యాగర్లపల్లిలో రూ. 2.10 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకు
- 86 Views
- wadminw
- October 26, 2016
- రాష్ట్రీయం
ఏలూరు, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని అన్ని వార్డులలో పూర్తి స్ధాయిలో మౌలికవసతులు కల్పించి రానున్న 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. బుధవారం 24వ వార్డు యాగర్లపల్లిలో 2 కోట్ల 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించే ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి మంత్రి శంఖుస్ధాపన చేసారు. 9 లక్షల లీటర్లు సామర్ధ్యం కలిగిన ఈఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం వలన రామచంద్రరావుపేట, యాగర్లపల్లి, తాళ్లముదునూరుపాడు, చంద్రబాబునాయుడు కాలనీ, భాగ్యలక్ష్మీపేటలకు మంచినీరు సరఫరా చేయవచ్చునని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. సుమారు 12 వేలమంది వార్డులలోని ప్రజలకు నీటిసరఫరా అవుతుందని చెప్పారు. పట్టణంలోని ముంపు ప్రాంతాలలో డ్రైన్లు ద్వారా మురుగునీరు పోయేందుకు 2 కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టడం పట్టణ అవుట్‌లెట్‌లో మురుగునీరు చేరేవిధంగా చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం అమృత పధకం ద్వారా మంజూరు చేసిన నిధులతో పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణ 2వ టౌన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పట్టణంలో మంచినీరు సరఫరాకు శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారు. డంపింగ్ యార్డులలో చెత్తద్వారా విద్యుత్తు తయారు చేసేవిధంగా పవర్ జనరేషన్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి చెప్పారు. తాడేపల్లిగూడెంలో పరిశుభ్రతా వాతావరణం నెలకొని దోమలు, దుమ్ము లేని తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి ఈసందర్భంగా చెప్పారు. కాపు కార్పోరేషన్ డైరెక్టరు వై. నవీన్ మాట్లాడుతూ పట్టణంలో మంచినీటి నివారణకు చర్యలు తీసుకునేందుకు విజ్జేశ్వరం పైపులైన్లు పూర్తికావాల్సి ఉందని తద్వారా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అన్నారు. మున్సిపల్ ఛైర్మన్ బోలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలో జనాభాకు అనుకూలంగా మౌలికవసతులు కల్పించవలసి ఉందన్నారు. అమృత పధకంలో 24 కిలోమీటర్లు మేర పైపులైన్ల నిర్మాణం చేపట్టి పట్టణ శివార్లలో మంచినీటికొరతలేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఎగ్గిన నాగబాబు, కమిషనర్ నిమ్మలగడ్డ బాలాజీ, వైస్ ఛైర్మన్ కిలాడి ప్రసాద్, కౌన్సిలర్లు ఇందన సత్యవతి, స్వాతి, కోట రాంబాబు, మున్సిపల్ ఇంజినీర్లు పి. త్రినాధరావు, యం. బ్రహ్మాజీ, యువమోర్చా అధ్యక్షులు నవీన్ కుమార్, శాంతకుమార్, యం. వెంకటేశ్వరరావు, కో ఆప్షన్ సభ్యులు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


