మౌలిక వసతులు మరింత అవసరం: వెంకయ్య
- 84 Views
- wadminw
- September 14, 2016
- అంతర్జాతీయం
విశాఖపట్నం, సెప్టెంబర్ 14 (న్యూస్‌టైమ్): పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని మౌలిక సదుపాయాలు మరింతగా కల్పించుకోవాల్సిన అవసరం చాలా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు విశాఖ నగరంలో జరగనున్న బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో వెంకయ్య ప్రారంభోపన్యాసం చేయగా, ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేశారు. ప్రజలంతా పట్టణాలవైపు పరుగులు తీస్తున్నారని, ప్రస్తుత పరిస్థితిలో పట్టణీకరణ తప్పనిసరైందని వెంకయ్య అన్నారు.
పట్టణీకరణలో ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్ల అంశాల్లో బిక్స్ దేశాల మధ్య పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఆయన అన్నారు. దేశంలో పట్టణాభివృద్ధి కోసం చేపట్టిన స్మార్ట్ సిటీలు, స్వచ్ఛ భారత్, అమృత వంటి పథకాల లక్ష్యాలను వెంకయ్య వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టణీకరణ తప్పనిసరైందని, ప్రజలంతా పట్టణాల వైపే పరుగులు తీస్తున్నారని, పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పించడమే మన ముందున్న ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ‘పట్టణాలు – పెట్టుబడులు – నగర నిర్మాణం – సవాళ్లు’ అనే అంశంపై బ్రిక్స్ సదస్సులో చేపట్టిన చర్చ సందర్భంగా వెంకయ్య ప్రసంగించారు.
పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవడమే అజెండాగా బ్రిక్స్ సదస్సు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. భారత్‌లో 32శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారని, జీడీపీలో 85శాతం ఆదాయం పట్టణాల నుంచే వస్తోందన్నారు. బ్రెజిల్లో ఏకంగా 84శాతం మంది ప్రజలు పట్టణాల్లోనే నివసిస్తున్నారని వెల్లడించారు. జీ-20లో బ్రిక్స్ దేశాలు చాలా బలంగా ఉన్నాయని, క్లిష్టమైన అంశాల్లో ఈ దేశాల మధ్య పరస్పర సహకారం అత్యవసరమని పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ‘రక్షణరంగ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో అవకాశం’ అనే అంశంపై ఆయన మాట్లాడారు.
దీనిలో భాగంగా రష్యాకు చెందిన నౌక నిర్మాణ పరిశ్రమ విశాఖలో ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రక్షణ రంగంలో రష్యా చాలా బలంగా ఉందన్నారు. రష్యా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని, ఇరు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉందన్నారు. సాంకేతిక వినియోగంలో రష్యా చాలా ముందుందని పేర్కొన్నారు. విశాఖ దేశంలోనే సుందరమైన నగరమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక సంస్థల్లో ఏపీ నుంచి వెళ్లిన వారున్నారని, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలుగువారేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
2050 నాటికి ప్రపంచంలోని అత్యధిక జనాభా పట్టణాల్లోనే ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీని సాంకేతికంగా అన్నీ రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టేందుకు చేస్తున్న కృషిని ఆయన సదస్సులో వెల్లడించారు. పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని కేంద్రం స్వచ్ఛ భారతను ప్రవేశపెట్టిందని అన్నారు. దేశంలో తొలిసారిగా భవనాల అనుమతిని ఆన్లైన్లో ఇస్తున్నామని బాబు తెలిపారు. సీసీటీవీ కెమెరాలను అన్ని నగరాల్లో విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. భవిష్యత్‌లో పట్టణీకరణదే ప్రధాన పాత్ర అని, పట్టణీకరణంలో మౌలిక సదుపాయల కల్పన సవాళ్లతో కూడినదని, పట్టణాల్లో మురికివాడల నిర్వహణ మరింత సవాళ్లతో కూడినదని అన్నారు.
భారత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, భారత్ వృద్ధిరేటు, పెరుగుదల కూడా బాగుందని, ప్రస్తుతం భారత్ వృద్ధి రేటు 7.5 శాతంగా ఉందని చంద్రబాబు చెప్పారు. సమీప భవిష్యత్‌లో ఇది డబుల్ డిజిట్‌కు చేరుతుందని అన్నారు. 2050 నాటికి ప్రపంచంలోని అత్యధిక జనాభా పట్టణాల్లోనే ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టనీకరణను దృష్టిలో పెట్టుకుని కేంద్రం స్వచ్ఛభారత్‌ను ప్రవేశపెట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో పట్టణీకరణే కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. పట్టణీకరణలో ప్రధానంగా కాలుష్యం, మురికవాడల సమస్య ఎదురవుతోందన్నారు. గతంలో పట్టణ ప్రణాళిక సక్రమంగా లేకపోవడం వల్ల సమస్యలు రెట్టింపు అవుతున్నాయన్నారు.
పట్టణీకరణను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆర్థిక వృద్ధిరేటు వేగం పుంజుకుందని చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోదీ విదేశాల్లో తిరుగుతూ దేశాభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. 2050 నాటికి ప్రపంచంలోని అత్యధిక జనాభా పట్టణాల్లోనే ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పట్టణీకరణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఈ సమ్మేళనంలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమర్ సిన్హా, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా, ఏపీ సీఎస్ ఎస్పీ టక్కర్ తదితరులు హాజయ్యారు. బ్రిక్స్ దేశాలనుంచి 322 మంది ప్రతినిధులు తరలివచ్చారు. బ్రిక్స్ దేశాల్లోని నగరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వీటి పరిష్కారంలో ఆయా దేశాలు అనుసరిస్తున్న వ్యూహాలు, అనుసరణీయమైన పద్ధతులపై ఈ సదస్సులో నిర్ణయం తీసుకోనున్నారు. అధిక జనాభా, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, కాలుష్యం, గృహ వసతి అంశాలపై కీలక చర్చలు చేపట్టనున్నారు.


