మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటుకు సర్వం సన్నద్దం
- 90 Views
- wadminw
- September 22, 2016
- రాష్ట్రీయం
మెదక్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక అద్దె భవనాలను ఎంపిక చేసింది. దీని కోసం ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఐజి కృష్ణాప్రసాద్ సందర్శించారు. మెదక్ మండలం పిల్లికోట్టాల వద్ద గల రాయల్ డిగ్రి కాలేజ్‌ను కలెక్టరేట్ భవణంగా నిర్ణయించారు. మెదక్ పట్టణంలోని చారీ ఆసుపత్రి భవనాన్ని ఎస్పీ కార్యాలయముగా నిర్ణయించారు. ఆయా అధికారుల వసతి గృహాలను మండల పరిధి మాచవరం గ్రామంలో ఎంపిక చేశారు. ఈ కార్యాలయాలు వచ్చే ధసర నుండి పూర్తి స్థాయిలో పని చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గుర్తించినకార్యాలయాలకు రంగులు వేసి ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నారు. మెదక్ జిల్లా గా 60 సంవత్సరాలుగా ఉన్న జిల్లా కేంద్ర కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయకపోవడంతో మెదక్ ప్రాంత వాసులు గత సంవత్సరాలుగా ఉద్యమాలు చేశారు.స్వచ్చందసేవకుడు రాందాస్ అమరణ దీక్ష చేసిన చరిత్ర ఉంది.
గత ఎన్నికల ముందు టీఆర్‌యస్ అదినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచార సభలో జిల్లా కేంద్రము ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. జిల్లా సాధన సమితి ఆద్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. అనంతరం ఇక్కడ ఉద్యమం ఉదృతి సందర్బంగా మెదక్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి హోదలో మెదక్ జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేస్తానని రెండవ సారి హమీ ఇచ్చారు. ఈ మేరకు పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా నూతన జిల్లాల ఏర్పాటు పురస్కరించుకోని 14 మండలాలతో మెదక్ జిల్లా ఏర్పాటు ముసాయిద ప్రకటించారు.దాంతో ఇక్కడి ప్రజల అకాంక్ష పూర్తి కాలేదని ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూచనలు , పిర్యాదులకు మండలాలను పెంచాలని డిమాండ్ చేశారు. మెదక్, అందోల్, నర్సాపూర్ నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తే బావుంటుందని ప్రజలు కోరుతున్నారు.
జిల్లా ప్రకటించి నందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారలు రమణచార్యులు, మెదక్ పట్టణ ప్రజలు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే . రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పేరు చిరస్థాయిగా మెదక్ జిల్లా చరిత్రలో నిలిచిపోనున్నది. ఇదిలావుండగా, గతంలో ఎంతోమంది ప్రముఖులు ప్రాతినిథ్యం వహించిన రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు పట్టణ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సుమారు 20 నిమిషాల పాటు స్థానిక కళాశాలల విద్యార్థులతో కలిసి రహదారిపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా తెదేపా, భాజపా, కాంగ్రెస్, విద్యార్థి సంఘాల నాయకులు యాదగిరి, సిద్దిరాములు, అమరసేనారెడ్డి, కుమార్‌సాగర్, రమేష్ మాట్లాడారు. గతంలోనే రామాయంపేట నియోజకవర్గాన్ని కోల్పోగా ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటిగా తరలిపోతున్నాయన్నారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా, నిజాంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేసేవరకు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు. 23న పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలని కోరారు. సీఐ నందీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో రామాయంపేట, చేగుంట ఎస్ఐలు నాగార్జునగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులుతో పాటు సిబ్బంది రాస్తారోకోను విరమింపచేశారు. ముత్యంరెడ్డి, పోశయ్య, ఎల్లం, గంగారాం, అహ్మద్, లక్ష్మణ్, సుధాకర్‌రెడ్డి, కృష్ణ, శ్రీనివాస్, రమేష్, హన్మంతరావు, లక్ష్మీనర్సింలు, కిషన్, శ్రీకాంత్‌గౌడ్, హాజీ, రాములు, యాదగిరి, సర్పంచి సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ స్వామి పాల్గొన్నారు.
