రజకుల సంక్షేమానికి కృషి: రాజమండ్రి నారాయణ వెల్లడి
- 103 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, సెప్టెంబర్ 21 (న్యూస్టైమ్): తూర్పు గోదావరి జిల్లా రజక సంక్షేమ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి రజక సంక్షేమం కోసం ప్రభుత్వ కేటాయించిన నిధులు పూర్తిగా సద్వినియోగమయ్యేట్లు చూడాలని ఆంధ్రప్రదేశ్ రజక సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ రాజమండ్రి నారాయణ అధికారులను కోరారు. బుధవారం ఉదయం కాకినాడ ఆర్అండ్బి అతిధి గృహంలో ఆంధ్రప్రదేశ్ రజక సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ విూడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమాఖ్య కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాఖ్య చైర్మన్గా తాను నియమితులైనప్పటి నుండి వివిధ జిల్లాల్లో పర్యటించి రజక సంక్షేమం కోసం అమలౌతున్న కార్యక్రమాలను అధికారులతో సవిూక్షిస్తున్నానన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గత 3 సంవత్సరాలుగా జిల్లా రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు కాకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాకు 2014-15 సంవత్సరానికి రజక సంక్షేమం కొరకు 7 కోట్లు నిధులు ప్రభుత్వం కేటాయిస్తే కేవలం 4 కోట్లు మాత్రమే ఖర్చు చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. రజక సంక్షేమం పట్ల జిల్లా అధికారులలో చిత్తశుద్ది కొరవడిందని, పెడరేషన్ చైర్మన్ హోదాలో జిల్లాలో పర్యటిస్తున్న తనకు తగిన ప్రొటోకాల్ మర్యాదలు కూడా పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, జిల్లా బిసి సంక్షేమాధికారి కన్వీనరుగాను, జిల్లా పోలీసు సూపరింటెండెంట్, డిసిఓ, డిపిఓ, తదితర అధికారులు సభ్యులుగా నెల రోజుల్లోపు జిల్లా రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలల కొకసారి బోర్డు విూటింగులు నిర్వహించాలని ఆయన జిల్లా అధికారులను కోరారు. రజకులను ఎస్సిలలో చేర్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో చేపట్టిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రజక సంఘాల ప్రతినిధులు గంధం రవికుమార్, కాకినాడ రామారావు, కట్టమూరి సత్తిరాజు, జిల్లా రజక సంఘాల ప్రతినిధులు గరజాపు శ్రీనివాసరావు, మురముళ్ల రాజబాబు, ఇరుసుమళ్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమమే లక్ష్యంగా తెదేపా సర్కారు పయనం: జడ్పీ చైర్మన్
ఏలూరు, సెప్టెంబర్ 21 (న్యూస్టైమ్): జిల్లాలో ప్రతీనెలా లబ్దిదారులైన పేదప్రజలకు 37 కోట్ల రూపాయలు పెన్షన్లుగా అందిస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వంకే చెందుతుందని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాపరిషత్తు ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. స్ధానిక జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా ప్రజాపరిషత్తు 2, 3, 4 స్ధాయి కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పి ఛైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేవలం 2.80 లక్షలమందికి ఐదు కోట్ల 60 లక్షల రూపాయలు పెన్షన్లుగా ఇచ్చేవారని తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక పెన్షన్లును