మ్యాడ్మాక్స్ టీ20 ప్రీమియర్ లీగ్ విజేత వడియార్
మ్యాడ్మాక్స్ టీ20 ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో వడియార్ జట్టు ఘన విజయం సాధించింది. 37 పరుగుల తేడాతో ఆ జట్టు రాణి చెన్నమ్మ టీమ్‌పై గెలుపొంది ట్రోఫీని సొంతం చేసుకుంది. స్థ్థానిక ఆదిత్య గ్లోబల్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వడియార్ జట్టు కెప్టెన్ భరణికాన శ్రవణ్‌కుమార్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో బ్యాటింగ్ చేసిన వడియార్ జట్టు 150 పరుగులు చేసింది. వడియార్ జట్టు బ్యాటర్లు నవీన్ (33), నాగేంద్ర (30), పవన్(20), రాకేష్ (20) పరుగులు చేశారు.

రాణి చెన్నమ్మ జట్టు బౌలర్లలో మురళీ, మంజునాధ్, పూర్ణ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాణి చెన్నమ్మ జట్టుకు వడియార్ జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. ఆ జట్టులో మురళీ ఒక్కడే 46 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా అతనికి ఇతర బ్యాట్స్మెన్ల నుంచి సహకారం లేకపోవడంతో ఆ జట్టు 113 పరులకే కుప్ప కూలిపోయింంది. ఈ మ్యాచ్‌లో కిషోర్ నాలుగు వికెట్లు, అశ్వత్ 2 వికెట్లు పడగొట్టారు. నాలుగు వికెట్లు తీసిన కిషోర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

కాగా వడియార్ జట్టు సభ్యులందరూ తమ ఇంటి మాతృమూర్తులకు, శ్రీమతులకు, కూతుర్లకు ప్రేమతో తమ జెర్సీలపై వారి పేర్లు ముద్రించుకున్నారు. ఈ సందర్భంగా ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిధిగా విచ్చేసిన చరిత్రకారుడు ధరేంద్రకుమార్ను నిర్వహకులు ఘనంగా సత్కరించారు.




























