మొవ్వ మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా చౌదరి బాబు
- 79 Views
- wadminw
- January 5, 2017
- Home Slider రాష్ట్రీయం
విజయవాడ: మొవ్వ మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా తుమ్మల చౌదరిబాబు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి రాజశేఖర్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు అందినట్లు చౌదరి బాబు మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈయన నియామకం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కమిటీ వైస్ ఛైర్మన్‌గా తనూజ, సీతారామాంజనేయులు, మోహన్‌బాబు, మస్తాన్‌రావులతో పాటు 15 మంది సభ్యులుగా నియమితులయ్యారు.
కాగా, కాపు రిజర్వేషన్ సాధికార విభాగం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా పెదకళ్లేపల్లి గ్రామానికి చెందిన గోళ్ల వెంకటసుబ్బారావు నియమితులైనట్లు అవనిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు నుంచి నియామక ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. నియామక పత్రాలను మంగళవారం జరిగిన కార్యక్రమంలో సుబ్బారావుకు అందించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు, శివాజీ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు జోక్యంతో పరిస్థితులు తారుమారు
సీఎం వరకూ వెళ్లిన సచివాలయ క్యాంటిన్ వివాదం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో క్యాంటిన్ కహానీ నడుస్తోంది. ఈ వ్యవహారం అటు తిరిగీ, ఇటు తిరిగీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరకు వెళ్ళింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ మంత్రి నారాయణ క్యాంటిన్ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో విషయం చంద్రబాబు కోర్టుకు చేరింది. చివరికి ఆయన జోక్యంతో పరిస్థితులు తారుమారయ్యాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో క్యాంటిన్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. సచివాలయ ఉద్యోగుల సంఘం, సీఆర్డీఏ మధ్య తలెత్తిన ఈ వివాదం చివరికి ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లింది. చిక్కు ముడిగా మారిన ఈ వ్యవహారంపై అధికార వర్గాల్లో హాట్‌హాట్ టాపిక్‌గా మారింది. వెలగపూడి సచివాలయం ఆరు లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఇందులో ఆరు బ్లాకులలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం సచివాలయ ఉద్యోగుల సంఘం ఒక క్యాంటిన్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో ఉద్యోగులకు యాభై రూపాయలకే భోజనం అందిస్తున్నారు. బయటి వ్యక్తులకు అయితే భోజనానికి అరవై రూపాయలు తీసుకుంటున్నారు. సచివాలయం సమీపంలో అన్న క్యాంటీన్ మినహా మరేది లేకపోవటంతో ఉద్యోగులు, వివిధ పనులపై సచివాలయానికి వచ్చిన సందర్శకులు ఈ క్యాంటిన్‌లోనే భోజనం, ఫలహారాలు చేస్తున్నారు. ఇదే సమయంలో సచివాలయంలో సీఆర్డీఏ మరో క్యాంటిన్‌ను నెలకొల్పింది. ఇందులో పది రూపాయలకే పెరుగన్నం, పదిహేను రూపాయలకు వెజ్ బిర్యానీ, సాంబార్ రైస్ ఇస్తున్నారు. పైగా ఈ క్యాంటిన్ పరిశుభ్రంగానూ, ఆహారపదార్ధాలు రుచికరంగానూ ఉండటం బాగా కలిసివచ్చింది. సచివాలయ ఉద్యోగులంతా ఈ భోజనం కోసం ఎగబడ్డారు. ఫలితంగా సచివాలయ ఉద్యోగుల సంఘం ఏర్పాటుచేసిన క్యాంటిన్ వెలవెలపోయింది. సబ్సిడీ రేట్లతో ఏర్పాటుచేసిన సీఆర్డీఏ క్యాంటిన్ తక్కువ కాలంలోనే అందరి ఆదరణ చూరగొన్నది. రానురాను ఇక్కడికి వచ్చేవారి సంఖ్య పెరిగింది. దీంతో మరో క్యాంటిన్ కూడా ఏర్పాటుచేయాలని ఉద్యోగుల నుంచి సీఆర్డీఏపై వత్తిడి పెరిగింది. మూడో రోజుకల్లా సచివాలయ ఉద్యోగుల సంఘం ఎంట్రీ ఇచ్చింది. సచివాలయంలో తాము ఏర్పాటుచేసిన క్యాంటిన్ కాకుండా మరో క్యాంటిన్ ఉండటానికి వీలులేదని భీష్మించింది. సీఆర్డీఏ క్యాంటిన్‌ను మూసివేయించింది. అయితే ఈ పరిణామంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఉద్యోగుల సంఘంపై విమర్శలు కూడా పెరిగాయి. ఈ వ్యవహారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ మంత్రి వరకు వెళ్ళింది. ఈ అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు చెవిన కూడా వేశారు. తక్కువ ధరకు భోజనం పెడుతుంటే, అడ్డుపడాల్సిన అవసరం ఏముందని ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ప్రశ్నించారట కూడా! చివరికి ఈ వ్యవహారంలో మరో కోణం కూడా ఉంది. సీఆర్డీఏ ఏర్పాటుచేసిన క్యాంటిన్ బాగుండటం, తక్కువ ధరకే రుచికరమైన భోజనం అందించడంతో ఇటువంటి క్యాంటినే తమకు కూడా ఏర్పాటుచేయాలని ఏపీఎన్జీఓ సంఘం నేతలు ముఖ్యమంత్రిని కోరారు. ఏపీఎన్జీఓ సంఘ అధ్యక్షులు అశోక్‌బాబు నేతృత్వంలో వారు సీఎంను కలిసి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఇబ్రహింపట్నంలోని ప్రభుత్వ కాంప్లెక్స్, గొల్లపూడిలోని శాఖాధిపతుల కార్యాలయాల వద్ద ఇటువంటి క్యాంటిన్లను ఏర్పాటుచేయాలని సూచించారు. వెంటనే సీఆర్డీఏ అధికారులకు సీఎంఓ నుంచి క్యాంటిన్లు ఏర్పాటుచేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకవైపు ఏపీఎన్జీఓలు సీఆర్డీఏ క్యాంటిన్లు కావాలని కోరుతుంటే, మరోవైపు సచివాలయంలో ఆ క్యాంటిన్‌ను తొలగించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయ ఉద్యోగులు కూడా బహిరంగంగానే మంచి భోజనం కూడా తిననివ్వరా? అంటూ నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే తాము కూడా తక్కువ ధరకే భోజనం అందిస్తామని సచివాలయ ఉద్యోగుల సంఘం చెబుతోంది. చూద్దాం వచ్చే రోజుల్లో క్యాంటిన్ల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో!
