మున్సిపల్ కార్యాలయం ఎదుట తెదేపా ధర్నా
- 94 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): వినాయక చవితి పండుగ సందర్భంగా కాగజ్‌నగర్ మండలంలోని పలు చౌరస్తాల్లో తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై, టీడీపీ నాయకులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తెరాసకు సంబంధించిన ఫ్లెక్సీలు నెలల తరబడి వున్నా వాటిని తొలగించకుండా తెదేపా ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడంపై ఆ పార్టీ నాయకులు అభ్యంతరం తెలుపుతూ ఆందోళన చేశారు. తొలగించిన ఫ్లెక్సీలను తిరిగి ఏర్పాటు చేస్తామని బల్దీయా అధికారులు భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సంతోష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, కడెం మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన దళితులు మంగళవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసన తెలిపారు. ‘దళిత బస్తీ’ పథకం కింద ఇచ్చిన భూములను అర్హులైన వారికి కాకుండా ఇష్టారీతిన లబ్ధిదారులను ఎంపిక చేశారని నిరసిస్తూ దళితులు తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు. సోమవారం కూడా కార్యాలయం ఎదుట కొద్దిసేపు బైఠాయించి సెలవు కావటంతో తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఉపాధ్యాయదినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది.
ఇందులో జెన్నారం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాజమౌళి, నిర్మల్ జిమ్మెరాత్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మోహనరావు, జైనత్ మండలం అంకోరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.సంతోష్‌కుమార్ రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ నెల 8న హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమంలో వీరికి పురస్కారాలు అందజేసి సన్మానం చేయనున్నారు. జిల్లా నుండి రాష్ట్రస్థాయిలో ఎంపికైన ముగ్గురు ఉపాధ్యాయులను పలు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు అభినందనలు తెలిపారు.


