మెక్సికోలో మరో పెను విషాదం
- 66 Views
- wadminw
- December 22, 2016
- అంతర్జాతీయం
మెక్సికోలో మరో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో 29మంది మృతిచెందగా, మరో 70 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మెక్సికో, టల్టెపెక్ బాణాసంచా మార్కెట్ కి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఇంతలోనే భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. మార్కెట్లోని బాణాసంచా దుకాణాలతో పాటు సమీపంలోని ఇళ్లు, వాహనాలు, ఇతరత్రా ఆస్తులు దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. తొలుత తొమ్మిది మంది చనిపోయారని ప్రకటించిన మెక్సికో ఫెడరల్ పోలీసులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మార్కెట్లో ప్రమాదంపై మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెన నియోటో దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, వారికి అధికారులు అన్ని రకాల సాయం చేస్తారని చెప్పారు.