కనకదుర్గమ్మకు ఘనంగా గాజుల ఉత్సవం
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వేలిసి కనకదుర్గమ్మకు మంగళవారం గాజుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇప్పటి వరకు ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు, శాకంబరి, పవిత్రోత్సవలు అమ్మవారికి నిర్వహించారు. కాగా మంగళవారంనాడు ప్రప్రధమంగా అమ్మవారికి గాజుల ఉత్సవాన్ని నిర్వహించారు. తొమ్మిది రకాల గాజులతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దుర్గమ్మ దర్శనం కల్పించారు. కనకదుర్గమ్మను దర్శించుకునేందకు భక్తులు పోటెత్తారు. కాగా ఈ ఉత్సవానికి అనుకున్న ప్రచారం జరగనన్నందున ఆశించిన మేరకు భక్తులు రాలేదని ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఇక నుండి గాజుల ఉత్సవాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి సూర్యకుమారి మంగళవారం ఇక్కడ తెలిపారు. ఉత్సవాల కోసం గాజులను సిద్ధం చేస్తామని ఆమె వెల్లడించారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఈనెల 31 నుంచి నవంబరు 28వ తేదీ వరకు మల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు, కార్తీక మాసంలో ఐదు సోమవారాలు వచ్చాయి. అక్టోబరు 31, నవంబరు 7, 14 (సోమవారం – పౌర్ణమి), 21, 28 తేదీల్లో వచ్చే సోమవారాలతో పాటు నవంబరు 10 (గురువారం- శుద్ద ఏకాదశి), 25 (శుక్రవారం – బహుళ ఏకాదశి), 27 (ఆదివారం- మాస శివరాత్రి) తేదీలలో మల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కార్తీకమాసం సందర్భంగా లక్ష బిల్వార్చన రోజుకు రూ.2 వేలు, సహస్ర లింగార్చన రోజుకు రూ.500, సహస్ర లింగార్చన నెల రోజులకు రూ.5,116, రుద్రహోమం రోజుకు రూ.వెయ్యిగా టికెట్టు ధర నిర్ణయించారు. వీటితో పాటు ప్రతి నిత్యం సాయంత్రం 6.30 గంటలకు ఊంజలసేవ నిర్వహించనున్నారు. ఊంజల సేవ టిక్కెట్టు ధర రూ.50గా నిర్ణయించారు. ఈ సేవలో దంపతులను అనుమతిస్తారు. గంగా, పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్లకు శాంతి కల్యాణము, పౌర్ణమి రోజున అన్నాభిషేకం, ప్రతిరోజు సాయంత్రం సహస్రదీపాలంకరణ జరగనున్నాయి. పరోక్షంగా పూజలు చేయించుకునే భక్తులు ఆనలైన ద్వారా నగదు చెల్లించి తమపేర్లను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇతర సమాచారం కోసం టోల్ ఫ్రీ నం: 1800 425 9099లో సంప్రదించాలన్నారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 28న మహాలక్ష్మీ యాగం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టిక్కెట్టు ధరను రూ.3,116గా నిర్ణయించారు. మీసేవా కేంద్రాలతో పాటు దేవస్థాన ఆర్జిత సేవా కౌంటర్, దుర్గమ్మ డాట్కామ్లోనూ టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఒక టికెట్టుపై ఇద్దరిని మాత్రమే యాగశాలలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువై ఉన్న శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయంలో నవంబర్ మూడున నాగులచవితి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ శారదాకుమారి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆహ్వాన గోడపత్రికలను దేవాలయ ప్రాంగణంలో ఆమె ఆవిష్కరించారు. నాగులచవితి రోజున స్వామి వారికి నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక రుసుముతో అంతరాలయ దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు పాలు ఉచితంగా అందిస్తామని, భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆమె అన్నారు.


