మోసపూరిత విధానాలకు స్వస్థి పలకండి: వైకాపా
- 91 Views
- wadminw
- September 9, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ శనివారం తలపెట్టే రాష్ట్ర బంద్‌కు భేషరతుగా మద్దతివ్వాలని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు విమర్శించారు. విభజన చట్టాన్ని విస్మరించి ఏవేవో చేసుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం గుడ్లప్పగించి చూడటం సరికాదన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్లో ప్రత్యేక హోదా మాత్రమే ఈ రాష్ట్రానికి సరైన విరుగుడని, అది మాత్రమే కావాలని పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన సారధ్యం వహించారు. ఈ సందర్భంగా సర్పవరం జంక్షన్లో దాదాపు గంట సేపు బైఠాయింపు జరిపారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 90 ప్రకారం విభజన చట్టంలోని పాత హామీలన్నీ ఇచ్చి తీరాల్సిందేనన్నారు. పైగా అప్పుడే చెప్పిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఇతర అంశాలు ఇస్తానంటూ చేసిన వాగ్ధానాలు ఇప్పుడు కొత్తగా చెప్పడాన్ని చంద్రబాబు ఎలా సమర్ధించుకుంటారన్నారు. అర్ధరాత్రి మంతనాలు జరుపుతూ రాష్ట్ర ప్రజలకు చీకట్లో ఏం జరుగుతుంతో తెలియకుండా చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా తాను వెళ్లి హోదాకు సంబంధించిన అంశంపై పట్టుబట్టి ముక్కుపిండి చేయించుకోవాల్సింది పోయి సాదాసీదా మంత్రులను పంపి చంద్రబాబు ఏం సాధిద్దామని తలపోస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.
మంత్రివర్గంలో సుజనా చౌదరి, అశోక్ గజపతి సభ్యులేనన్న విషయం ప్రజానీకానికి తెలుసని, క్యాబినెట్ సమావేశంలో మోడీ ఏం చేయబోతున్నారో తెలిసీ కూడా ఏం ఎరగనట్టు చంద్రబాబు చెబుతుంటే వారేదో చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం సరి కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కార మార్గంగా పేర్కొంటూ ఇందుకు అనుగుణంగా శనివారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను పార్టీలకు అతీతంగా మద్ధతు పలికి విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా జగన్ ఎప్పుడడిగినా ప్రత్యేక హోదాయే అడిగారని, అందుకోసం దీక్షలు సైతం చేసిన రోజులు తెలుగుదేశం పార్టీ మరిచిపోయిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర నాయకులు ఫ్రూటీకుమార్, అక్బర్ నజీమ్, లింగంపల్లి రవి, రావూరి వెంకటేశ్వరరావు, కోమలి సత్యనారాయణ, బాలాజీ, కడియాల చిన్నా, నక్కా సతీష్, మేడిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