ఐదురెట్లు పెంచి ఇవ్వడమే కాకుండా అర్హులైన మరింత మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఈవిధంగా ప్రతీ నెలా 37 కోట్ల రూపాయలను 3 కోట్ల 39 లక్షలమందికి ఆయా నెలల్లో 1వ తేదీ నుండి 5వ తేదీలోపు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇంకా అర్హత ఉన్నవారిని గుర్తించి 26 వేల మంది పేర్లను అప్లోడ్ చేసామని వీటిని మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో ఆన్లైన్ సిస్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఫింఛన్లు తీసుకునేవారిని ఎ క్కువుసేపు నిరీక్షించకుండా ఉండేలా వేగవంతంగా పెన్షన్లు బట్వాడా చేసేందుకు జిల్లాలో 1241 టాబ్స్,, ఐరిష్ వేలిముద్ర పరికరాలను అందజేసి ఒక్కొక్క టాబ్ ద్వారా ప్రతీరోజూ 150 మందికి ఫింఛన్లు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. స్వయం సహాయక సంఘాలను ఆర్ధికాభివృద్ధి చెందేలా తీర్చిదిద్దిన గొప్పతనం ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో 37 వేల 951 గ్రూపులకు రూ. 1224 కోట్ల రూపాయలు రుణాలుగా అందించగా ఈసంవత్సరం 46896 గ్రూపులకు 1027 కోట్ల రూపాయలు అందించాలని నిర్ణయించామన్నారు. ఇందులోభాగంగా ఇప్పటికే 10574 ఖాతాలకు రూ. 169.65 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసామన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హావిూ మేరకు ప్రతీ గ్రూపు సభ్యురాలికి పదివేల రూపాయలు చొప్పున మంజూరు చేసి తొలివిడతగా మూడు వేల రూపాయలను వారి గ్రూపు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఈవిధంగా జిల్లాలో 181 కోట్ల రూపాయలను ఆరు లక్షలమంది సభ్యులకు ఆన్లైన్ ద్వారా జమచేయడం అయ్యిందని బాపిరాజు చెప్పారు. ధాన్యంకొనుగోలు క్రింద గత రెండు సీజన్లలో సుమారు 80 కోట్ల రూపాయలను డ్వాక్రా గ్రూపులు కమిషన్ పొందగలిగాయని ఈనిధులతో ఏవిధమైన కార్యకలాపాలు నిర్వహించాలో మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించిందన్నారు. గ్రామసమాఖ్యలకు అందిన కమిషన్ ఖర్చుల వివరాలతో కూడిన జాబితాను ఆయా యంపిపిలు, జడ్పిటిసిలకు అందజేయాలన్నారు. జిల్లాలో డ్వాక్రా సంఘాలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు, రుణపంపిణీ, తదితర సమగ్ర సమాచారాన్ని సంబంధిత జడ్పిటిసిలు, యంపిపిలు, సర్పంచ్ల దృష్టికి తీసుకెళ్లాలని డిఆర్డిఏ అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో 44 స్త్రీశక్తిభవనాలు నిర్మాణంలో భాగంగా 42 పూర్తి చేసామన్నారు. గ్రామాలలో శ్మశానవాటికలు, పంచాయతిభవనాలు నిర్మించదలిచే వారు ముందుకువస్తే వాటికయ్యే పది లక్షల రూపాయల ఖర్చులో 7 లక్షల రూపాయలు ఉపాధిహామీ క్రింద అందిస్తామని మిగిలిన మూడు లక్షల రూపాయలు గ్రామస్ధుల నుండి సేకరించి తగు ప్రతిపాదనలతో ముందుకు వస్తే మంజూరు చేస్తామన్నారు. ఈవిషయంలో స్ధానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. ఈఏడాది 250 కోట్లరూపాయల ఉపాధిపనులు చేయాలని లక్ష్యంతో ముందుకువెళుతున్నామన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా వివిధ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటుచేయడంలో జాప్యంపై దేవదాయశాఖాధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయంలో ఉదాశీనతగా వ్యవహరించవద్దని