యూపీ సీఎంగా అఖిలేష్ కొనసాగుతారు: ఎస్పీ
- 86 Views
- wadminw
- January 6, 2017
- Home Slider జాతీయం
లక్నో, అక్టోబర్ 25: సమాజ్‌వాది పార్టీలో దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ సాధించడమే తమ ఏకైకా ఎజెండా అని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లోను తమ పార్టీదే విజయమని గంటాపదంగా చెప్పారు. ఎన్నికల్లో గెలుపే ఎజెండాగా పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు. తన సోదరుడు, మాజీ మంత్రి శివపాల్‌యాదవ్ తదితరులతో కలిసి మంగళవారంనాడు ములాయం మీడియా సమావేశంలో మాట్లాడారు.
తమ కుటుంబంలో కాని, పార్టీలో కాని ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ, తమ కుటుంబం ఐక్యంగా ఉన్నాయని ఆయన అన్నారు. పార్టీలో నేతలంతా సమైక్యంగానే ఉన్నారని ఆయన చెప్పారు. రాంగోపాల్ మాటలను తాను పెద్దగా పట్టించుకోనని చెప్పారు.రామ్మనోహర్ లోహియా సిద్ధాంతాలకు తామంతా కట్టుబడి ఉన్నామని చెప్పారు. శివపాల్‌యాదవ్‌ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకువస్తారా అని ప్రశ్నించగా జవాబు దాట వేశారు. ప్రతి విషయంలోను అమర్‌సింగ్ పేరును ఎందుకు తీసుకువస్తారని ములాయం మీడియాపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరని ప్రశ్నించగా జవాబును దాటవేశారు.
ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతే ముఖ్యమంత్రిని నిర్ణయిస్తామని ములాయం చెప్పారు. ప్రజలపై నాకు నమ్మకం ఉంది… నాపై ప్రజలకు నమ్మకం ఉంది. వచ్చే ఎన్నికల్లోను మా గెలుపు తధ్యం. అని ములాయదం ధీమా వ్యక్తం చేశారు. తొలిగించిన మంత్రుల విషయంలో అఖిలేష్ నిర్ణయం తీసుకుంటారని మరో ప్రశ్నకు ఆయన జవాబు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అఖిలేష్ కొనసాగుతారని చెప్పారు. అఖిలేష్ నాయక్వంపై తమకు ఎలాంటి సందేహం లేదని మరో ప్రశ్నకు జవాబు ఇచ్చారు.
కాగా పార్టీ అధినేత ములాయం సింగ్ నిర్వహించిన ఈ మీడియా సమావేశానికి సీఎం అఖిలేష్ హాజరు కాకకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి అఖిలేష్, ఆయన తండ్రి ములాయం సింగ్, బాబాయ్ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో తీవ్ర కలవరం సృష్టించిన నేపథ్యంలో పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ దిద్దుబాటు చర్యలకు పునుకున్నారు. అమర్‌సింగ్, శివపాల్ యాదవ్‌ల ప్రమేయాన్ని ముఖ్యమంత్రి అఖిలేష్ జీర్ణించుకోలేకపోయారు.పార్టీలో అంతర్గతంగా రగులుతున్న విబేధాల చిచ్చు, సీఎం బాబాయ్, అధినేత ములాయం సోదరుడు, మంత్రి శివపాల్ యాదవ్ సహా నలుగురిని మంత్రివర్గం నుంచి తొలగించడంతో పార్టీలోని విబేధాలు మరింత రచ్చకెక్కాయి.
ఈ నేపథ్యంలో అధితనే ములాయం సింగ్ యాదవ్ సోమవారంనాడు పార్టీ నేతలందరితో సమావేశమయ్యారు. ప్రజల్లో పార్టీ ప్రతిష్టదిగజారకుండా కలిసి ఉండాలని ఆయన నేతలకు సూచించారు. మరోవైపు, కన్న కొడుకు అఖిలేశ్ యాదవ్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ బహిష్కృత నేత రాంగోపాల్ యాదవ్ మండిపడ్డారు. ఎస్పీలో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభంలో ములాయం తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ పట్ల కొమ్ముకాస్తున్నారని, ఆయన తటస్థంగా ఉండటం లేదని విరుచుకుపడ్డారు.
‘‘2012లో అఖిలేశ్ పేరుతో ఎన్నికల్లోకి వెళ్లారు. ప్రజలు ఆయనకు సంపూర్ణ మెజారిటీ కట్టుబెట్టారు. అఖిలేశ్‌కు ప్రజాదరణ లేకపోతే ఆయన ఎలా గెలిచేవారు. అఖిలేశ్ లేకుంటే ఎస్పీ లేనట్టే’’ అని రాంగోపాల్ యాదవ్ మంగళవారం విలేకరులతో అన్నారు. పార్టీలో విభేదాలు ఎలా ఉన్నా నవంబర్ 3 నుంచి తలపెట్టిన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాలని అఖిలేశ్‌కు తాను సూచించానని, ఆయన ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పార్టీలో ఆధిపత్యాన్ని వహిస్తున్న బాబాయి శివ్‌పాల్ యాదవ్‌ను, ఆయన విధేయులను మంత్రివర్గం నుంచి అఖిలేశ్ తొలగించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా అఖిలేశ్ అనుకూల నాయకుడు, ములాయం కజిన్ సోదరుడు రాంగోపాల్ యాదవ్‌ను శివ్‌పాల్ యాదవ్ తొలగించారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీలో అంతర్గత వర్గపోరు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
సమాజ్ వాదీ పార్టీలో అంతా సవ్యంగా ఉందని ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్ అన్నారు. ములాయం సింగ్ యాదవ్ ఆదేశాలను శిరసావహిస్తానని చెప్పారు. సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం గురించి ఆయనను విలేకరులు ప్రశ్నించగా ‘‘ఎవ్రిథింగ్ ఈజ్ ఫైన్. నేతాజీ (ములాయం సింగ్) ఆదేశాలను పాటిస్తాను’’ అని సమాధానం ఇచ్చారు. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ములాయం ఎదుటే ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, శివపాల్ యాదవ్ తలపడ్డారు. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
వేదికపైనే గట్టిగా కేకలు వేసుకున్నారు. అఖిలేశ్ అబద్దాలకోరు అని శివపాల్ ధ్వజమెత్తారు. అఖిలేశ్ నుంచి ముఖ్యమంత్రి పదవిని లాక్కోవాలని ములాయంకు సూచించారు. తన తండ్రి తప్పుకోమంటే సీఎం పదవిని వదులుకోవడానికి సిద్ధమని అఖిలేశ్ ప్రకటించారు. చివరకు ఇద్దరి మధ్య ములాయం సయోధ్య కుదిర్చారు. శివపాల్ సహా తొలగించిన మంత్రులను తిరిగి కేబినెట్లో చేర్చుకునేందుకు అఖిలేశ్ అంగీకరించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ములాయం కుటుంబంలో రేగిన విభేదాలు సమాజ్ వాది పార్టీలో తీవ్ర కలకలం రేపాయి.


