మోస పూరిత వాగ్దానాల ముఖ్యమంత్రి కేసీఆర్: తమ్మినేని
- 84 Views
- wadminw
- December 15, 2016
- తాజా వార్తలు
ఆదిలాబాద్, డిసెంబర్ 14 (న్యూస్‌టైమ్): అట్టడుగు వర్గాల వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సీపీఎం మహాజన పాదయాత్రలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా కోమరంభీం, అంబేద్కర్ విగ్రహాలకు ఆయన నివాళురల్పించారు.
అనంరతం స్థానిక అంబేద్కర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, సామాజిక, భౌజన తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసమే సీపీఎం మహాజన పాదయాత్ర చేపట్టిందని అన్నారు. ఎన్నికల్లో దళిత, భౌజనులను మోసగించి మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వారి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఈ పాదయాత్ర ద్వారా ప్రజల స్థితిగతులు, సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని ప్రభుత్వానికి విన్నవిస్తామని అన్నారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్రూమ్, ఇంటికొక ఉద్యోగం, రైతులకు న్యాయం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇంత వరకు అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. నిజాం కాలంలో భూమి కోసం పోరాడిన తాము, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం గత 60 సంవత్సరాలుగా కృషి చేసిన చరిత్ర తమ పార్టీదని అన్నారు.
రాష్ట్రంలో 93 శాతం అట్టడుగు వర్గాల వారి సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరస సంవత్సరాలలో రాష్ట్రానికి చేసింది, ప్రజలకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సీఐటీయు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, సీఐటీయు, సీపీఎం నాయకులు పాదయాత్రకు స్వాగతం పలికారు.