వెంటనే సంబంధిత శాసనసభ్యుల సిఫార్స్లను తీసుకుని తక్షణమే ట్రస్ట్ బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. తదుపరి జిల్లా పరిషత్తు సమావేశం నాటికి ఈప్రక్రియ పూర్తికాకపోతే ఉన్నతస్ధాయి అధికారులకు ఫిర్యాదు చేస్తానని బాపిరాజు చెప్పారు. జిల్లాపరిషత్తు వైస్ ఛైర్మన్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన మూడవస్ధాయి కమిటీ సమావేశంలో వ్యవసాయం, పశుసంవర్ధక, అటవీ, మత్స్య, ఉద్యాన, తదితర శాఖల ప్రగతితీరుపై సవిూక్షించారు. ఈసందర్భంగా జిల్లాప్రజాపరిషత్తు ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులతో రైతులను నష్టపరిచేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. జడ్పిటిసి సభ్యులు సాగర్ మాట్లాడుతూ జిల్లాలో వరికిబదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కలిగించాలన్నారు. ముఖ్యంగా తుంపర, బిందు సేద్యంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. తాను సోయాబీన్లో అంతరపంటగా కంది పంట వేయడం జరిగిందని దీనిద్వారా మంచి దిగుబడులు సాధిస్తున్నామన్నారు. అదేవిధంగా మినుము, తదితర పప్పుధాన్యాల పంటలను కూడా వేసి మంచిఫలితాలు సాధిస్తున్నామని ఇటువంటి క్షేత్రాలను ఇతర రైతులకు చూపించి వారిని ప్రోత్సహించేలా వ్యవసాయశాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హైబ్రీడ్ కొబ్బరి వంగడాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దీనిపై జడ్పి ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు స్పందిస్తూ సీడ్ఫామ్ అభివృద్ధికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ఉపాధిహామితో సీడ్ ఉత్పత్తికి ప్రాజెక్టు రూపొందించి తీసుకువస్తే దీనిపై అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సామాజిక అటవీ వనవిభాగం ద్వారా ఉపాధిహామి నిధులతో పాఠశాలల నర్సరీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మొక్కలనాటి సంరక్షించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రస్తుతం నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు మరింత ఎత్తుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖాధికారులను ఆయన ఆదేశించారు. 4వ స్ధాయి కమిటీ సమావేశంలో వైద్య, ఆరోగ్యం, విద్య అంశాలపై సవిూక్షించారు. జిల్లాలో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, పైలేరియా, చికున్ గున్యా, అతిసార వంటివ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్య శాఖాధికారులను జడ్పి ఛైర్మన్ బాపిరాజు ఆదేశించారు. ప్రతీ గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను ఉద్యమ రూపంలో చేపట్టి దోమలపై సమరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జడ్పి వైస్ ఛైర్మన్ చింతల వెంకటరమణ, సిఇఓ డి. సత్యనారాయణ, జడ్పిటిసిలు ఈలి మోహినీ పద్మజారాణి, బండి రామారావు, జగదీష్, కాసరనేని విద్యాసాగర్, మన్నే లలితాదేవి, రొంగల రవికుమార్, విప్పర్తి దివాకరరావు, వ్యవసాయ శాఖ జేడీ సాయిలక్ష్మీశ్వరి, డ్వామా పిడి వెంకటరమణ, ఉద్యానవనశాఖ ఏడిలు దుర్గేష్, విజయలక్ష్మి, పశుసంవర్ధకశాఖ జేడీ జ్ఞానేశ్వరరావు, డిఇఓ మధుసూధనరావు, డియంహెచ్ఓ డాక్టర్ కె. కోటేశ్వరి, సర్వశిక్షాభియాన్ పిఓ డాక్టర్ బ్రహ్మానందరెడ్డి, అటవీ అధికారి నాగేశ్వరరావు, వయోజన విద్య డిడి యంఏ. రత్నకుమార్, మైక్రో ఇరిగేషన్ పిడి యస్. రామ్మెహన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు సిహెచ్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాధాన్యతారంగాల పనుల ప్రగతిపై కలెక్టర్ సమీక్ష
