యూరీ ఘటనపై దర్యాప్తు వేగవంతం
- 81 Views
- wadminw
- September 22, 2016
- అంతర్జాతీయం
శ్రీనగర్, సెప్టెంబర్ 22: జమ్మూ-కాశ్మీర్లో యూరీ సెక్టార్‌లోని సైనిక శిబిరంపై ఉగ్రదాడిపై దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఆరుగురు సభ్యులతో కూడిన ఎన్ఐఎ అధికారుల బృందం ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. యూరీ ఘటనకు ముందే ఉగ్రవాదులు సరిహద్దు మీదుగా దేశంలోకి చొరబడ్డారని అధికారులు గుర్తించారు. ఇద్దరు ఉగ్రవాదుల నుంచి రెండు రేడియో సెట్లను స్వాధీనం చేసుకున్నారు. యూరీ సెక్టార్ నుంచి ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు, ఉరీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్ న్యూఢిల్లీలో పిల్లిమొగ్గలు వేసేందుకు ప్రయత్నించింది. ఢిల్లీలో జరుగుతున్న సార్క్ సదస్సుకు కేవలం జూనియర్ స్థాయి అధికారులను పంపించి భారత్‌ను చిన్నబుచ్చే ప్రయత్నం చేసింది. 18 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఉరీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్ దౌత్యపరంగా ఏకాకిని చేయాలని భారత్ నిర్ణయించడంతోపాటు, ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకునే దిశగా సాగుతున్న నేపథ్యంలో పాక్ ఈ చర్యకు పాల్పడింది. దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక యంత్రాంగాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో సార్క్‌కు చెందిన అత్యున్నత నిపుణుల బృందం ఢిల్లీలో రెండురోజుల సదస్సు నిర్వహిస్తున్నది. ఈ సదస్సుకు పాకిస్థాన్ సీనియర్ దౌత్యవేత్తలను కాకుండా కౌన్సెలర్ స్థాయి జూనియర్ అధికారులను పంపించి ఈ సదస్సుకు పెద్దగా ప్రాధాన్యం లేదన్నట్టు వ్యవహరించింది.
సార్క్ సదస్సును అవమానించేలా పాకిస్థాన్ తీరు ఉండటం గమనార్హం. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ (సార్క్)లో భారత్, పాకిస్థాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మల్దీవులు సభ్యదేశాలుగా ఉన్నాయి. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ దినేశ్వర్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు పాకిస్థాన్ మినహా అన్ని దేశాలు సీనియర్ దౌత్యవేత్తలను పంపించాయి. పాక్ నుంచి ఈ సదస్సుకు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ స్థాయి అధికారి హాజరుకావాల్సి ఉండగా ఇద్దరు జూనియర్లను ఆ స్థానంలో పంపించి.. దురుసుగా వ్యవహరించింది. సార్క్ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక యంత్రాంగం ఏమేరకు పనిచేస్తున్నదో సమీక్షించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇండోనేషియాలో వర్షాలకు 26 మంది మృతి
జకర్తా, సెప్టెంబర్ 22: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి, వరదలు వచ్చి 26 మంది చనిపోయారు. మరో 19 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి రెండు నదులు ఉప్పొంగడంతో ఒక్క గారట్ జిల్లాలోనే 17 మంది మరణించగా, 13 మంది కనిపించకుండా పోయారు. చనిపోయిన వారిలో 8 నెలల పసికందుతోపాటు 8 మంది చిన్నపిల్లలున్నారని అధికారులు గురువారం వెల్లడించారు. ఇండోనేషియాలో జూన్ లో కురిసిన భారీ వర్షాలకు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈజిప్టు మధ్యధరా సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. శరణార్థులను తీసుకు వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. 