు’’ అని అంటున్నాడు అలోక్. మంచి ఉద్యోగం, విలాసవంతమైన జీవితం వదిలి సాధారణ వ్యక్తిలా కనీస సౌకర్యాలు లేని సామాన్యుల కోసం చేస్తున్న అతని కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.