ఏలూరు, సెప్టెంబర్ 21 (న్యూస్టైమ్): పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు ఎరువులు అందించడానికి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వంద కోట్ల రూపాయలు ఏమయ్యాయని? ఎరువుల కంపెనీలు ఆసొమ్ము ఏమి చేసారని జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ ప్రశ్నించారు. స్ధానిక కలెక్టరు కార్యాలయంలో బుధవారం వ్యవసాయం, ఫిషరీస్, పశుసంవర్ధక, హార్టికల్చర్, సెరికల్చర్ వంటి ప్రాధాన్యతారంగాల పనుల ప్రగతిపై అధికారులతో కలెక్టరు సవిూక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు పారదర్శకంగా ఎరువులను అందించాలని ఇందుకు ఐటి టెక్నాలజీని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు ఏటా 20 కోట్ల రూపాయలు చొప్పున గత ఐదేళ్లలో వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు అందించిందని కలెక్టరు చెప్పారు. టన్ను ఎరువుకు 50 రూపాయలు చొప్పున టెక్నాలజీ అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ఎ రువుల కంపెనీలకు ఇచ్చిందని అయితే ఎక్కడా కూడా ఐటి అభివృద్ధికి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని అయితే ఈ వంద కోట్లరూపాయలు ఏమయ్యాయని దీనిపై సమగ్ర పరిశీలన చేస్తామని భాస్కర్ చెప్పారు. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలో ఎరువుల వ్యాపారులందరికీ ఇ-పాస్ యంత్రాలను ఉచితంగా అందించామని ప్రభుత్వపరంగా తాము సాంకేతిక అభివృద్ధికి ఇటీవల చేపట్టిన చర్యలు వలన ఎరువుల విక్రయాలలో పారదర్శకత కనిపిస్తోందని రాబోయే రోజుల్లో నూరుశాతం ఇ-పాస్ విధానం ద్వారా రైతులకు ఎరువులను అందించి రైతుకు మేలు చేయాలని కోరారు. బెంజికార్లు కొనుక్కోవడానికి జీరో పర్సంట్ వడ్డీకి రుణాలు ఇస్తారే గానీ, పేద రైతులు బ్రతకడంకోసం మాత్రం రుణాలివ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడంలేదన్నారు. వ్యవసాయం, ఉద్యానవనశాఖా, సెరీకల్చర్ వంటి శాఖలు రైతులకు సబ్సిడీలపై వారికి కావాల్సిన ఉపకరణాలను అందించాలని కలెక్టరు చెప్పినప్పుడు ఉపకరణాలకు సబ్సిడీ సొమ్ము పోనూ రైతులు చెల్లించాల్సిన మిగిలిన సొమ్ముకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తే పేదరైతులకు ఉపయోగకరంగా ఉంటుందని సెరీకల్చర్ ఉపసంచాలకులు సుబ్బరామయ్య కలెక్టరు దృష్టికి తీసుకురాగా కలెక్టరు స్పందిస్తూ ఉపకరణాల కిచ్చే సబ్సిడీలు పోనూ రైతులు చెల్లించాల్సిన మిగిలిన సొమ్ము ఖచ్చితంగా చెల్లించాల్సిందేనని ఆసొమ్ము కూడా బ్యాంకు రుణాలు అందించడం వీలు కాదన్నారు. బ్యాంకర్లు బెంజికార్లు కొనుగోలుకు జీరో పర్సంట్ వడ్డీకి బుహణాలిస్తారుగానీ, పేదరైతులకు రుణాలివ్వడానికి ముందుకు రావడం లేదని, ఉపకరణాలకు సంబంధించి సబ్సిడీలు పోనూ రైతులు చెల్లించాల్సిన సొమ్ముకు బ్యాంకు నుండి రుణాలు కోరితే బ్యాంకులు చుట్టూ తిరగడానికే రైతులకు సమయం సరిపోదని రైతులు ఇబ్బందులుపడే పరిస్ధితులు నెలకొంటాయని కలెక్టరు అన్నారు. ఉద్యానవనశాఖపై