400 మంది గల్లంతు అయ్యారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదం కర్ఫ్ ఎల్ షేక్ వద్ద చోటు చేసుకుందని… ఈ ప్రమాదం జరిగిన సమయంలో 600 మంది శరణార్థులు బోటులో ఉన్నారని చెప్పారు. వారంతా ఈజిప్టియన్లు, సరియన్లు, సుడాన్ వాసులు, సోమాలియాకు చెందిన వారని వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బోటులో ప్రయాణిస్తున్న 150 మందిని కోస్ట్ గార్డు సిబ్బంది కాపాడరని పేర్కొన్నారు. వారిని రషిద్ నగరంలోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
పాక్‌కు వ్యతిరేకంగా న్యూజెర్సీలో భారతీయుల ర్యాలీ
న్యూజెర్సీ, సెప్టెంబర్ 22: అమెరికన్ ఇండియన్ కమ్యునిటి, అమెరికన్ ఫ్రెండ్స్ ఆఫ్ బలూచిస్తాన్ కలిపి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఫర్ పాకిస్థాన్ నిర్వహించిన ఈ ర్యాలీలో అమెరికాలో ఉంటున్న అనేక మంది భారయతులు పాల్గొని తమ నిరసనను తెలిపారు. పాకిస్థాన్ దేశం టెర్రరిజం ని మిగితా దేశాలకు పంపడం, కాశీర్మర్-ఉరిలో ఆర్మీపై జరిగిన దాడి, న్యూయర్క్, న్యూజెర్సీలో జరిగిన బాంబుల కుట్ర వెనుక నిందితుడు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉండడ, పాకిస్థాన్ దేశంను టెర్రరిజం దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని డిమాండ్ చేశారు. ఈ మధ్యకాంలో పాకిస్థాన్ దేశం టెర్రరిజంకి నిధులు అందించడం, మైనార్టీ అయినా హిందువులు, సిక్కులు, బలూచిస్తాన్ మీద భౌతిక దాడులు చేయడం లాంటి వంటిపై నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమలో కృష్ణారెడ్డి, ఏనుగుల అడపాప్రసాద్, జయేష్పటేల్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, ఊహించినట్టుగానే ‘డ్రాగన్’ చైనా దాయాది పాకిస్థాన్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే, వ్యూహాత్మకంగా కశ్మీర్ అంశం, ఉడీ ఉగ్రవాద దాడి అంశాలపై మౌనం వహించినట్టు చైనా మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లో చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. అన్ని కాలాల్లోనూ వ్యూహాత్మక భాగస్వాములైన చైనా-పాక్ పరస్పరం గట్టి మద్దతు ఇచ్చుకుంటున్నాయని, వాటి స్నేహం చెక్కుచెదరనిదని షరీఫ్‌తో భేటీ అనంతరం లీ పేర్కొన్నట్టు చైనా ప్రభుత్వ మీడియా జిన్హుహా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పాకిస్థాన్‌కు అన్నివిధాలా ఆచరణాత్మక సహకారం అందించేందుకు చైనా సిద్ధంగా ఉందని, ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఉమ్మడిగా కృషి చేస్తున్నదని లీ అన్నారు. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్ (సీపీఈసీ)పై పరస్పర సహకారం ద్వారా మంచి పురోగతి సాధించినట్టు లీ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా పాక్‌తో అత్యున్నత సంబంధాలు కొనసాగించేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్టు లీ అన్నారని జిన్హుహా పేర్కొంది. అయితే పాకిస్థాన్ మీడియా మాత్రం ఈ భేటీపై తనకు అనుకూలంగా కథనాలు రాసుకుంది. కశ్మీర్‌పై పాక్ వైఖరికి చైనా మద్దతును కొనసాగిస్తామని లీ షరీఫ్‌కు చెప్పినట్టు డాన్ దినపత్రిక చెప్పుకొచ్చింది. ’మేం పాకిస్థాన్‌కు మద్దతునిస్తాం. ప్రతి వేదికపై ఆ దేశం కోసం మాట్లాడుతాం’ అని లీ షరీఫ్‌కు హామీ ఇచ్చినట్టు ’డాన్’ రాసుకొచ్చింది. కశ్మీర్‌పై పాక్ వైఖరికి చైనా గొప్ప ప్రాధాన్యాన్ని ఇస్తున్నదని, పాకిస్థాన్ స్వయంగా ఉగ్రవాద బాధిత దేశమని చైనా పేర్కొన్నదని ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది.


