ముగిసిన అంతర్ డిగ్రీ కళాశాలల క్రీడాపోటీలు
అనంతపురం: గుంతకల్లు పట్టణంలోని స్థానిక ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్ డిగ్రీ కళాశాలల క్రీడాపోటీలు ముగిశాయి. ఫుట్బాల్లో అనంతపురం విజయం సాధించగా, ఖోఖోలో గుంతకల్లు విజేతగా నిలిచింది. విజయాలు సాధించిన క్రీడాకారులు ఓడినవారిని అభినందించడం క్రీడాస్ఫూర్తికి దోహదం చేస్తుందని మున్సిపల్ అధ్యక్షులు అపర్ణ, ఎస్.కె. యూనివర్శిటీ క్రీడాధికారి జెస్సీ అన్నారు. బహుమతుల ప్రదానోత్సవానికి వారు హాజరయ్యారు.
కళాశాలకు మంచి రోడ్డును ఏర్పాటు చేయడానికి, కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అపర్ణ సభలో ప్రకటించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జ్ఞానేశ్వర్, ఫిజికల్ డైరెక్టరు జయలక్ష్మి, లెక్చరర్లు జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఖోఖోలో గుంతకల్లు ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ద్వితీయ బహుమతిని ఉరవకొండ ప్రభుత్వ కళాశాల జట్టు సాధించింది. ఫుట్బాల్ తుదిపోరు శనివారం అనంతపురానికి చెందిన ఆర్ట్స్ కళాశాల, పి.వి.కె.కె. జట్ల మధ్య జరిగింది.
పోటీలో 3-0 గోల్స్ తేడాతో ఆర్ట్స్ కళాశాల జట్టు ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీని అందుకుంది. పి.వి.కె.కె. కళాశాల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. షటిల్ పోటీలో అనంతపురం ఎస్.ఎస్.బి.ఎన్. జట్టు ప్రథమ బహుమతిని, బుక్కపట్నం కళాశాల జట్టు రెండో బహుమతిని అందుకున్నాయి.