కలెక్టరు సవిూక్షిస్తూ ఉద్యానవనపంటలు తక్కువుఖర్చుతో ఎక్కువ ఉత్పత్తులు సాధించేలా అవసరమైన యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని అమలు చేయాలన్నారు. ఒకేపంటపై దృష్టి కేంద్రీకరించి అవసరానికి మించి ఉత్పత్తి చేస్తే డిమాండ్ తగ్గి రైతులు నష్టపోయే అవకాశం ఉంటుందని కాబట్టి అన్నీకూరగాయలు, అరటి వంటి పంటలపై సమానంగా దృష్టి కేంద్రీకరించి తక్కువుఖర్చుతో ఎక్కువ ఉత్పత్తులు ఎలా సాధించవచ్చునో రైతులతో సమావేశాలు ఏర్పాటుచేసి వారిలో అవగాహన కల్పించాలన్నారు. అధికారులు వారానికి రెండుసార్లయినా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తే అధికారులపట్ల గౌరవభావం ఏర్పడుతుందని రైతుల్లో ఒక నమ్మకం ఏర్పడి అధికారుల సూచనలు, సలహాలు ఖచ్చితంగా పాటిస్తారన్నారు. అధికారులు క్షేత్రస్ధాయిలో తిరిగితే ఆశించిన మంచిఫలితాలొస్తాయని రైతులకు దూరంగా ఉంటే ఫలితాలుఆశాజనకంగా ఉండవన్నారు. రైతులతో మమేకమవ్వడంవలన లోపాలు తెలుస్తాయని వాటిని సరిదిద్ది రైతులకు మేలు జరిగేలా సూచనలివ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ప్రధాన కారణం అధికారులు వారుపనిచేసేచోట నివాసముండక పోవడమేనని అధికారులు, ఫీల్డు సిబ్బంది వారు పనిచేసే చోటే నివాసముంటే రైతులకు 24 గంటలూ అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. అధికారులు వేరే ప్రాంతం నుండి రైతుల వద్దకు వెళ్లి రావాలంటే సుమారు ఐదారు గంటల సమయం అవుతుందని, ఇక రైతులు అందుబాటులో లేని సమయంలో అధికారులు వెళ్లినా ఫలితమేమింటుందని కలెక్టరు ప్రశ్నించారు. అధికారులు వారు పనిచేసే ప్రాంతంలోనే నివాసముండి రైతులు అందుబాటులో ఉండే సమయంలోనే వారితో కలిసి మాట్లాడితే ఖచ్చితమైన మంచి ఫలితాలొస్తాయని ఆశించిన లక్ష్యాలు సులభంగా చేరుకోవచ్చునని కలెక్టరు చెప్పారు. అధికారులు రైతులకు ఏఏ ఉపకరణాలు కావాలో అడిగి తెలుసుకుని వాటిని మాత్రమే నాణ్యమైనవి సరఫరా చేస్తే బాగుంటుందని వివిధ కంపెనీలు సూచించేవి నాణ్యతలేనివీ రైతులకు అందిస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండబోదని కలెక్టరు చెప్పారు. ఇ-పాస్ విధానం ద్వారా రైతులకు పదిరోజులక్రితం 20 వేల టన్నుల ఫెర్టిలైజర్స్ అందించామని వ్యవసాయ శాఖాధికారులు చెప్పి ఇప్పుడు లక్షటన్నులు సరఫరా చేసామని చెప్పడంపై ఈపదిరోజుల్లో 80 వేల టన్నులు ఫర్టిలైజర్స్ ఇ-పాస్ ద్వారా సరఫరా చేసామని చెప్పడంపై కలెక్టరు అనుమానం వ్యక్తం చేస్తూ తప్పుడు లెక్కలు చూపిస్తే కఠినచర్యలు తీసుకుంటానని వ్యవసాయ శాఖా జేడీ సాయిలక్ష్మీశ్వరిని హెచ్చరించారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఉత్సాహంగా పనిచేసే ఫీల్డు సిబ్బందిని ఇతర సిబ్బందిని ప్రోత్సహించాలని టెక్నాలజీని కూడా వాడడం నేర్చుకోవాలని సాయిలక్ష్మీశ్వరిని కలెక్టరు భాస్కర్ సూచించారు. ఈ సమావేశంలో సిపిఓ టి. సురేష్కుమార్, ప్లానింగ్ శాఖ డిడి సాంబశివరావు, ఉద్యానవనశాఖ ఏడిలు దుర్గేష్, విజయలక్ష్మి, సెరీకల్చర్ డిడి సుబ్బరామయ్య, పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ కె. జ్ఞానేశ్వర్, అగ్రికల్చర్ జేడీ సాయిలక్ష్మీశ్వరి, మార్కెటింగ్ శాఖ డిడి కె. ఛాయాదేవి, ఏపియంఐపి పిడి యస్ రామ్మెహన్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


