రహదారి భద్రతపై నిర్లక్ష్యం వీడండి: కలెక్టర్
రహదారి ప్రమాదాల నివారణకు సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వీడి రహదారులపై సురక్షితంగా ప్రయాణించే పరిస్థితులు కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం జరిగిన సమావేశంలో జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేసే గ్రామీణ, మండల, జిల్లా రహదారుల కూడళ్లలో రక్షణ ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పోలీసుశాఖ ఎందుకు నిర్లక్ష్యం వహించిందని డీఎస్పీ శ్రీనివాసరావును ప్రశ్నించారు.
గత రెండు నెలల్లో జరిగిన ప్రమాదాల్లో అధికారికంగా 39 మరణించారన్నారు. అనధికారికంగా 70 మందికిపైగా మరణించి ఉంటారన్నారు. ఇలా అయితే ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుతామని కలెక్టర్ ప్రశ్నించారు. రహదారులు, భవనాలశాఖ, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా జిల్లాలో ప్రతి రోడ్డు క్రాసింగ్ వద్ద కచ్చితంగా రుంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వీటి వల్ల కూడళ్లలో వాహనాల వేగం తగ్గడంతో పాటు ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఏడాది కాలంలో 4,500 మంది పట్టుబడితే 25 మందికి మాత్రమే శిక్ష పడటం చూస్తుంటే అధికారుల తీరు అర్థమవుతోందన్నారు. ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రవాణాశాఖ ఉప కమిషనర్ సత్యనారాయణమూర్తి, ఆర్అండ్బీ శాఖ పర్యవేక్షకురాలు నిర్మల, ఆర్టీసీ ఆర్ఎం ధనంజయరావు, డీఎంహెచ్వో కోటేశ్వరి, ఎక్సైజ్ డీసీ వైవీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