మెదక్ సురక్షకు మూడో నేత్రం
నిఘా కట్టుదిట్టానికి సీసీ కెమేరాలు
మెదక్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): పట్టణ సురక్షణకు ప్రధానప్రాంతాలలో నిఘా నేత్రాలను అమర్చారు. పట్టణ ప్రధాన రహాదారులపై సీసీ కెమరాలను భిగించి స్థానిక పోలీసు స్టేషన్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పట్టణంలో కొత్తబస్టాండ్ , పోలీస్‌స్టేషన్ , రాందాస్ చౌరాస్థా , పాతబస్టాండ్, డిగ్రికాలేజ్,సీసీ కెమారాలను భిగించి ఆయా ప్రాంతాలను ఎప్పటికస్పుడు పరిశీలిస్తున్నారు.. పట్టణంలో రహదారి ప్రమాదాలతో పాటు దోంగతనాల నివారణకు సహకరిస్తాయి. సుమారు ఏడు లక్షల రూపాయలు దాతల సహాకారంతో ఇవి ఏర్పాటు చేశారు. అదునాతన టేక్నాలజి సీసీ కెమరాలతో ఏర్పాటు చేయడంతో వైర్‌లైస్ సహాయంతో అవి పని చేస్తున్నాయి. మధ్యం తాగి వాహనాలు నడిపే వారిని, మ్రాదాలకు గురిచేసిన వారిని, దొంగతనాలకు పాల్పడినవారిని సులువుగా గుర్తించవచ్చునని సిఐ తెలిపారు.మెదక్ పట్టణ వ్యాప్తంగా సీసీ కెమారాల ఏర్పాటుకు 20 లక్షల రూపాయలు బడ్జుట్ అవసరముందని తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే అవి ఏర్పాటు చేస్తామని సిఐ తెలిపారు. కాగా, సంగారెడ్డి భవాని భువనేశ్వరి ఆలయంలో శతఛండీ మహాయాగం ఘనంగా జరుగుతోంది. 3వ రోజు గురువారం రాంపురం పీఠాధిపతి మాధవానంద సరస్వతి నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పురపాలక సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట సీడీసీ అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి, ఏఎంసీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి తదితరులున్నారు.
ఎస్ఐ ఆత్మహత్య కేసుపై హైకోర్టులో విచారణ
మెదక్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): కుకునూరుపల్లి ఎస్.ఐ. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య కేసుపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఆయన సూసైడ్ నోట్ ఆధారంగా డీఎస్పీ, సీఐలపై కేసు నమోదు చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ కేసును సీబీఐ చేత విచారణ జరపాలని రామకృష్ణారెడ్డి భార్య కోర్టును కోరింది. హైకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. డీఎస్పీ శ్రీధర్, సీఐలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు గత వారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ఉన్నతాధికారులపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. డీఎస్పీ, సీఐ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు రామకృష్ణారెడ్డి సూసైడ్ నోట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు, విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతిచెందిన సంఘటన చేగుంటలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానిక వీరబ్రహ్మేంద్ర సినిమా థియేటర్ కూల్చివేతను యాజమాన్యం ప్రారంభించింది. ఇందులో భాగంలో అందులో ఉన్న విద్యుత్తు సరఫరాను తొలగించే పనులు హైదరాబాద్‌లోని మోతినగర్‌కు చెందిన అఫ్రోద్దిన్(35) చేపట్టారు. ప్యానల్ బోర్డు వెనకాల సరఫరాను తొలగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆయన విద్యుదాఘాతానికి గురయ్యారు. అక్కడే మిగతా పనులు చేస్తున్న వ్యక్తులు అతనిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు స్థానిక ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


