మిలీనియం ఆప్టిట్యూడ్ టెస్ట్ అవార్డుల ప్రధానం
యువతరం నైపుణ్యాలను పెంపొందిచుకోవడం ఎంతో అవసరమని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు అన్నారు. ఏయూ అంబేద్కర్ అసెంబ్లీ మందిరంలో ఏయూ దుర్గాబాయి దేశముఖ్ అధ్యయన కేంద్రం, మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నిర్వహించిన మిలీనియం ఆప్టిట్యూడ్ టెస్ట్ 2016 అవార్డుల ప్రధానోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీతత్వం అలవరచుకుని పోటీ పడటం ఎంతో ప్రథామన్నారు. పరిశ్రమకు అవసరమైన సామర్ధ్యాను విద్యార్థులు కలిగి ఉండాలన్నారు.
ఇటువంటి యువతకు ప్రోత్సహించే కార్యక్రమాలను భవిష్యత్తులో సైతం నిర్వహించాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన శిక్షణ అందిస్తూ, ఉచిత వసతి కల్పనకు వర్సిటీ కృషిచేస్తోందన్నారు. దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంచాలకురాలు ఆచార్య బి.రత్నకుమారి మాట్లాడుతూ భారత దేశ భవిత యువత చేతిలో ఉందన్నారు. తమ కేంద్రం మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సౌజన్యంతో 2007 సంవత్సరం నుంచి 3 వేల మంది మహిళలకు కంప్యూటర్ శిక్షణ అందించిందన్నారు.
భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే దిశగా యువతను సిద్దం చేస్తున్నామన్నారు. విశిష్ట అతిధి మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సిఈఓ లోకం ప్రసాద్ మాట్లాడుతూ సాంకేతిక ప్రగతి దశలో ఉన్న యువతరం అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని మార్చగలమనే బలమైన ఆకాంక్షతో సాగిపోవాలన్నారు. విద్య వ్యక్తి జీవనంలో ఎంతో మార్పును తీసుకువస్తుందన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వ్యక్తి తనలో మార్పును స్వాగతించాలన్నారు. ప్రపంచానికి అవసరమైన సాఫ్ట్వేర్ నిపుణులను భారత్ అందిస్తోందన్నారు.
నిబద్దత, ఆత్మవిశాస్వసం, కష్టించి పనిచేసే తత్వం విద్యార్థులు కలిగి ఉండాలన్నారు. మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సిఈఓ జి.శ్రీధర రెడ్డి మాట్లాడుతూ కేవలం వారం రోజుల వ్యవధితో నగరంలోని 5 వేల మంది విద్యార్థులు ఎంఏటి పరీక్షకు దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. ఎంతో ప్రతిభతో వీరు పరీక్షలో స్థానాలను సాధించారన్నారు.
వర్సిటీలో విభిన్న ప్రతిభా వంతులకు అవసరమైన శిక్షణ ఇచ్చి, నేడు సర్టిఫీకేట్లు ప్రధానం చేస్తున్నామన్నారు. అనంతరం మొదటి 15 స్థానాలలో నిలచిన వారికి ల్యాప్టాప్లు, టాబ్లు, స్మార్ట్ఫోన్లు ప్రధానం చేశారు. విభిన్న ప్రతిభా వంతులకు సర్టిఫీకేట్లు, ఎంఏటి పరీక్షలో మొదటి 500 స్థానాలలో నిలచిన వారికి సర్టిఫీకేట్లు ప్రధానం చేశారు. కార్యక్రమంలో మానస చేసిన తాండవ గణపతి నృత్యం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆచార్య బి.రత్నకుమారిని సత్కరించారు.


